Hyderabad: ఛీ.. ఇన్నాళ్లు నెయ్యి అనుకొని తిన్నదంతా ఇదా?.. Tv9 కథనాలతో వెలుగులోకి కల్తీ దందా!
నెయ్యి.. మన ఇంట్లో పవిత్రతకు, ఆరోగ్యానికి ప్రతీక. ప్రసాదం నుంచి పిండివంటల వరకు ప్రతి వంటకంలోనూ ప్రత్యేక స్థానం ఉన్న పదార్థం. అలాంటి నెయ్యి పేరుతో జరుగుతున్న కల్తీ దందాపై TV9 వరుస కథనాలతో సంచలనం రేగింది. చౌక నూనెలు, వనస్పతి, ఇతర ముడిపదార్థాలతో నెయ్యిని పోలిన ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్‌లో అసలైన నెయ్యిగా విక్రయిస్తున్న వ్యవహారాన్ని TV9 నిఘా కథనాలతో బయటపెట్టింది. తక్కువ ధరకు లభిస్తున్న నెయ్యి వెనుక అసలు కథ ఏంటన్న ప్రశ్నను ప్రజల ముందుకు తీసుకొచ్చింది.

TV9 ఇంపాక్ట్‌తో ఇప్పుడు అధికార యంత్రాంగం కదిలింది. హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీ, విక్రయ కేంద్రాలపై H-FAST, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 130 సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో 39 నెయ్యి తయారీ యూనిట్లు, 91 నెయ్యి విక్రయ కేంద్రాలు ఉన్నాయి. టీవీ9 కథనాల్లో లేవనెత్తిన కల్తీ నెయ్యి దందా తీవ్రతకు అనుగుణంగా అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ తనిఖీల్లో అధికారులకు భారీగా కల్తీ నెయ్యి, ముడి పదార్థాలు, ఇతర పదార్థాలు పట్టుబడ్డాయి. మొత్తం 36 టన్నుల మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సుమారు 25.5 టన్నుల కల్తీ నెయ్యి, 8.7 టన్నుల క్రీమ్, 1,200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతి, 30 కిలోల స్టార్చ్‌తో పాటు కృత్రిమ గీ ఫ్లేవర్లు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న పదార్థాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.
అధికారుల దర్యాప్తులో కల్తీ నెయ్యి తయారీకి సంబంధించిన కీలక విషయాలు బయటపడ్డాయి. పాల పదార్థాలతో పాటు పామాయిల్, వనస్పతి, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, స్టార్చ్, కృత్రిమ గీ ఫ్లేవర్లను ఉపయోగించి నెయ్యిని పోలిన ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తక్కువ ఖర్చుతో తయారు చేసి.. ఒరిజినల్ నెయ్యి పేరుతో అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
కల్తీ నెయ్యిని తయారు చేయడమే కాకుండా.. అసలు మోసం ప్యాకింగ్ దగ్గరే జరుగుతోంది. ‘100% Pure Ghee’, ‘Premium Ghee’, ‘Farm Fresh Ghee’, ‘Natural Ghee’ వంటి పేర్లతో కల్తీ ఉత్పత్తులను మార్కెట్‌లోకి పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ప్యాకెట్లపై బ్యాచ్ నంబర్, FSSAI లైసెన్స్ వివరాలు, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ డేట్ వంటి తప్పనిసరి వివరాలు కూడా లేకపోవడం తనిఖీల్లో బయటపడింది.
కల్తీ నెయ్యి ఏ ఒక్క వర్గానికో పరిమితం కాలేదు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్తీ స్థాయిని బట్టి దీపం, పూజల కోసం ఉపయోగించే నెయ్యి నుంచి రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ తయారీ యూనిట్లు, ఆయుర్వేద షాపుల వరకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డెయిరీ షాపులు, స్వీట్ షాపులు, హోటళ్లు, స్టార్ హోటళ్లు, బేకరీలు, క్యాటరర్లు, ఇతర ఆహార సంస్థలకు కూడా ఈ కల్తీ నెయ్యి చేరుతున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ దందాకు ఉపయోగిస్తున్న ముడిసరుకు కూడా పలు రాష్ట్రాల నుంచి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి మిల్క్ క్రీమ్‌ను సేకరించి.. హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. తక్కువ ధరకు ముడిసరుకు సేకరించి, నెయ్యి పేరుతో అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
TV9 గత నిఘా కథనాల్లో చూపించిన దృశ్యాలు.. ఇప్పుడు అధికారుల దాడుల్లో బయటపడిన వాస్తవాలతో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాచారం-మల్లాపూర్ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సాగుతున్న నెయ్యి తయారీపై TV9 గతంలో నిఘా నిర్వహించి.. చౌక పదార్థాలతో నెయ్యిని పోలిన ఉత్పత్తులు తయారు చేస్తున్న వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. నెయ్యి అసలు ధర, తయారీ ఖర్చు, మార్కెట్‌లో అనుమానాస్పదంగా తక్కువ ధరకు లభిస్తున్న ఉత్పత్తులపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పుడు అదే తరహా కల్తీపై H-FAST భారీ స్థాయిలో దాడులు నిర్వహించడం TV9 ఇంపాక్ట్‌కు మరో ఉదాహరణగా నిలిచింది.
అయితే స్వాధీనం చేసుకున్న పదార్థాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబొరేటరీ పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా కల్తీ స్థాయి, ఉపయోగించిన పదార్థాలు, ఉత్పత్తుల నాణ్యతపై మరింత స్పష్టత రానుంది. అంటే.. ఇప్పుడు అందరి చూపు ల్యాబ్ రిపోర్టులపైనే ఉంది.
కల్తీ నెయ్యి ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నాణ్యత లేని కొవ్వులు, అనుమతిలేని లేదా హానికరమైన పదార్థాలు కలిసిన ఉత్పత్తులను దీర్ఘకాలం తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్ పెరుగుదల, జీర్ణవ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాలు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలు నెయ్యి కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. ప్యాకింగ్ సీల్, తయారీదారు వివరాలు, FSSAI లైసెన్స్, తయారీ తేదీ, గడువు తేదీ వంటి వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు. అతి తక్కువ ధరకు లభించే అన్‌బ్రాండెడ్ లేదా అనుమానాస్పద నెయ్యిని కొనుగోలు చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
కల్తీ ఆహారం తయారు చేస్తున్నట్లు లేదా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహారం తయారు చేస్తున్నట్లు గుర్తిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని H-FAST కోరింది. డయల్ 112 లేదా H-FAST హెల్ప్‌లైన్ 8712661212కు కాల్ లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు.
TV9 కథనాలతో ప్రజల ముందుకు వచ్చిన కల్తీ నెయ్యి దందా.. ఇప్పుడు H-FAST మెగా ఆపరేషన్‌తో మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 130 సంస్థల్లో తనిఖీలు.. 36 టన్నుల కల్తీ నెయ్యి, ముడిపదార్థాల స్వాధీనం.. కల్తీ తయారీ, సరఫరా నెట్‌వర్క్‌పై దర్యాప్తు.. ఇవన్నీ చూస్తుంటే ఈ దందా ఎంత లోతుగా విస్తరించిందో అర్థమవుతోంది. TV9 లేవనెత్తిన ప్రశ్నలకు ఇప్పుడు అధికారుల యాక్షన్ సమాధానంగా మారింది. ఇక ఈ దందా వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు..? కల్తీ నెయ్యి ఎక్కడెక్కడికి చేరింది..? ల్యాబ్ రిపోర్టుల్లో ఏం తేలనుంది..? అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
