కరోనావేళ మంటగలుస్తున్న మానవ సంబంధాలు
నేటి బిగుతు జీవితాల్లో అసలే అరకొరగా ఉంటోన్న మానవ సంబంధాలు కరోనా మహమ్మారి పుణ్యమాని పూర్తిగా మంటగలిసిపోతున్నాయి. అతీగతీ చూడకుండా సొంత వాళ్లనే కాదని వదిలేస్తున్న పరిస్థితులు అనేకం..
నేటి బిగుతు జీవితాల్లో అసలే అరకొరగా ఉంటోన్న మానవ సంబంధాలు కరోనా మహమ్మారి పుణ్యమాని పూర్తిగా మంటగలిసిపోతున్నాయి. అతీగతీ చూడకుండా సొంత వాళ్లనే కాదని వదిలేస్తున్న పరిస్థితులు అనేకం వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా అయినవాళ్లను తీసుకెళ్లని వైనాలు అనేకం కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఇలా గాంధీలో వదిలిపెట్టిన వారి సంఖ్య 90కి పైనే ఉంది. కష్టకాలంలో అక్కున చేర్చుకోవాల్సిన సొంతవారే దూరం పెడుతున్నారు. రకరకాల కారణాలు చూపిస్తూ కరోనా సోకి తగ్గినాకూడా ఇంటికి తీసుకెళ్లేందుకే నిరాకరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దిక్కుతోచని హాస్పిటల్ వైద్యులు తల్లిదండ్రులను వదిలేసిన పిల్లలకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా ఇలా వదిలేస్తున్న మాట నిజమేనని గాంధీ సూపరింటెండెంట్ తెలిపారు. చాలా మంది కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి కౌన్సిలింగ్ చేస్తున్నామని వెల్లడించారు. ఇలా చేయడం వల్ల ఇప్పటి వరకూ 60 మందిని తీసుకెళ్లారని.. ఇంకా గాంధీలో 25 మందికి పైగా అనాథల్లా ఉండిపోయారని ఆయన చెప్పారు. అందుకే గాంధీఆసుపత్రిలో ప్రత్యేకంగా డిపెండెంట్ వార్డును ప్రారంభించామన్నారు. 24 గంటలూ సేవలందించేలా సిబ్బందిని సిద్ధం చేశామని స్పష్టం చేశారు.