పహల్గామ్ దాడి దర్యాప్తుతో పాకిస్థాన్‌కు చుక్కలు.. అమిత్ షా మాస్ వార్నింగ్..
హోంమంత్రి అమిత్ షా ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటించారు. దేశ భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాద మూలాలను దెబ్బతీస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు, నేరగాళ్ల డిజిటల్ డేటాబేస్, రాష్ట్రాల సమన్వయం వంటి కీలక చర్యలను వెల్లడించారు. భారతదేశాన్ని ఉగ్రవాద రహితంగా మార్చడమే లక్ష్యమని నొక్కి చెప్పారు.

ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని, దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. ఉగ్రవాద మూలాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. గత ఏప్రిల్‌లో కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత దర్యాప్తు సంస్థలు చేసిన విచారణ, పాకిస్థాన్‌లోని టెర్రరిస్ట్ మాస్టర్ మైండ్‌లకు ఒక హెచ్చరికలా మారిందని షా అన్నారు. ఈ దాడికి పాకిస్థాన్ మద్దతు ఉందని భారత్ గట్టిగా వాదించగా ఆ దేశం ఖండించింది. కానీ మన భద్రతా దళాలు జరిపిన లోతైన దర్యాప్తు మన దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయని ఆయన కొనియాడారు.
భద్రత కోసం కొత్త అస్త్రాలు
ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు అమిత్ షా కొన్ని కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఉగ్రవాదులు, నేరస్థుల పూర్తి వివరాలతో కూడిన ఒక ప్రత్యేక డిజిటల్ డేటాబేస్ రూపొందించారు. దీనివల్ల నేరస్థులను పట్టుకోవడం పోలీసులకు సులభం కానుంది. కేవలం ఉగ్రవాదులనే కాకుండా వారికి సహాయం చేసే వ్యవస్థీకృత నేరగాళ్లపై కూడా అన్ని వైపుల నుండి దాడులు చేసేలా కొత్త ప్రణాళికను తీసుకువస్తున్నారు. నేరాలను ఎలా దర్యాప్తు చేయాలో సూచించే NIA క్రైమ్ మాన్యువల్‌ను కూడా ఆయన విడుదల చేశారు.
రాష్ట్రాల మధ్య సమన్వయం
పోలీసులు, నిఘా సంస్థలు, వివిధ రాష్ట్రాల భద్రతా దళాలు ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకోవాలని షా సూచించారు. అందరూ కలిసి పని చేసినప్పుడే దేశాన్ని ఉగ్రవాదం నుండి రక్షించగలమని ఆయన పిలుపునిచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
