క్రిస్మస్ టైం : ఆసియాలోనే అతి పెద్ద సియస్ఐ చర్చి, పర్వదిన సమయాన కొత్తశోభతో అలరారుతోన్న మెదక్

తెలంగాణకు మకుటాయమానంగా నిలిచే మెదక్ పట్టణంలోని సియస్ఐ చర్చి క్రిస్టమస్ కళ సంతరించుకుంటోంది. ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా ప్రపంచ..

క్రిస్మస్ టైం : ఆసియాలోనే అతి పెద్ద సియస్ఐ చర్చి, పర్వదిన సమయాన కొత్తశోభతో అలరారుతోన్న మెదక్
Follow us

|

Updated on: Dec 20, 2020 | 1:07 PM

తెలంగాణకు మకుటాయమానంగా నిలిచే మెదక్ పట్టణంలోని సియస్ఐ చర్చి క్రిస్టమస్ కళ సంతరించుకుంటోంది. ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ చర్జిలో శాంతిదూత.. త్యాగమూర్తి ప్రభువు ఏసయ్య పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం తెలిసిందే. అయితే, ఈ ఏడాది కరోనా మహమ్మారి జడలు విప్పుతున్న వేళ అనేక మందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రిస్మస్ వేళ యావత్ తెలంగాణ నుంచే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి కూడా భారీ ఎత్తున భక్తజనం ఈ చర్చికి తరలివచ్చే నేపథ్యంలో అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా భక్తకోటి మెదక్ చర్చిని కనులారా వీక్షించి, ఏసయ్యకు ప్రార్థనలు చేయడం తరతరాలుగా వస్తోంది. పండుగ సందర్భంగా పీఠాధిపతి బిషప్ సువిశాలమైన ప్రాంగణంలో ఊరేగింపుగా చర్చి లోపల వేదిక మీదకు వచ్చిన అనంతరం భక్తులకు దైవ సందేశం ఇవ్వడం రివాజు.

క్రిస్మస్ అంటే యేసు ప్రభువు మరణించి లేచిన రోజు. 1924లో ఛార్లెస్ వాకర్ అనే బ్రిటీషర్ నిర్మించిన ఈ చర్చి తెలంగాణ జిల్లా అయిన మెదక్ ప్రాంతంలో ఉండడం విశేషం. చరిత్రలోకి వెళితే, 1875 ప్రాంతంలో గోల్కొండ షిప్.. లండన్ – మద్రాస్ పట్టణాల మధ్య రాకపోకలు సాగించేది. అదే ఓడ ద్వారా ప్రయాణించి మద్రాస్ చేరుకున్న చార్లెస్‌ వాకర్‌ ఫాస్నెట్‌ అనే పాస్టర్ తన విధులలో భాగంగా సికింద్రాబాదు నగరానికి బదిలీ అయ్యి, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో క్రైస్తవ ప్రచారాన్ని చేయాలన్న డిమాండ్ మేరకు మెదక్ చేరుకున్నారు. ఆ పాస్టర్ మెదక్ చేరుకొనే సమయానికి ఊరంతా కరువు కాటకాలతో బాధపడుతోంది. ప్రజలు తిండి లేకుండా అలమటించసాగారు. అలాంటి సమయంలో పాస్టరుకి ఓ ఆలోచన వచ్చింది. ఇదే చర్చి నిర్మాణానికి అనువైన సమయం అని తలచి.. పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు. చర్చి నిర్మాణంలో పాల్గొనే ప్రతీ కార్మికుడికి బియ్యం, ఆహార పదార్థాలను ఆయన సరఫరా చేసేవారు. అలా మొదలైన ఆ చర్చి నిర్మాణ కార్యక్రమం 1924లో పూర్తయింది. ఈ చర్చి నిర్మాణం కోసం వెయ్యి ఎకరాలు కొనుగోలు చేసిన ఛార్లెస్ తొలుత 180 అడుగుల ఎత్తుతో ఈ కట్టడాన్ని నిర్మించాలని భావించారట. అయితే ఆ ఎత్తు హైదరాబాద్‌లోని చార్మినార్ కంటే ఎక్కువ కావడంతో అప్పటి నైజాం ప్రభువు ససేమిరా ఒప్పుకోలేదట. దీంతో 173 అడుగుల ఎత్తుతో చర్చిని నిర్మించారు. చర్చి ప్రధాన గోపురం ఎత్తు 173 అడుగులు కాగా వెడల్పు 100 అడుగులు, పొడవు 200 అడుగులు ఉంటుంది. రాతితో, డంగు సున్నంతో ఈ చర్చిని నిర్మించారట. అలాగే ఈ చర్చిలో నిర్మించిన అద్దాల కిటికీలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. క్రీస్తు చరిత్రలోని ఘట్టాలను ఎంతో కళాత్మకంగా కళ్లకు కట్టేలా ఈ కిటికీల్లో నిక్షిప్తం చేశారు.