AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో జోరు వానలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా గుత్తి, పామిడి, పెద్దవడుగూరు మండలాల్లో నిన్న రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు భారీ వర్షం కురిసింది...

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో జోరు వానలు
Sanjay Kasula
|

Updated on: Sep 14, 2020 | 3:34 PM

Share

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా గుత్తి, పామిడి, పెద్దవడుగూరు మండలాల్లో నిన్న రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు భారీ వర్షం కురిసింది. పెద్దవడుగూరు మండలం ఈరన్న పల్లి గ్రామ సమీపంలోని వంక ప్రవాహం వల్ల రోడ్ తెగిపోయింది. దీంతో చిట్టూరు, గంజి గుంట పల్లి, దిమ్మగుడి, కొట్టాలపల్లి, చిత్రచేడు తదితర గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

ఈ భారీ వర్షానికి పెద్దవడుగూరు మండలంలో పత్తి, వేరుశనగ పంటలు నీట మునగడంతో పాటు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అలాగే పామిడి మండలంలో వర్షం ధాటికి పలు గ్రామాల మధ్య రోడ్లు కొట్టుకుపోయాయి. గుత్తి పట్టణంలో కూడా నిన్న రాత్రి కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.

కర్నూలు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు, పాములపాడు, వెలుగోడు, కొత్తపల్లె మండలాల్లో తెల్లవారుజామున నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో భవనాశి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొత్తపల్లి మండలంలోని గువ్వలకుంట్ల గ్రామంలో చెరువుకు మూడు గండ్లు పడ్డాయి. గ్రామంలోని ఇళ్లలోకి నీరు చేరింది.

కొత్త పల్లి మండలంలోని 4 చెరువులు ప్రమాదకర స్ధాయికి చేరాయి. అర్థ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో ఆత్మకూరులోని వాగులు వంకలు ఏకమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్తపల్లి మండలంలోని నాలుగు చెరువులకు గండ్లు పడడంతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

ఇక అటు తూర్పుగోదావరి జిల్లాలో కుంభవృష్టి కొనసాగుతోంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ద్వారకా తిరుమల, కామవరపుకోట మండలాల్లో అపార నష్టం వాటిల్లింది. సత్తెన గూడెంలో గోడకూలి 100 గొర్రెలు మృతి చెందాయి. రైతుకు సుమారు 10 లక్షల వరకు నష్టం వాటిల్లింది. దాంతో పాటు భారీ వర్షానికి వందలాది ఎకరాలు నీటమునిగాయి.

ఏపీలోని 9 జిల్లాల్లో రేపు, ఎల్లుండి కూడా ఇదే రకమైన పరిస్థితి ఉండొచ్చని అభిప్రాయపడింది వాతవరణశాఖ. రాష్ట్రవ్యాప్తంగా మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలతో పాటు కృష్ణా, గోదావరి పరివాహాక ప్రాంతాల జిల్లా అధికారులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం సూచనలు చేస్తోంది..