చార్లీ చాప్లిన్ శవ పేటికను దొంగలు ఎందుకు ఎత్తుకెళ్లారు?

నాలుగు పెళ్లిళ్లు...అంతులేని కష్టాలు... తినడానికి తిండి కూడా లేనంత పేదరికం... కన్నీటి చెమ్మను రెప్పల మాటున దాచుకోవడం ఆయనకు చిన్నప్పుడే అలవాటైపోయింది. ఆకలి తీరేందుకు నీళ్లు కూడా పనికొస్తాయన్న తత్వం పదేళ్లకే బోధపడింది. అయితే ఆవే ఆయనకు పాఠాలయ్యాయి. కన్నీటి విలువ... కొన్ని సార్లు అది పెట్టే క్షోభ అనుభవించిన ఆయన.. తనను తాను ఈ ప్రపంచానికి నవ్వుల నటుడిగా పరిచయం చేసుకున్నాడు.

చార్లీ చాప్లిన్ శవ పేటికను దొంగలు ఎందుకు ఎత్తుకెళ్లారు?
charlie chaplin
Follow us

| Edited By: Ravi Panangapalli

Updated on: Jun 18, 2024 | 1:53 PM

Charlie Chaplin: నాలుగు పెళ్లిళ్లు…అంతులేని కష్టాలు… తినడానికి తిండి కూడా లేనంత పేదరికం… కన్నీటి చెమ్మను రెప్పల మాటున దాచుకోవడం ఆయనకు చిన్నప్పుడే అలవాటైపోయింది. ఆకలి తీరేందుకు నీళ్లు కూడా పనికొస్తాయన్న తత్వం పదేళ్లకే బోధపడింది. అయితే ఆవే ఆయనకు పాఠాలయ్యాయి. కన్నీటి విలువ… కొన్ని సార్లు అది పెట్టే క్షోభ అనుభవించిన ఆయన.. తనను తాను ఈ ప్రపంచానికి నవ్వుల నటుడిగా పరిచయం చేసుకున్నాడు. మాటల్లేని చిత్రాల్లో తన హావభావాలతోనే నవరసాలను పండించి వీక్షకులకు ఆనందామృతాన్ని పంచాడు. ఆనందం అనుభవించేందుకు మనసు భాష వస్తే చాలని నిరూపించిన ఆయన ఈ ప్రపంచానికి నవ్వులరాజుగా చెరిగిపోని జ్ఞాపకమయ్యాడు. అతడు మరేవరో కాదు..ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నటుడు. సుప్రసిద్ధ హాస్య బ్రహ్మ, బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, గాయకుడు, యుద్దాన్ని ఎల్లప్పుడూ విమర్శించిన శాంతిప్రియుడు చార్లి చాప్లిన్. ఒకవైపు వెండితెర ప్రస్థానం వెలుగులతో కొనసాగుతుండగానే, అతడి వ్యక్తిగత జీవితం, వైవిహిక పొరపాట్లతో ముడిపెడుతూ సాగింది. అందుకే నాలుగు పెళ్లిళ్లు, 11 మంది సంతానంతో చాప్లిన్ జీవితం మరోవైపు వివాదాస్ప కోణానికి దర్పణం పట్టింది. ఆయన జీవితంలో ప్రతి అడుగు విశేషమే. కొన్నిసార్లు ఏటికి ఎదురీదారు. మరి కొన్ని సార్లు ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇంకొన్ని సార్లు తానే సంద్రమయ్యారు. అలాంటి నవ్వుల రాజు పుట్టుక నుంచి మరణం వరకు అతని జీవితం ఎన్నో మలుపులతో సాగింది..ఇప్పటి వరకు చాలా మందికి తెలియని చార్లీ చాప్లిన్‌ జీవిత రహస్యాలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి.

