భోజనం చేసిన వెంటనే మీరూ ఇలా చేస్తున్నారా? జాగ్రత్త.. చిన్న పొరబాట్లకు పెద్ద మూల్యం చెల్లించాలి
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఆరోగ్యకరమైన ఆహారం తింటారు. సమయానికి భోజనం కూడా చేస్తుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తిని, సమయానికి భోజనం చేసినప్పటికీ భోజనం చేసిన వెంటనే చేసే కొన్ని పొరపాట్లు ( భోజనం తర్వాత చేసే తప్పులు) పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయని మీకు తెలుసా?

భోజనం తర్వాత చేసే తెలిసో.. తెలియకో.. చేసే కొన్ని చిన్న పొరపాట్లు మన జీర్ణవ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఈ అలవాట్లను సకాలంలో సరిదిద్దుకోకపోతే జీర్ణవ్యవస్థ క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే మీరు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
భోజనం తర్వాత ఈ తప్పులను అస్సలు చేయొద్దు
తిన్న వెంటనే నిద్రపోవడం
మనలో చాలా మంది చేసే అతిపెద్ద తప్పులలో ఇది కూడా ఒకటి. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీని కారణంగా ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది గుండెల్లో మంటకు కూడా కారణం అవుతుంది. కాబట్టి తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు తర్వాత నిద్రపోవడం మంచిది.
టీ లేదా కాఫీ తాగడం
చాలా మందికి భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఈ పొరపాటు జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. భోజనం తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల వాటిలో ఉండే మూలకాలు శరీరం ఐరన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఒకవేళ మీరు టీ లేదా కాఫీ తప్పనిసరిగా తాగాలనుకుంటే భోజనం చేసిన తర్వాత కనీసం 45 నిమిషాలు ఆగడం మంచిది.
ఎక్కువగా నీళ్లు తాగడం
భోజనం చేసిన వెంటనే ఎక్కువగా నీళ్లు తాగకూడదు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల కడుపులోని జీర్ణరసాలు బలహీనపడి, జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఇలా పదేపదే చేయడం వల్ల జీవక్రియపై ప్రభావం చూపుతుంది. భోజనం చేసేటప్పుడు కొద్దిగా నీళ్లు తాగడం మంచిదే, కానీ భోజనం చేసిన వెంటనే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగకూడదు.
తిన్న వెంటనే స్నానం చేయడం
తిన్న వెంటనే అస్సలు స్నానం చేయకూడదు. తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ కడుపు నుంచి చర్మానికి మారుతుంది. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదించి, జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. ముఖ్యంగా, చల్లటి నీటితో స్నానం చేయడం మానుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. తిన్న తర్వాత కనీసం ఒక గంట తర్వాత స్నానం చేయవచ్చు. ఈ అలవాటు వల్ల బరువు కూడా పెరుగుతారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




