Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్.. ఏయే ప్రాంతాల్లో అంటే..?
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ వారాంతం 36 గంటల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. కృష్ణా ఫేజ్-1 పైప్లైన్ల అత్యవసర మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం నుండి ఆదివారం సాయంత్రం వరకు నీరు నిలిచిపోతుంది. లీకేజీలు, వాల్వ్ మార్పులు దీనికి కారణం. ఏ ఏ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ అంటే..?

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ వారాంతంలో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. కృష్ణా ఫేజ్-1 పైప్లైన్లకు సంబంధించి అత్యవసర మరమ్మతు పనులు చేపడుతున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు సుమారు 36 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది.
ఎందుకు నిలిపివేస్తున్నారు?
కృష్ణా ఫేజ్-1 లోని సర్జ్ ట్యాంక్ వద్ద పైప్‌లైన్ లీకేజీలను అరికట్టడం, నాసర్లపల్లి – గోడకొండ్ల మధ్య దెబ్బతిన్న ఎయిర్ టీలు, వాల్వులను మార్చడం వంటి కీలక మరమ్మతు పనులు జలమండలి చేపట్టనుంది. అలాగే పంపింగ్ స్టేషన్లలో దెబ్బతిన్న వాల్వుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో 27-12-2025 ఉదయం 6 గంటల నుంచి 28-12-2025 సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు
పాతబస్తీ : మీరాలం, కిషన్‌బాగ్, మొగల్పురా, ఫలక్నామా, బహదూర్‌పురా, జహనుమా, బాల్షెట్టీ కేట్
డివిజన్-2 పరిధి: సంతోష్ నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, ఆస్మాన్‌గఢ్, యాకుత్‌పురా, మహబూబ్ మాన్షన్
డివిజన్ 4-5 : బొగ్గులకుంట, నారాయణగూడ, ఆడిక్‌మెట్, శివం రిజర్వాయర్, చిల్కలగూడ ప్రాంతాలు.
దక్షిణ హైదరాబాద్: అలియాబాద్, రియాసత్ నగర్
డివిజన్ 10: దిల్ సుఖ్ నగర్ లోని కొన్ని ప్రాంతాలు
డివిజన్ 20:మన్నెగూడ
ఔటర్ ప్రాంతాలు: హార్డ్ వేర్ పార్క్, జల్పల్లి, తుక్కుగూడ, ఫాబ్ సిటీ.
జలమండలి సూచన
మరమ్మతు పనుల కారణంగా నీటి సరఫరాలో 36 గంటల పాటు అంతరాయం ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు కోరారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, మరమ్మతులు పూర్తి కాగానే సరఫరాను పునరుద్ధరిస్తామని జలమండలి స్పష్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