Interesting stories about the life of charlie chaplin

Interesting stories about the life of charlie chaplin

ఐదేళ్ల వయసులోనే స్టేజ్ షోలు 

చార్లీచాప్లిన్‌.. ఈ పేరు వినని వారు, ఆయన సినిమాలు చూడని వారు చాలా అరుదు. ఈ పేరు వింటేనే అందరి ముఖాల్లో చిరు నవ్వులు విరబూస్తాయి. చేతిలో కర్ర, చిరిగిన కోటు, తలపై పెద్ద టోపీ, విభిన్న నడకతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. బ్యాగీ ప్యాంటు, పెద్ద బూట్లు, చిన్న మీసంతో ప్రేక్షకుల హృదయాల్లో అతడి ముఖచిత్రాన్ని ముద్రించుకున్నాడు. నటనలో తన అమాయకపు చేష్టలతో ప్రతి ఒక్కరినీ కడుపుబ్బ నవ్వించాడు. చార్లీ చాప్లిన్ పూర్తి పేరు చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్. హన్నా, చార్లేస్‌ దంపతులకు1889 ఏప్రిల్ 16న చార్లి జన్మించాడు. తల్లిదండ్రులిద్దరూ నటీనటులే. వారిని స్పూర్తిగా తీసుకున్న చార్లీ హాస్యం పండించటం పట్ల తక్కువ సమయంలోనే మంచి నేర్పరిగా పేరుతెచ్చుకున్నాడు. లండన్‌ మ్యూజిక్ హాల్లో తన తల్లి ప్రదర్శనలు ఇచ్చేవారు. తన తల్లి నుంచే పాటలు పాడటం, డ్యాన్స్‌లు చేయడం నేర్చుకున్నాడు చార్లీ. సినిమా అనే వినోద మాద్యం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చార్లీ చాప్లిన్ బాల్యంలోనే బతుకు పోరాటం చేశాడు. చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను చవిచూశాడు. తినడానికి తిండి కూడా లేని దుర్భర జీవితంతో ఇబ్బంది పడ్డాడు. ఆకలి తట్టుకోలేక.. సరిగ్గా భోజన సమయానికి బంధువులు, తెలిసిన వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. అక్కడ వాళ్లు ఎలాగోలా తినేసి వెళ్లమంటారని, అలాగైన తన కడుపు నింపుకోవచ్చునని ఆశపడేవాడు. పేదరికం కారణంగా అతడు కేవలం 5ఏళ్ల వయసులోనే స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ మొదలుపెట్టాడు.

తండ్రి తాగుబోతు ..

చార్లీ తండ్రి ఒక తాగుబోతు. అతడు తన కుటుంబాన్ని పట్టించుకోకుండా పారిపోతే, చిన్నతనం నుండే అనాధశ్రమంలో పెరిగాడు. తల్లి ఒక్కతే కుటుంబాన్ని పోషించాల్సి వచ్చింది. ఆ తరువాత 37ఏళ్ల వయసులో అనారోగ్యంతో చార్లీ తండ్రి చార్లెస్‌ మరణించాడు. కొద్ది రోజులకే తన తల్లికి మతి చలించిపోయి పిచ్చిదానిలా ప్రవర్తిస్తుండటంతో చార్లీనే స్వయంగా తన తల్లిని పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాడు. తండ్రి లోకం విడిచి వెళ్లటం, తల్లి లోకం తెలియకుండా మారిపోవటంతో చార్లీ చుట్టూరా కష్టాలు చుట్టుముట్టాయి. చిన్న వయసులోనే అంతటి దుఃఖంలో చార్లి నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. అంతకు ముందు మూడేళ్ల వయసులోనే మిమిక్రీలో ప్రావీణ్యం పొందాడు. కష్టాలతో పెరిగిన చార్లీ.. విధితో మనిషి విషాద సంఘర్షణలను హాస్యభరితంగా చెబుతూ అద్భుతంగా మానవత్వీకరించారు. అలా ఏడేళ్లకే తల్లిదండ్రులకు దూరమై బ్రతుకు తెరువు కోసం చిన్న చిన్న పనులు చేయటం మొదలుపెట్టాడు. యుక్తవయసులో కొంతకాలం ఒక బార్బర్‌షాపులో కూడా పనిచేశాడు. మ్యూజిక్‌ హాల్‌కు సెక్యూరిటీగా కూడా పనిచేశాడు.

charlie chaplin

సినిమా కెరీర్ ప్రారంభం..

