AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిప్యూటీ సీఎం పవన్‌కు రిపోర్టింగ్ చేసిన కుంకీలు.. నెక్ట్స్ పోస్టింగ్ ఎక్కడంటే..?

కమాండర్స్ జయంత్, అభిమన్యు.. బ్యాచ్ నంబర్ -2024. ట్రైన్డ్ ఎట్ పలమనేరు. టాపర్ ఇన్‌ది బ్యాచ్. అడవిలో ఆరాచకం సృష్టించే అడవి ఏనుగులకు నాయకులు. పలమనేరు ఎలిఫెంట్ పార్క్‌లో శిక్షణ తీసుకున్న కుంకీ ఏనుగులు. ఇప్పుడు మరో కీలక ఆపరేషన్‌కు రెడీ అయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు రిపోర్టింగ్ కూడా చేసేశాయి. మరి వాటి ప్రత్యేకతలేంటి. పార్వతీ పురంలో వాటి ఆపరేషన్ ఎలా ఉండబోతోంది. ?

డిప్యూటీ సీఎం పవన్‌కు రిపోర్టింగ్ చేసిన కుంకీలు.. నెక్ట్స్ పోస్టింగ్ ఎక్కడంటే..?
Kunki Elephants
Ram Naramaneni
|

Updated on: Jul 24, 2026 | 1:56 PM

Share

రెండు కుంకీ ఏనుగులు పలమనేరు టు పార్వతీపురం మన్యం జిల్లాకు బయలుదేరాయి. చిత్తూరు జిల్లా ముసళ్లమడుగు ఎలిఫెంట్ పార్క్‌లో కఠోర శిక్షణ తీసుకున్న జయంత్, అభిమన్యులను అధికారులు పార్వతీపురం మన్యం జిల్లాకు తరలిస్తున్నారు. అక్కడ అడవి ఏనుగుల సంచారం, మానవ–ఏనుగు ఘర్షణలను నియంత్రించే ప్రత్యేక ఆపరేషన్‌లో ఇవి పాల్గొననున్నాయి. పలమనేరు నుంచి బయల్దేరిన ఈ రెండు కుంకీలు ఇప్పటికే పలు ఆపరేషన్లలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి కూడా.

పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు సంఘర్షణల నివారణ చర్యలను బలోపేతం చేసే దిశగా పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద స్వాగతం పలికారు. గజరాజులకు మార్గమధ్యంలో పూలు చల్లి స్వాగతం పలికిన పవన్.. వాటికి స్వయంగా ఆహారం అందజేశారు. అనంతరం గుచ్చిమి శిబిరానికి బయలుదేరిన కుంకీల రెండో అంచె ప్రయాణాన్ని జెండా ఊపి సాగనంపారు.

ఈ సందర్భంగా ప్రయాణంలో కుంకీల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. గుచ్చిమి క్యాంపునకు చేరిన అనంతరం నిపుణుల పర్యవేక్షణలో అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జయంత్, అభిమన్యుల సేవలు పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో మానవ-ఏనుగు ఘర్షణల నియంత్రణకు ఎంతో ఉపయోగపడనున్నాయని ఈ సందర్భంగాపవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలను కూటమి ప్రభుత్వం శాస్త్రీయ, మానవీయ విధానాలతో చేపడుతున్న చర్యల్లో భాగంగా కుంకీలను తరలిస్తున్నామని అన్నారు.

Kunki Elephant Mission

Kunki Elephant Mission

ఒడిశా వైపు నుంచి ఏనుగులు

ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి ఏనుగుల గుంపులు తరచూ పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశిస్తూ పంటలు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో, మానవ-ఏనుగు ఘర్షణల నివారణకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ కుంకీ ఏనుగులను గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్నారు. మానవ-ఏనుగు ఘర్షణల నివారణ చర్యల్లో భాగంగా కుంకీ ఏనుగులైన జయంత్, అభిమన్యులను వినియోగిస్తారు. గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో నిర్వహించిన పలు కీలక ఆపరేషన్లలో ఈ రెండు కుంకీ ఏనుగులు కీలక పాత్ర పోషించాయి. అడవి ఏనుగుల గుంపులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు మళ్లించడంలో ఎంతో చురుకుగా వ్యవహరించాయి.

కుంకీ ఏనుగులంటే మామూలు ఏనుగులే. కాకపోతే వాటికి శిక్షణ ఉంటుంది. శిక్షణ పొందిన ఈ ఏనుగులను జనావాసాల్లోకి వచ్చే ఏనుగుల్లోకి వదులుతారు. వాటిని ఊళ్లకు దూరంగా తరమడమో లేదా మచ్చిక చేసుకోవడమో చేస్తాయి . ఒక కుంకీ ఏనుగును తయారు చేయడం అంటే నెలలు కాదు… ఏళ్ల తరబడి సాగే క్రమశిక్షణతో కూడిన శిక్షణ. మనుషుల ఆదేశాలను అర్థం చేసుకోవడం, అడవి ఏనుగుల ప్రవర్తనను గుర్తించడం, ప్రమాద సమయంలో నియంత్రణ కోల్పోకుండా వ్యవహరించడం వంటి అనేక దశలు పూర్తి చేసిన తర్వాతే ఒక ఏనుగు పూర్తి స్థాయి కుంకీగా మారుతుంది. అందుకే పలమనేరు ఎలిఫెంట్ పార్క్‌లో జరుగుతున్న ఈ శిక్షణ దేశవ్యాప్తంగా అటవీ శాఖలకు ఆదర్శంగా నిలుస్తోంది.

అడవి ఏనుగులను అదుపు చేసే కమాండర్సే కుంకీలు. ట్రైనర్స్ ఆదేశాలకు అనుగుణంగా స్పదించే గుణం వీటికుంటుంది. రెస్క్యూ ఆపరేషన్లలో కీలక పాత్ర వహిస్తాయి. అడవిలో గంటల తరబడి పనిచేసే సామర్థ్యం ఉంటుంది. ఘర్షణ ప్రాంతాల్లో ముందుండే ధైర్యం వీటి సొంతం. వన్యప్రాణి సంరక్షణలో నమ్మకమైన సహచరులు కుంకీ ఏనుగులే.

Follow Us