కరోనాతో మృతిచెందిన కార్మికులకు రూ.5లక్షల పరిహారం: ఆర్టీసీ ఎండీ
కరోనా తో మృతి చెందిన కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆర్టీసీ నిర్ణయించిందని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం ఏమాత్రం తగ్గడంలేదు. నిత్యం కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా కరోనా వైరస్ ప్రకంపనలు ఏపీఎస్ఆర్టీసీకి తాకాయి. ఇప్పటి వరకు 4,500 మంది ఆర్టీసీ సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడ్డట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలియజేశారు. ఇక మాయదారి కరోనా కారణంగా 72 మంది ఆర్టీసీ ఉద్యోగులు మరణించినట్లు ఆయన తెలిపారు. కాగా, కరోనా బారినపడినవారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కృష్ణబాబు వెల్లడించారు. కరోనా తో మృతి చెందిన కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆర్టీసీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. అయితే, ఆర్టీసీ కార్మికుల ఒక రోజు వేతనాన్ని జమ చేసి మృతులకుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు. త్వరలోనే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేస్తామని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు.