గంగమ్మ ఒడికి చేరుతున్న గౌరి తనయుడు
గణేష్ నిమజ్జనమంటే ఓ మహాయజ్ఞం. కానీ ఇప్పుడు అంతా నిరాడంబరం. నిమజ్జనం రోజు భాగ్యనగరం కిక్కిరిసిపోతుంది. ఇప్పుడైతే అలాంటి హడావుడే కన్పించడం లేదు. కరోనా ప్రభావంతో నిమజ్జన వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.
గణేష్ నిమజ్జనమంటే ఓ మహాయజ్ఞం. కానీ ఇప్పుడు అంతా నిరాడంబరం. నిమజ్జనం రోజు భాగ్యనగరం కిక్కిరిసిపోతుంది. ఇప్పుడైతే అలాంటి హడావుడే కన్పించడం లేదు. కరోనా ప్రభావంతో నిమజ్జన వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు అన్నీ ఏర్పాట్లు చేశారు. 15 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ట్యాంక్‌బండ్‌పై 21 క్రేన్లను ఏర్పాటు చేశారు. గత వారం రోజుల్లో ఏకంగా 30 వేల విగ్రహాలు నిమజ్జనం చేశారు. ఈ ఒక్క రోజే 3 నుంచి 4 వేల విగ్రహాలు నిమజ్జనం చేయనున్నారు. చాంద్రాయణగుట్ట నుంచి ట్యాంక్‌బండ్ వరకు 15 నుంచి 18 కిలోమీటర్లు నిమజ్జన ఊరేగింపు జరగనుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఇతర వాహనాలకు అనుమతి నిషేధించారు. నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్‌బండ్‌లపై నిమజ్జనానికి వచ్చే వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించి రూట్ మ్యాప్ విడుదల చేసిన పోలీసులు.. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. ఖైరతాబాద్ గణేషుడు గంగ ఒడిలో చేరితేనే నిమజ్జన పర్వం ముగుస్తుంది. అసలు నిమజ్జనం రోజున వేల విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు వెళ్తున్నా.. సెంటరాఫ్ అట్రాక్షన్ మాత్రం ఖైరతాబాద్ వినాయకుడే. భారీ విగ్రహం కావడంతో అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. పోలీసులు కూడా ఖైరతాబాద్ వినాయకుడిపైనే ఎక్కువగా ఫోకస్ పెడతారు. కానీ ఇప్పుడంత హడావుడి లేదు. కరోనా ప్రభావంతో విగ్రహాం ఎత్తు కూడా తగ్గించేశారు. గతేడాది 61 అడుగులు ఉంటే ఇప్పుడు 9 అడుగుల ఎత్తులోనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వ్యాధులను నయం చేసే ధన్వంతరి అవతారంలో ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు. భౌతిక దూరం పాటించడం కష్టమవుతుందని భావించి కేవలం ఆన్‌లైన్ దర్శనాలకే అనుమతి ఇచ్చారు. దీంతో ఈసారి ఖైరతాబాద్‌లో అంత హడావుడి కన్పించడం లేదు.
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల లోపే నిమజ్జనం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఖైరతాబాద్‌లో మొదలై… టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్‌లోని క్రేన్ నెంబర్ 4 దగ్గరకు ఈ శోభాయాత్ర చేరుకోనుంది. ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేయాలని మొదట్లో ఉత్సవ సమితి సభ్యులు భావించినా.. భక్తుల విజ్ఞప్తితో ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా శోభాయాత్ర అనంతరం ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేస్తున్నారు. భక్తులెవరూ ఈ శోభాయాత్రకు రావొద్దని పిలుపునిచ్చారు. ఈ నిరాడంబరంగా వేగంగా ఖైరతాబాద్ వినాయక నిమజ్జనోత్సవం జరగనుంది.
మరోవైపు గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా హైదరాబాద్ పోలీసులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 18 కిలోమీటర్లు కొనసాగే శోభాయాత్ర మార్గాన్ని నిరంతరం పరిశీలించేందుకు వీలుగా అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు, కాలనీ సంఘాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు నేనుసైతం పేరుతో ఏర్పాటు చేసుకున్న కెమెరాలను అనుసంధానించారు. భారీ విగ్రహాలు లేకపోవడంతో ఈసారి మరింత వేగంగా, సాఫీగా నిమజ్జనాలు జరుగుతాయని భావిస్తున్నారు. ఇక బందోబస్తు విధుల్లో పోలీసులతో పాటు సాయుధ బలగాలు పాల్గోనున్నాయి. కోవిడ్ నేపథ్యంలో వీరందిరిక మాస్క్‌లు, శానిటైజర్లు, ఫేస్‌షీల్డ్స్ అందించారు. నగరంలో ఈ ఉదయం 6 నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని, మద్యం విక్రయాలను నిషేధించారు.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పేరు చెబితే మొదట ఖైరతాబాద్ గణేష్ గుర్తుకు రావడానికి ఓ కారణముంది. ఖైరతాబాద్ గణేషుడికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1954లో తొలిసారిగా ఖైరతాబాద్ గణేష్ కొలువుదీరాడు. తొలిసారి ఒకే ఒక్క అడుగు ఎత్తుతో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ తర్వాత ఒక్కో అడుగు పెంచుతూ వచ్చారు. అప్పట్లో ఏనుగుపై ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరిగేది. అలా 60 ఏళ్లు వచ్చేటప్పటికీ గణేష్ విగ్రహం 60 అడుగులకు చేరింది. ఎత్తు ఎక్కువ కావడంతో నిమజ్జన సమయంలో సమస్యలు ఎదురయ్యేవి. అందుకే 2014 నుంచి ఒక్కో అడుగు తగ్గిస్తూ రావాలని నిర్ణయించారు. అయినా విగ్రహం తలపై చేసే అలంకరణలతో ఎప్పుడూ 60 అడుగులకు పైనే విగ్రహం ఎత్తు ఉండేది. గతేడాది 61 అడుగుల ఎత్తులో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో ఒక్కసారిగా విగ్రహం ఎత్తును తగ్గించారు.