Jandhyala :అపహాస్యం పాలైపోతున్న సినిమాకు ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించిన జంధ్యాల

పొద్దున లేచిందగ్గర్నుంచి ఒకటే టెన్షన్‌. పోనీ రాత్రుళ్లైనా హాయిగా నిద్రపడుతుందా అంటే అదీ లేదూ! జీవితం రోటినయ్యాక నిద్రేం పడుతుంది! అసలే ఇది కరోనా కాలం. రోజూ కరోనా వార్తలు వినివిని విసుగెత్తిపోతోంది. ఒకింత భయం కూడా కలుగుతోంది.

Jandhyala :అపహాస్యం పాలైపోతున్న సినిమాకు ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించిన జంధ్యాల
Jandhyala
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 19, 2021 | 12:13 PM

Jandhyala: పొద్దున లేచిందగ్గర్నుంచి ఒకటే టెన్షన్‌. పోనీ రాత్రుళ్లైనా హాయిగా నిద్రపడుతుందా అంటే అదీ లేదూ! జీవితం రోటినయ్యాక నిద్రేం పడుతుంది! అసలే ఇది కరోనా కాలం. రోజూ కరోనా వార్తలు వినివిని విసుగెత్తిపోతోంది. ఒకింత భయం కూడా కలుగుతోంది. థర్డ్‌వేవ్‌ వచ్చేస్తుందన్న వార్తలు కునుకులేకుండా చేస్తున్నాయి. ఏం దీనికి మందే లేదా? కాస్తంత రిలాక్సయ్యే ఛాన్సే లేదా? అంటే ఎందుకు లేదు? ఓ అయిదు జంధ్యాల సినిమాలు వరుస పెట్టి చూసేస్తే సరి! అంతా సర్దుకుంటుంది. రోగాలు రోష్టులు సమస్తం మాయం. వాడిన పువ్వులా వున్న మనిషి కాస్త చలాకీ రాజాలా తయారవ్వడం గ్యారంటీ. అది జంధ్యాల గొప్పదనం. ప్రజల నాడి మాబాగా తెలిసిన వైద్యుడాయన. పొద్దస్తమానం చిటపటలాడేవారి మొహాలపై కూడా నవ్వులు పూయించగల హాస్యబ్రహ్మ ఆయన.. హాయిగా నవ్వుకున్న ప్రతీసారి ఆయన గుర్తుకొస్తాడు. ఇంకాస్త నవ్వండయ్యా బాబూ …ఆరోగ్యానికి మంచిదని గుర్తుచేస్తాడు. ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించి. మరో చోట ఆ బాధ్యతను నిర్వర్తించడానికి వెళ్లిపోయిన రోజుది.

తెలుగు సినిమా అపహాస్యం పాలెక్కువై. అపహాస్యం పాలై పాలిపోతున్న తరుణంలో జంధ్యా మారుతంగా వీచి ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించిన యోగి జంధ్యాల. ఆయన సంభాషణలు చమత్కారాల పరిమళాలు. అశ్లీల దుర్గంధాలు అంటని చెమక్కులు.నవ్వుకు పెట్టని కోటలు. నవ్వుల పువ్వుల తోటలు. నవ్వనని భీష్మించుకొని కూచున్నవారిని కూడా నవ్వేలా చేయగలిగిన హాస్య బ్రహ్మ ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే అరవైనాలుగు కళల పూర్ణచంద్రుడు జంధ్యాల. నవ్వు చేటని ఏ ఏడుపుగొట్టు మొహంగాడో అని వుంటాడు.. నవ్వడం చేతకాని ఏ దద్దమ్మో చెప్పి వుంటాడు. నవ్వటం భోగం. నవ్వించటం యోగం. నవ్వకపోవటం రోగం.. ఆ మాటకొస్తే జంధ్యాలను మించిన యోగిపుంగవుడు వుండడు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. కళ్లలో నీళ్లు తిరిగేలా నవ్వించాడు. ఆయన హాస్యమెప్పుడూ పండేదే కానీ ఎండేది ఎప్పుడూ లేదు. హాయిగా హాస్యం చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. హ్యుమరు ఆరోగ్యానికి మంచిది.. ఆ హ్యుమరే ఆరోగ్యంగా లేకపోతే అది హేమర్‌ అవుతుంది. అందుకే జంధ్యాల సుత్తి లేకుండా సూటిగా మాటలు చెబుతాడు. చెప్పిస్తాడు.