చార్లీ చాప్లిన్‌ సినిమా జీవితం చిన్నతనంలోనే మొదలైంది. 1913లో ఫ్రెడ్‌ కార్నో కంపెనీతో కలిసి వెళ్లిన అమెరికా టూర్‌ ఆయన జీవితాన్నే మార్చేసింది. మాక్సేనిట్‌ అనే నిర్మాత 150 డార్ల జీతంపై చిన్న నిడివిగల చిత్రాలలో నటించే అవకాశం కల్పించారు. చార్లీ నటించిన తొలి సినిమా 1914 ఫిబ్రవరి 2న విడుదలైంది. ఈ సినిమా పేరు ‘మేకింగ్‌ ఎ లివింగ్‌’. ఈ సినిమాలో చార్లీ తన చిలిపితనంతో కూడిన నటనతో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను నవ్వించాడు. చార్లీ సినిమాలను ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. తన అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో ఒకటైన ‘ది ట్రాంప్’ చార్లికి మంచి గుర్తింపును తెచ్చింది. 15 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం పూర్తిగా కామెడీ జోనర్‌గా తీశారు. అలాగే, ఇది పూర్తిగా మూకీ సినిమా. తన యాక్షన్, ఎక్స్‌ప్రెషన్స్‌తో యావత్‌మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. దాంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇక అంతే, అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు చార్లీ. ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుంచారు.

1920 నాటికి 69 సినిమాల్లో నటించి ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు చార్లీ చాప్లిన్‌. అలా 150 డాలర్లతో మొదలైన అతని జీతం ఒక్కసారిగా మిలియన్‌ డాలర్లుగా మారిపోయింది. చార్లీ నటించిన పూర్తి నిడివి ఉన్న చిత్రం ‘ది కిడ్’ 1921లో విడుదలైంది. చార్లీ చాప్లిన్‌ సినిమాల్లో ముఖ్యంగా ఎ ఉమెన్ ఆఫ్ పారిస్, సిటీ లైట్స్, ది గోల్డ్ రష్, ది సర్కస్, మోడరన్ టైమ్స్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. తన చమత్కారమైన స్టైల్‌తో ఎన్నో సినిమాలు చేసి కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరాడు. హాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద తనదైన ముద్ర వేసిన స్టార్‌గా ఎదిగాడు. హాస్య నటుడిగా మాత్రమే కాదు.. రచయిత, సంగీతకారుడు, దర్శకుడిగా కూడా రాణించాడు. తన సినిమాలను అన్ని రకాలుగానూ అద్భుతంగా తీర్చిదిద్దాడు.

అమెరికా నుంచి స్విట్జర్లాండ్‌కు మకాం..

వృత్తి రిత్యా కూడా చార్లీకి ఒడిదొడుకులు తప్పలేదు. ‘ది గ్రేట్ డిటెక్టర్’ సినిమాతో చార్లీ కమ్యూనిస్టుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. జర్మనీ నియంత హెడాల్ఫ్‌ హిట్లర్‌ను వ్యగ్యాంగా అనుకరిస్తూ 1940లో తీసిన ‘ది గ్రేట్ డిటెక్టర్’ చిత్రం వల్ల తను10ఏళ్ల పాటు రాజకీయ వివాదాల్లోనూ, వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. అతనిపై కమ్యూనిస్టు సానుభూతి పరుడుగా ముద్రపడటంతో పాటు తనకన్నా ఎంతో చిన్నవాళ్లను పెళ్లిళ్లు చేసుకోవడం విమర్శలకు గురిచేసింది. కొన్ని కేసులు చుట్టు ముట్టడంతో ఇంతకాలం తనకు ఆశ్రయం ఇచ్చిన అమెరికాను విడిచివెళ్లాక తప్పని పరిస్థితి ఏర్పడింది. అమెరికా పత్రిక రంగం, రాజకీయ వాదులు చాప్లిన్‌పై వ్యభిచారి, కమ్యూనిస్ట్‌ అని బురద చల్లడంతో 1952లో తన నాలుగో భార్య ఓనా ఒనెల్‌తో కలిసి అమెరికాను విడిచిపెట్టిన స్విట్జర్లాండ్‌లో స్థిరపడ్డాడు. మళ్లీ 20ఏళ్ల తరువాత ఒక్కసారి మాత్రమే 1972లో గౌరవ సత్కారం అందుకోవడానికి అమెరికా వెళ్లాడు. దాదాపు 20 ఏళ్లకు 20వ శతాబ్దపు సినిమాను ఒక కళగా మలచటంలో చాప్లిన్ కృషి అమూల్యమని కీర్తిస్తూ అమెరికాకు చెందిన అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆయనకు ఆస్కార్ అవార్డు ఇచ్చింది. తన జీవిత చరమాంకం వరకు చార్లీ స్విట్జార్లండ్‌లోనే ప్రశాంతతని, కుటుంబ సౌఖ్యాన్ని ఆనందించాడు.

నాలుగు పెళ్లిళ్లు, 11 మంది సంతానం..

సినిమాలను అమితంగా ఆరాధించిన చార్లీ చాప్లిన్‌ శృంగర జీవితాన్ని కూడా అంతగానే ఆస్వాదించాడు. చార్లీ చాప్లిన్‌ ఎక్కువగా వయసులో ఉన్న అమ్మాయిలనే ఇష్టపడేవాడు. వేశ్యాగృహాలు కూడా సందర్శించేవాడు. చాప్లిన్‌ తన జీవితంలో మొత్తం నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వారిలో ముగ్గురు 18 ఏళ్ల వయసు కన్నా తక్కువగా ఉన్నవారే. చార్లీన్‌ 14ఏళ్ల మిల్రేడ్‌ హారీస్‌ 1918 అక్టోబర్‌ 23వ తేదిన పెళ్లి చేసుకున్నాడు. 1920 లో కొన్ని కారణాల వల్ల చార్లీ, మిల్రేడ్స్‌ విడిపోయారు. 1914లో లిటాగ్రే అనే అరేళ్ల అమ్మాయి చాప్లెన్‌ను ఎంతగానో ఆకర్షించింది. ఆ తరువాత 12ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె చార్లీ స్టూడియోకు అవకాశం కోసం వచ్చింది. 1923లో దీ గోల్డ్‌రష్‌ చిత్రంలో ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి తిరిగారు. 1924లో లిటాగ్రే గర్బవతి అయ్యింది. వీరిద్దరూ1924 నవంబర్‌ 24న పెళ్లి చేసుకున్నారు. అప్పటికీ ఆమె వయసు 16 సంవత్సరాలు. చాప్లిన్‌కు 35 సంవత్సరాలు. ఈ విషయాల్ని లిటాగ్రే తన జీవిత్ర చరిత్రలో వివరించింది. అంతే ఆమెరాసిన తన జీవిత చరిత్రలో మరో విషయాన్ని కూడా ప్రస్థావించారు. ఒకనోక సందర్బంలో 100 మంది స్త్రీలు ముందుటే, చాప్లిన్‌ రెండు నిమిషాల్లో తనకు నచ్చిన స్త్రీని ఎన్నుకోగలడు అని అంటే.. దానికి చాప్లిన్‌ సమాధానంగా లెక్కతప్పు అని.. 100 మంది కాదు.. వెయ్యి మంది అని సరిచేశాడు. వీళ్ల రేండేళ్ల కాపురంలో ఇద్దరు సంతానం కలిగిన తరువాత విడాకుల కోసం లిటాగ్రే కోర్టులో కేసు వేసింది. ఆమె రాసిన 42పేజీల లీగల్‌ కంప్లైట్ కాపీలు అప్పట్లో జనం ఎగబడి కొన్నారు. అందులో వారి అంతరాంగిక విషయాలేన్నో ఆమె బహిర్గంత చేసింది.

