రేవంత్ న్యూసెన్స్ చేస్తున్నాడు.. సహించబోనన్న జగ్గారెడ్డి

|

Mar 20, 2020 | 2:39 PM

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి అంశం కాక రేపుతోంది. ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనే రేవంత్ కామెంట్ చేయడం కొందరు కాంగ్రెస్ నేతలకు నచ్చడం లేదు. దాంతో రేవంత్ రెడ్డిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు నేతలు.

రేవంత్ న్యూసెన్స్ చేస్తున్నాడు.. సహించబోనన్న జగ్గారెడ్డి
Follow us on

సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సొంత పార్టీకే చెందిన ఎంపీ రేవంత్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై గరమయ్యారు జగ్గారెడ్డి. రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ సిన్సియారిటీని ఎవరైనా శంకిస్తే సహించేది లేదని హెచ్చరించారు జగ్గారెడ్డి.

తెలంగాణ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫామ్ హౌజ్‌పై అనుమతి లేకుండా డ్రోన్ నిఘా పెట్టాడన్న కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఆయనకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించగా.. ఆయన చర్లపల్లి జైలులో గడిపారు. ఈ కాలంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తగిన విధంగా స్పందించలేదని జైలు నుంచి విడుదలైన తర్వాత రేవంత్ రెడ్డి ఆరోపించారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పలువురు కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. జగ్గారెడ్డి, హనుమంతరావు వంటి నేతలు బాహాటంగానే రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో ఓ న్యూసెన్స్‌గా మారాడంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారాయన. ఉత్తమ్ మనస్థాపానికి గురైతే అది కాంగ్రెస్ పార్టీకి, వ్యక్తిగతంగా తనకు నష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఉత్తమ్ సిన్సియారిటీని శంకించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని జగ్గారెడ్డి హెచ్చరించారు. రేవంత్‌‌లా ఉత్తమ్‌‌పై వ్యాఖ్యలు చేస్తే క్రమశిక్షణా కమిటీ చూస్తూ ఊరుకోవద్దని పార్టీ నేతలకు సూచించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పదవి పైరవితో తెచ్చుకోలేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు జగ్గారెడ్డి.