భారతీయులకు హెచ్-1బీ వీసాల జారీపై ఆందోళన.. వర్క్ వీసాలు ఇవ్వొద్దంటున్న ఇమ్మిగ్రేషన్ అడ్వొకసీ గ్రూపు

భారతీయ అమెరికన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అడ్వొకసీ గ్రూపు భారతీయులకు కొత్తగా హెచ్-1బీ వీసాలు జారీ చేయొద్దని జో బైడెన్ ప్రభుత్వానికి కోరింది.

  • Balaraju Goud
  • Publish Date - 10:10 am, Fri, 12 February 21
భారతీయులకు హెచ్-1బీ వీసాల జారీపై ఆందోళన.. వర్క్ వీసాలు ఇవ్వొద్దంటున్న ఇమ్మిగ్రేషన్ అడ్వొకసీ గ్రూపు

Joe Biden so h1 visa : అమెరికా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఇమ్మిగ్రేషన్ విధానంపై కసరత్తు మొదలు పెట్టింది. నైపుణ్యం కలిగిన విదేశీయులకు యుఎస్‌లోకి అనుమతించాలని ప్రయత్నిస్తుంది. దీంతో భారతీయ అమెరికన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అడ్వొకసీ గ్రూపు భారతీయులకు కొత్తగా హెచ్-1బీ వీసాలు జారీ చేయొద్దని జో బైడెన్ ప్రభుత్వానికి కోరింది. గ్రీన్‌కార్డుల విషయమై దేశాలవారీ పరిమితి(కంట్రీ-క్యాప్)పై నెలకొన్న సందిగ్ధత తొలిగిపోయే వరకు భారతీయులకు హెచ్-1బీ వర్క్ వీసాలు ఇవ్వొద్దని పేర్కొంది.

ఇప్పటికే గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయుల సంఖ్య భారీగా ఉన్నందున.. మళ్లీ కొత్తగా వీసాలు జారీ చేస్తే ఈ సమస్య మరింత జఠిలం అవుతుందని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ వినతి పత్రం సమర్పించింది. ఈ ఏడాది కొత్తగా మరో 60వేల మంది వరకు భారతీయులు వీసాలు పొందే అవకాశం ఉందని, దీంతో గ్రీన్‌కార్డుల కోసం మరింత కాలం వేచి చూడాల్సి పరిస్థితి ఏర్పాటుతుందని పేర్కొంది. ఈ ఏడాది కూడా లాటరీ పద్దతిలోనే హెచ్-1బీ వీసాలు ఇవ్వనున్నట్లు ఇటీవల బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఇండియన్ ఇమ్మిగ్రేషన్ అడ్వొకసీ ఈ విన్నపం చేసింది.

ఇక 2022 ఏడాదికి గాను మార్చి 9 నుంచి హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని ఇప్పటికే బైడెన్ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. యుఎస్‌లో 11 మిలియన్ల నమోదుకాని వలసదారులకు పౌరసత్వం జారీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని బైడెన్ సూచించారు. దీంతో ఎక్కువ మంది విదేశీ విద్యార్థులు, ఉద్యోగులు యుఎస్‌లోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది.

ఆల్ఫాబెట్ ఇంక్, గూగుల్, ఆపిల్ ఇంక్,ఫేస్‌బుక్ ఇంక్ వంటి సంస్థలు యుఎస్ లోకి టెక్ ఉద్యోగులను అనుమతించే సంఖ్యను పెంచాలని కొన్నేళ్లుగా ఒత్తిడి చేస్తున్నాయి. తగినంత నైపుణ్యం కలిగిన అమెరికన్లు లేనందున తమకు భారతదేశం వంటి దేశాల నుండి ఇంజనీర్లు అవసరమని చెప్పారు. కానీ హెచ్ -1 బి వీసాల ద్వారా శ్రామిక శక్తిని విస్తరించే ప్రయత్నాలను యూనియన్లు, ఇమ్మిగ్రేషన్ ప్రత్యర్థులు అడ్డు తగులుతున్నాయి. తక్కువ జీతాలతో విదేశీయులను నియమించుకోవటానికి యుఎస్ ప్రతిభను కంపెనీలు పట్టించుకోలేదని వాదించారు.

బైడెన్​ బృందం తీసుకున్న నిర్ణయంతో ఈ ఏడాది 60వేల మంది భారతీయులు వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశముందని ఇమ్మిగ్రేషన్ వాయిస్ సంస్థ ప్రెసిడెంట్ అమన్ కపూర్ తెలిపారు. ప్రతిభలేని ఉద్యోగులు, వలసవాదుల వీసాల ప్రాసెసింగ్​తో ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులతో పాటు మరికొందరు మాత్రమే బైడెన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో లాభపడతారని ఆయన పేర్కొన్నారు.

అయితే, గ్రీన్‌కార్డులపై దేశాలవారీగా ఉన్న పరిమితి తొలిగిపోయే వరకు భారతీయులకు కొత్తగా వీసాలు జారీ చేయకపోవడం మంచిదని అమన్ కపూర్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ మళ్లీ కొత్తగా వీసాలు ఇస్తే.. ఇంతకుమునుపే గ్రీన్‌కార్డుల కోసం చాలాకాలంగా వేచి చూస్తున్న భారతీయులు మరిన్ని ఏళ్లు వెనక్కి వెళ్లిపోతారని చెప్పారు. కాగా, ప్రతి యేటా అగ్రరాజ్యం 85,000 కొత్త హెచ్-1బీ వీసాలు జారీ చేస్తుంది. వీటిలో సుమారు 70 శాతం వీసాలు(దాదాపు 60వేలు) భారతీయ వర్కర్లకు జారీ అవుతున్నట్లు ఇమ్మిగ్రేషన్ అడ్వొకసీ గ్రూపు వెల్లడించింది.

Read Also…  టెక్సాస్‌‌లో బీభత్సం సృష్టించిన రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. ఒకటిన్నర మైళ్ల మేర దెబ్బతిన్న వాహన శ్రేణి