ట్రంప్ ముఖ్య సహాయకురాలు హోప్ హిక్స్ కరోనా పాజిటివ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్ర సహాయకులలో ఒకరైన హోప్ హిక్స్ కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు అధికారులు వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్ర సహాయకులలో ఒకరైన హోప్ హిక్స్ కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే, గత మంగళవారం క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన సమావేశంతో సహా ఆమె ఇటీవల అధ్యక్షుడితో పలుసార్లు ప్రయాణించారు. ట్రంప్ మిన్నెసోటాలో ప్రచార ర్యాలీకి వెళుతుండగా బుధవారం మెరైన్ వన్ లో కూడా ట్రంప్ తో పాటు ప్రయాణించారు. కాగా, ట్రంప్ మాత్రం వైరస్ బారిన పడినట్లు సూచనలు లేవని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. కాగా, తన సలహాదారిణికే కరోనా సోకడంతో తాము అమెరికన్ ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యమిస్తామని వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో తిరిగి వాషింగ్టన్ డీసీకి చేరుకుంది. ఆమె లక్షణాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో స్పష్టంగా తెలియదు. చాలా రోజులుగా హిక్స్, ఇవాంకా ట్రంప్‌తో కలిసి ప్రజా సంబంధాలలో పనిచేస్తున్నారు. ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనూ అతని రాజకీయ ప్రారంభం నుండి వైట్ హౌస్ వరకు అతనిని అనుసరించిన కొద్దిమంది సహాయకులలో ఆమె ఒకరు. హిక్స్ అధ్యక్షుడితోనే కాకుండా అతని కుటుంబ సభ్యులతో కూడా వైట్ హౌస్ సలహాదారులుగా ఉన్నారు. అలాగే, ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్‌తో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించారు. ఆమె గతంలో వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గా పనిచేశారు.
గతంలోనూ ఇద్దరు వైట్ హౌస్ సిబ్బందితో పాటు ట్రంప్ వ్యక్తిగత వాలెట్లలో ఒకరిగా పనిచేసే నేవీ సభ్యుడికి కూడా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.