గ్రేటర్ లో శిథిలావస్థకు చేరిన భవనాలు ఖాళీ చేయండిః కమిషనర్

మాయదారి వాన హైదరాబాద్ మహానగరాన్ని వదలడంలేదు. ఒకదాని వెంబడి మరో అల్పపీడనం భాగ్యనగరవాసులను అతలాకుతలం చేస్తున్నాయి.

గ్రేటర్ లో శిథిలావస్థకు చేరిన భవనాలు ఖాళీ చేయండిః కమిషనర్
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 19, 2020 | 4:00 PM

మాయదారి వాన హైదరాబాద్ మహానగరాన్ని వదలడంలేదు. ఒకదాని వెంబడి మరో అల్పపీడనం భాగ్యనగరవాసులను అతలాకుతలం చేస్తున్నాయి. చెరువులు నిండి పొంగిపొర్లుతుండటంతో వరద ఉదృతికి ఇళ్లు, భవనాలు కూలుతున్నాయి. దీంతో అప్రమత్తమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నగరవ్యాప్తంగా శిథిలావస్థకు చేరుకున్న పురాతన భవనాలను కూల్చివేస్తున్నారు.

వర్షాల నేపథ్యంలో గత ఏడు రోజుల్లో 59 శిథిల భవనాలు కూల్చివేసినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌ కుమార్‌ తెలిపారు. వరదలు, వరుస కురుస్తున్న వానల దృష్ట్యా.. పురాతన భవనాలు కూలే అవకాశం ఉందని, 33 శిథిల భవనాల్లో ఉన్న 140 మందిని ఖాళీ చేయించామన్నారు. మూసీ తీరంలో మంగళ్‌ హాట్‌లో నివసించే 35 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. ప్రమాదకరంగా మారిన భవనాలను సీల్‌ చేయడంతోపాటు చుట్టూ బారికేడింగ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ యేడాది ఇప్పటి వరకు 545 భవనాలు శిథిలావస్థలో ఉన్నట్టు గుర్తించామని కమిషనర్ తెలిపారు. వీటిలో 187 కూల్చివేయగా.. 127 భవనాలకు మరమ్మతు చేయించామన్నారు. ఇంకా ఎక్కడైనా శిథిల భవనాల్లో ప్రజలు ఉంటే గుర్తించి ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు గ్రేటర్ హైదరాబాద్ వాసులు సహకరించాలని కమిషనర్‌ కోరారు.