ఆ తరువాత 20ఏళ్ల పౌలేట్టి గోడర్డ్‌ అనే నటిని కలిశాడు చార్లీ. 1936లో ఆమెను పెళ్లాడతానని ప్రామీస్‌ చేశాడు. కొంతకాలం చాప్లీన్‌ పిల్లలకు ఆమె మారు తల్లిగా ఉన్నారు. వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలేత్తటంతో ఆమె చార్లీ నుంచి విడిపోయింది.1941లో 22ఏళ్ల జోన్‌ బేర్రీ అనే యువతి.. స్క్రీన్‌టెస్ట్ కోసం చాప్లీన్ స్టూడియోకి మొదటిసారిగా వచ్చింది. అప్పటి నుండి తరచూ ఆమె చాప్లిన్ వద్దకు వస్తూ పోతూ ఉండేది. కొంతకాలం తరువాత ఆమె న్యూయార్క్‌కు వెళ్లిపోయింది. ఆ తరువాత చాప్లిన్‌ ప్రముఖ నాటక రచయిత యూజీని బోనెల్‌ కూతురైన 17ఏళ్ల ఓనా ఒనెల్‌ను కలిశాడు. 1943లో ఆమెను పెళ్లిచేసుకున్నాడు. ఇది చార్లీచాప్లెన్‌కు నాలుగో వివాహం. ఈ వివాహం చార్లీ జీవితంలో విజయవంతమైంది. ఈ ఇద్దరూ చాలా కాలం పాటు సంతోషంగా కలిసి జీవించారు. చాప్లిన్ చనిపోయే వరకు ఓనీల్ తో కలిసే ఉన్నారు.

కానీ, మధ్యలో 1943 మే నెలలో జోన్‌బేర్రీ చార్లిచాప్లీన్‌ వద్దకు తిరిగి వచ్చింది. దౌర్జన్యంగా చార్లి ఇంట్లోకి ప్రేశించి గొడవకు దిగింది. దీంతో నెలరోజుల పాటు జైలుపాలైంది. అప్పుడు ఆమె 3నెలల గర్భవతి అని తెలిసింది. జైలు నుండి విడుదలైన తరువాత ఆమె తన బిడ్డకు తండ్రి చార్లీ చాప్లిన్‌ అని కోర్టులో కేసు వేసింది. డీఎన్‌ఏ టెస్ట్‌లో చాప్లీన్‌ ఆ బిడ్డకు తండ్రి కాదని తేలింది. చాప్లిన్‌కు చివరి11వ సంతానం తన 70వ ఏటా కలిగింది. చార్లీ తన జీవిత చరిత్రలో..తన వైవాహిక జీవితాన్ని గురించి రాస్తూ.. ఓనా లాంటి స్త్రీ మొదటే నాకు పరిచయం అయ్యుంటే..స్త్రీలతో నాకు ఎటువంటి సమస్యలు వచ్చి ఉండేవి కావు అని, తనకు తెలియకుండానే ఆమె కోసం జీవితాంతం ఎదురు చూశానని చెప్పాడు. అంతేకాకుండా చాలా మంది సుప్రసిద్ధి మహిళలతో చాప్లిన్‌ కు సంబంధాలు ఉన్నాయి.

Charlie Chaplin

Charlie Chaplin

గొప్పవారితో అనుబంధాలు.. అవార్డులు..

చార్లీ ఎత్తులో తక్కువగా ఉండి పొట్టిగా ఉండేవాడు. అతని ఎత్తు కేవలం 5.5అడుగులు మాత్రమే ఉండి సన్నగా ఉండేవాడు. అయినా కూడా అతను తన ప్రతిభతో ప్రపంచాన్ని నవ్వించాడు. ఆ తరువాత చాలా అవార్డులను కూడా గెలుచుకున్నాడు. 1940లలో ‘ది గ్రేట్‌ డిక్టెటర్’ అనే సినిమాకు గానూ అతనికి బెస్ట్‌ యాక్టర్ అవార్డు దక్కింది. 1952లో బ్యాన్ అయిన లైమ్‌ లైండ్‌ అనే మూవీకి దాని సంగీతం వలన ఆస్కార్ అవార్డు వచ్చింది. చార్లీని సాధారణ మనుషులతో పాటు గొప్ప గొప్ప వ్యక్తులు కూడా అభిమానించే వారు. చార్లీ రాసిన బయోగ్రాఫీలో మహత్మగాంధీ సూత్రాలంటే బాగా ఇష్టమని రాసుకున్నాడు. ఈ కారణంగానే అతను బ్రిటీష్ ప్రధానమంత్రి విస్లటన్‌ చర్చిల్‌ ని కలుకున్నప్పుడు.. అతను మహాత్మ గాంధీని కలవాలని చార్లీ కోరాడు. ఈ కారణం చేతనే అతను మహత్మాగాంధీని కూడా కలుసుకున్నాడు. భారత మాజీ ప్రధాని జవహార్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ కూడా స్వీట్జర్లాండ్‌లో చార్లీని కలుసుకున్నారు. చార్లీ చాప్లిన్ జీవితంలోని ఒక సంఘటనను ఆయన తన బయోగ్రఫీలో రాసుకున్నాడు.