జె.వి.డి.ఎస్‌.శాస్త్రి .అంటే జంధ్యాల వెంకట దుర్గా శివసుబ్రహ్మణ్యశాస్త్రి.. పేరంత పెద్ద మనసాయనది. మనిషి జీవితం బాధల, సమస్యల మయమై వుంటుంది. అలాంటి మనిషి సినిమాకొచ్చినపుడు కాస్త నవ్వులు పంచి నవ్వించాలన్నదే ఆయన ధ్యేయం. అందుకే ఆయన ఎక్కువగా హాస్య రస ప్రధానమైన చిత్రాలే రూపొందించాడు. నవరసాలు ఆయనకు నవ్వు రసాలే. అలా అని హస్యరసం కోసం మిగతా రసాలను చిన్నచూపు చూడలేదు. ఉదాత్తమైన సన్నివేశాలను ఆయన సృష్టించారు. ఆయనో సవ్యసాచి…శంకరాభరణాలు.. సప్తపదులు.. సాగరసంగమాలు.. సీతాకోకచిలుకలు ఒక వంక.. అడవి రాముళ్లు. వేటగాళ్లు… ఆఖరిపోరాటాలు.. జగదేకవీరుళ్లు మరో వంక. ఆయన పెన్నుపడిందంటే హిట్టే. నాలుగు మాటలను గుండెలో నింపుకొని విజయవాడ నుంచి మద్రాస్‌కు చేరిన జంధ్యాల హాస్యాన్ని హాస్యంలాగే వుంచాడు. హాస్యానికి అపహాస్యానికి మధ్య రేఖా మాత్రమైనా భేదం వుంది. అది జంధ్యాలకు తెలిసినంతగా మరే రచయితకు తెలియదు. అందుకే కాబోలు ఆయన సినిమాల్లో హాస్యం తొణికిసలాడుతుంది. గిలిగింతలు పెడుతుంది. పందొమ్మిది వందలా యాభై ఒకటిన ప్రజలంతా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న వేళ ఆ సంబరాలన్నింటినీ మూగట్టుకుని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కళ్లు తెరిచిన జంధ్యాల కృష్ణమ్మ సమీపంలో బాల్యమంతా గడిపేశాడు. సంగీత సాహిత్యాలను అక్కడే వంటపట్టించుకున్నాడు. నూనూగు మీసాలప్పుడే నాటకాలు గట్రాలు వేస్తూ గుర్తింపు పొందాడు. బిఎన్‌ రెడ్డి పిలుపుతో మద్రాస్‌ బండిక్కెన జంధ్యాల దేవుడు చేసిన బొమ్మలు సినిమాతో మాటల రచయితయ్యాడు. అప్పట్నుంచి కలం ఆగిపోయేంత వరకు రాశాడు. మచ్చుతునకల్లాంట హాస్య గుళికలను అందించాడు. జంధ్యాల కలానికున్న బలం చాలా గొప్పది. వెతకాలే కాని రామలింగకవి హాస్యాన్ని పోలిన హాస్యోక్తులు ఎన్నో దొరుకుతాయి. ఆనంధభైరవిలో భాషతో ఆయన ఆడుకున్న తీరు ఆమోఘం. ప్రాసలతో రాసిన డైలాగులు…వాటిని వీరభద్రరావు గుక్కతిప్పుకోకుండా చెప్పిన తీరు జంధ్యాల ప్రతిభకు తార్కాణాలు. కారణం లేని నవ్వు…తోరణం లేని పందిరి…పూరములేని బూరె పనికి రాదని ఓ శాసనకారుడన్నాడు…నిజమే…జంధ్యాల సినిమాల్లో నవ్వుకోడానికి బోల్డన్నీ కారణాలు. కవులపై జంధ్యాల విసిరినన్ని సెటైర్లు మరే రచయిత విసిరివుండడు. ఆయన సినిమాల్లోని కవులంతా జనాన్ని ఏడిపిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించినవారే! ఛలోక్తులు… పేరడీలతో రచయితగా ఎంత సక్సెసయ్యాడో.. దర్శకుడిగానూ అంతే ఘన విజయం సాధించాడు. ఆయన సినిమాల్లోనే ఓ కవి. భర్త భార్యను ప్రేమించే పద్థతికి.. భార్య భర్తను వేధించే పద్ధతికి సరైన నిర్వచనం కవితా రూపంలో చెబుతాడు. పెళ్లయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క….ఆ క్షణం నుంచి అదే ఆడది అల్లంచక్క..అని. ఇలాంటివి కోకొల్లలు. విచిత్రమైన క్యారెక్టర్లను… వింతైన భాషను సృష్టించడంలో జంధ్యాల ఆరితేరినవాడు. మనకు బోల్డన్నీ నవ్వులను పంచిపెట్టి పైలోకాల వారిని నవ్వించడానికి చెప్పా పెట్టకుండా హడావుడిగా వెళ్లిపోయాడు.ఆయనేం నవ్వును కట్టేయలేదు. నవ్వే ప్రతి మొహంలోనూ ఆయన కనిపిస్తాడు. తనివి తీరా నవ్వండని అంటాడు. నిండైన ఆరోగ్యానికి అంతకు మించిన టానిక్‌ లేదని నవ్వుతూ చెబుతాడు. అవును మరి జంధ్యాల అమరజీవి.

మరిన్ని ఇక్కడ చూడండి: ఎత్తిన కత్తి దించితే ఒట్టు.. అమేజింగ్ వీడియో వైరల్‌..!మహిళ అరుదైన ప్రతిభ :woman playing sword viral video.

Viral Video : పెళ్లి కూతురు డ్రెస్సు నుండి బయటకు వచ్చిన వ్యక్తి వైరల్ అవుతున్న వీడియో .

Viral Video : తెలివైన పనిమంతుడు…జోరువానలో గొడుగుపట్టుకుని హార్డ్ వర్క్ చేస్తున్న ఇంటిలిజెంట్ (వీడియో).

బ్లైండ్ స్కూల్ కి కోటి విరాళం ఇచ్చిన బాలీవుడ్ స్టార్..జవాన్లతో కలిసి వాలీబాల్ ఆడిన అక్షయ్ కుమార్.:Akshay Kumar video.