AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medical Oxygen: ఢిల్లీలో ప్రాణ వాయువు కోసం ఎదురుచూపులు.. మరోసారి సర్ గంగారామ్‌ హాస్పిటల్‌లో తగ్గిన ఆక్సిజన్‌ నిల్వలు

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. మిగిలిన ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ మరికొద్ది గంటల వరకు మాత్రమే సరిపోతుందని అక్కడి వైద్యులు చెబుతున్నారు.

Medical Oxygen: ఢిల్లీలో ప్రాణ వాయువు కోసం ఎదురుచూపులు.. మరోసారి సర్ గంగారామ్‌ హాస్పిటల్‌లో తగ్గిన ఆక్సిజన్‌ నిల్వలు
Oxygen In Delhi Hospitals
Balaraju Goud
|

Updated on: Apr 25, 2021 | 12:14 PM

Share

Delhi’s Sir Ganga Ram Hospital: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. మిగిలిన ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ మరికొద్ది గంటల వరకు మాత్రమే సరిపోతుందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఆక్సిజన్ కోసం ఎదురుచూసి సకాలంలో అందక ఎంతోమంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. డిల్లీలోని ఐసీయూ బెడ్‌లు 99 శాతం నిండిపోయాయి.

దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌లో ఆక్సిజన్‌ నిల్వలు తగ్గిపోతుండటంతో శనివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఆస్పత్రి అధికారులు ప్రభుత్వానికి అత్యవసరం సందేశం పంపారు. అప్పటికి కేవలం గంటకి సరిపడా ప్రాణవాయువు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. 130 మంది రోగులు ఐసీయూలో ఉన్నారని.. మరో 30 మంది వెంటిలేటర్‌పై ఉన్నారని ఈ సందేశంలో పేర్కొన్నారు. ‘మరో రెండు గంటల్లో ఆక్సిజన్ అయిపోతుంది. వెంటిలేటర్లు పనిచేయడం లేదు. 24 గంటల్లో 25 మంది కోవిడ్ రోగులు చనిపోయారు. ఇప్పుడు మరో 60 మంది కరోనా రోగుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి’ అని సర్ గంగారాం ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ”ఎంతోమంది కృత్రిమంగా ఆక్సిజన్‌ అందించడం వల్లే బతుకుతున్నారు. సకాలంలో ఆక్సిజన్ కనుక సరఫరా చేయలేకపోతే వారంతా ఒడ్డున పడ్డ చేపల్లా చనిపోతారు” అని ఆయన ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోనూ కట్టుదిట్టమైన ఆంక్షలు ప్రకటించారు.

దీంతో అప్రమత్తమైన స్థానిక ఆప్‌ ఎమ్మెల్యే రాఘవ్‌ చద్దా అధికారులతో మాట్లాడి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను తెప్పించారు. అర్ధరాత్రి 12:20 గంటల సమయంలో ఒక మెట్రిక్‌ టన్ను ఆక్సిజన్‌ ఆస్పత్రికి చేరుకుంది. అది రెండు గంటలకు సరిపోతుందని ఆస్పత్రి అధికార ప్రతినిధి 12:45 గంటల సమయంలో తెలిపారు. వాస్తవానికి గంగారాం ఆస్పత్రికి ఫరీదాబాద్‌లోని ఒక పంపిణీదారుడు ఆక్సిజన్ అందించాల్సి ఉంది. వేకువజామున 3 గంటల ప్రాంతంలో ట్యాంకర్లు ఆస్పత్రికి చేరాల్సింది. కానీ, ఉదయం 4:15 గంటల సమయంలో 5 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల ఆక్సిజన్‌ ట్యాంకర్లు ఆస్పత్రికి వచ్చాయి. గత మూడు రోజుల్లో ఆస్పత్రికి అందిన భారీ ఆక్సిజన్‌ నిల్వలు ఇవే. ఇది 11-12 గంటలకు సరిపోతుందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చాలా రోజుల తర్వాత తిరిగి ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగులకు ఆక్సిజన్ అందించగలుగుతున్నామని తెలిపారు.

రెండు రోజుల క్రితం సైతం గంగారాం ఆస్పత్రిలో ఇదే పరిస్థితి తలెత్తింది. తమ వద్ద మరో రెండు గంటలకు సరిపడా ప్రాణవాయువు మాత్రమే ఉందని, అది కూడా అయిపోతే 60 మంది రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆస్పత్రి వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. దీంతో ఆగమేఘాల మీద కదిలిన యంత్రాంగం రెండు గంటల్లోపు ఆసుపత్రికి రెండు ఆక్సిజన్‌ ట్యాంకర్లను పంపింది.

ఆక్సిజన్ కొరత, సరఫరాలో సమస్యలపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాష్ట్రాల అవసరాలను గుర్తించి తదనుగుణంగా సరఫరా చేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ఒకటి వెల్లడించింది. దేశవ్యాప్తంగా సత్వర సరఫరా కోసం వాయు, రైలు మార్గాలనూ ఉపయోగించుకుంటున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.అయితే, కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రాలు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Read Also…  Srilanka New Covid strain: శ్రీలంకలో కొత్త రకం కరోనా గుర్తింపు.. గాలిలో గంటసేపు ఉంటుందంటున్న శాస్త్రవేత్తలు.. ఆందోళనలో అధికారులు