Andhra News: ఎంత కష్టమొచ్చిందో పాపం.. పుట్టిన రెండ్రోజులకే పాపను దూరం చేసుకున్న తల్లి.. అంతలోనే
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో బిడ్డను పోశించే శక్తిలేక.. పుట్టిన రెండ్రోజులకే పాపను మరొకరికి అప్పగించారు తల్లిదండ్రులు. అప్పటికే ముగ్గురు సంతానం ఉండగా నాలుగో సంతానం కూడా ఆడబిడ్డ అవడంతో పొత్తిల్లోనే బిడ్డను దూరం చేసుకున్నారు. పసికందును వేరొకరికి అప్పగించి హాస్పిటల్లో చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడంతో హాస్పిటల్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బిడ్డను స్వాధీనం చేసుకొని మళ్లీ తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగుకు చెందిన సూరి, శివలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితమే అనంతపురం పట్టణానికి వచ్చి సూరి, శివలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. టమోటా బండిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అప్పటికే ఇద్దరు ఆడబిడ్డలు, ఒక మగ బిడ్డ ఉన్న సూరి, శివలక్ష్మి దంపతులకు తాజాగా మరో ఆడబిడ్డ జన్మించింది. ఆర్థిక ఇబ్బందులతో పుట్టిన ఆడబిడ్డను పోషించలేమని భావించిన దంపతులు.. తమకు పరిచయస్తుల ద్వారా పరిచయమైన హిందూపురం పట్టణానికి చెందిన షేక్ సెహతాజ్‌కు రెండు రోజుల పసికందును అప్పగించాడు. తర్వాత హాస్పిటల్ నుంచి వెళ్లిపోయారు.
అయితే డిశ్చార్జ్ చేయకుండానే హాస్పిటల్‌లో తల్లి శివలక్ష్మి, ఆడ శిశువు కనిపించడంతో హాస్పిటల్ సిబ్బంది టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టూ టౌన్ పోలీసులు మొదట సూరి, శివలక్ష్మి దంపతుల ఇంటికి వెళ్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పోషించే శక్తి లేక తమ బిడ్డను వేరొకరికి అప్పగించామని తల్లిదండ్రులు చెప్పారు. డెలివరీ అయిన రెండు రోజులకే ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేయడంతో బాలింత శివలక్ష్మి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆమెను తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు.
అలాగే ఎవరికైతే బిడ్డను అప్పగించారో వారి దగ్గర నుంచి ఆడ శిశువును తీసుకొచ్చిన పోలీసులు తల్లి శివలక్ష్మి ఒడికి చేర్చారు. నిజంగానే సూరి శివలక్ష్మి దంపతుల ఆర్థిక పరిస్థితి బాగాలేదని అందుకే నాలుగవ బిడ్డను వేరొకరికి అప్పగించినట్లు విచారణలో తెలిసిందంటున్నారు పోలీసులు. బిడ్డను తల్లి ఒడికి చేర్చడమే కాకుండా ఆర్థిక పరిస్థితి బాగాలేని సూరి, శివలక్ష్మి కుటుంబాన్ని ఆదుకుంటామంటున్నారు అనంతపురం టూ టౌన్ పోలీసులు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
