AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Korma Recipe: కోడిగుడ్డుతో ఎప్పుడూ ఒకే కూర కాకుండా ఇలా షాహీ కోర్మా ట్రై చేయండి.. లొట్టలేసుకుని తింటారు!

మామూలు కోడిగుడ్డు కూరలు, పులుసులు తిని విసిగిపోయారా? అయితే మీకోసం ఒక ప్రత్యేకమైన నవాబీ స్టైల్ ఎగ్ కోర్మా రెసిపీ వచ్చేసింది. జీడిపప్పు, గసగసాలు, పెరుగుతో చేసిన అద్భుతమైన గ్రేవీ, దానికి తోడు నెయ్యి సుగంధ ద్రవ్యాల ఘుమఘుమలతో ఈ వంటకం అచ్చం రెస్టారెంట్ రుచిని తలపిస్తుంది. బంధువులు వచ్చినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా ప్రత్యేక వేడుక ఉన్నప్పుడు పులావ్, పరాఠా లేదా బగారా అన్నంతో కలిపి తినడానికి ఇది అద్భుతంగా ఉంటుంది. చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకునే ఈ ఎగ్ షాహీ కోర్మా తయారీ విధానం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Egg Korma Recipe: కోడిగుడ్డుతో ఎప్పుడూ ఒకే కూర కాకుండా ఇలా షాహీ కోర్మా ట్రై చేయండి.. లొట్టలేసుకుని తింటారు!
Egg Korma Recipe
Bhavani
|

Updated on: May 12, 2026 | 7:21 PM

Share

అద్భుతమైన రుచితో నోరూరించే ఎగ్ కోర్మా తయారు చేయడానికి ముందుగా ఆరు కోడిగుడ్లు, రెండు పెద్ద ఉల్లిపాయలు, రెండు టీస్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అర కప్పు పుల్లటి పెరుగు, పదిహేను జీడిపప్పులు, ఒక టీస్పూన్ గసగసాలు, ఒక టీస్పూన్ యాలకుల పొడి, నాలుగు పచ్చి మిరపకాయలు సిద్ధం చేసుకోండి. వీటితో పాటుగా వంటకు మంచి సువాసన రుచిని ఇవ్వడానికి రెండు టీస్పూన్ల నెయ్యి, నాలుగు టీస్పూన్ల వంట నూనె, రెండు బే ఆకులు, ఒక అంగుళం దాల్చినచెక్క, నాలుగు యాలకులు, నాలుగు లవంగాలు, రుచికి సరిపడా ఉప్పు చక్కెర, అర టీస్పూన్ కేవ్రా వాటర్, రోజ్ వాటర్ , ఎండుద్రాక్షలు కూడా అందుబాటులో ఉంచుకోవాలి.

పేస్ట్ తయారీ విధానం

మొదటగా కోడిగుడ్లను బాగా ఉడకబెట్టి వాటి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. మనం తయారు చేసే మసాలా గుడ్ల లోపలి వరకు బాగా పట్టేలా వాటిపై కత్తితో చిన్నగా గాట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసి నూనెలో దోరగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. గుడ్లను మరీ ఎక్కువగా వేయిస్తే అవి గట్టిగా మారిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. ఇక ఈ కోర్మాకు అసలైన రుచినిచ్చే తెల్లటి పేస్ట్ కోసం జీడిపప్పు, గసగసాలు, యాలకులను కనీసం పదిహేను నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టాలి. ఒక ఉల్లిపాయను ప్రత్యేకంగా ఉడకబెట్టుకుని దానికి నానబెట్టిన జీడిపప్పు మిశ్రమం రెండు పచ్చిమిర్చి జతచేసి చాలా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి.

నవాబీ గ్రేవీ తయారీ విధానం

ఒక మందపాటి బాణలిలో కొద్దిగా నూనె, ఒక చెంచా నెయ్యి వేడి చేసి అందులో దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, బే ఆకులు వేయాలి. మసాలా దినుసుల నుండి మంచి సువాసన వస్తున్నప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు పూర్తిగా వేగకూడదు కేవలం మెత్తబడితే సరిపోతుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి చిన్న మంట మీద ఐదు ఆరు నిమిషాల పాటు అడుగంటకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. మసాలా చక్కగా వేగిన తర్వాత పుల్లటి పెరుగును ఎక్కడా ఉండలు లేకుండా బాగా గిలకొట్టి అందులో వేయాలి. దీనికి రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ చక్కెర కచ్చితంగా కలుపుకోవాలి. మంట తక్కువగా ఉంచకపోతే పెరుగు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

వేయించిన గుడ్లు కలపడం

మసాలాల నుండి నూనె నెమ్మదిగా పైకి తేలుతున్నప్పుడు అందులో ఒక కప్పు వేడినీళ్లు పోయాలి. ఈ పులుసు కొద్దిగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను, ఎండుద్రాక్షలను అందులో వేసి మూతపెట్టాలి. సన్నని మంట మీద కేవలం ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎగ్స్ ఎక్కువసేపు ఉడికితే వాటి రుచి మారుతుంది. చివరిగా ఒక చెంచా నెయ్యి, కేవ్రా వాటర్, రోజ్ వాటర్, సువాసన కోసం తరిగిన పచ్చిమిర్చి వేసి పది నిమిషాల పాటు మూత తీయకుండా అలాగే ఉంచాలి. అంతే, ఎంతో గుమగుమలాడే నవాబీ ఎగ్ కోర్మా సిద్ధం. పెరుగు వేసేటప్పుడు కొద్దిగా పిండి కలిపితే అది విరిగిపోకుండా క్రీమీగా ఉంటుంది. అలాగే వడ్డించే ముందు ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ కలిపితే అచ్చం రెస్టారెంట్ రుచిని ఆస్వాదించవచ్చు.

Follow Us