అది 1953వ సంవత్సరం. భారతదేశపు మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఒక సమావేశానికి హాజరయ్యేందుకు స్విట్జర్లాండ్ వెళ్ళారు. అక్కడ అతను చార్లీ చాప్లిన్‌ను కలిశాడు. ఈ సమావేశాన్ని చాప్లిన్ తన ఆత్మకథలో పేర్కొన్నాడు. మరుసటి రోజు, పండిట్ నెహ్రూ, చాప్లిన్ కారులో ఎక్కడికో వెళ్తున్నారు. ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ మాటల్లో మునిగిపోయారు. అంతలోనే వారి డ్రైవర్ కారును సడెన్‌గా బ్రేక్‌ వేసి ఆపేశారట. ఒక్కసారిగా ఇద్దరూ ఉలిక్కిపడి చూసేసరికి ఎదురుగా పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి ఎదురైన ప్రమాదాన్ని తప్పించారని తెలిసింది. వీరు ప్రయాణిస్తున్న కారు మరొక వాహనం ఢీకొనబోతుండగా డ్రైవర్‌ కాపాడాడని వారికి అర్థమైంది. దాంతో వారిద్దరూ ప్రాణాలతో తృటిలో తప్పించుకుని బయటపడ్డారు. ఈ విషయాన్ని చార్లి చాప్లిన్‌ ఆత్మకథ ద్వారా ప్రపంచానికి తెలిసింది.

చార్లీ మరణం వెనుక అసలు కారణం..

అమెరికా అధికారుల వేధింపులు తట్టుకోలేక స్విట్జర్లాండ్‌ మకాం మార్చిన చార్లీ.. 88ఏళ్ల వయసులో మరణించారు. 1977 డిసెంబర్ 24న ప్రపంచం చార్లీచాప్లిన్‌ కు కన్నీటి విడ్కోలు చెప్పింది. క్రిస్మస్ వేడుకలకు కొన్ని గంటల ముందు ఆయన తుదిశ్వాస విడిచారు. విశ్వావ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన చార్లీచాప్లిన్ ఎలా చనిపోయాడు అనేది మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. 1977సంవత్సరం డిసెంబర్‌ 25న చార్లీకి నిద్రలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. ఆ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో అతను మళ్లీ మేల్కోలేక పోయాడు. కానీ, ఇతని చావు ఇప్పటి వరకు పరిష్కారం దొరకని ఒక చిక్కుముడిగానే మిగిలిపోయింది. అతని ఆరోగ్యం అంతగా బాగోలేదని అందుకనే అతనికి ఆక్సిజన్‌ పెట్టారని, ఆసమయంలోనే చార్లీ చనిపోయాడని అంటుంటారు. ఇదిలా ఉంటే, వృద్ధాప్యం కారణంగానే చార్లీ చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఆ సమయంలో ఆయన నాలుగో భార్య ఓనా 11 మంది పిల్లల్లో నలుగురు చాప్లిన్‌తోనే ఉన్నారు.

చార్లీ సమాధిని ఎందుకు కాంక్రీట్‌ చేశారు..?

చాప్లిన్ సినీ జీవితం 1914లో మొదలై 1967లో ముగిసింది. 81 సినిమాలు రూపొందించారు. నటనా జీవితానికి ముగింపు చెప్పిన 10ఏళ్లకు ఆయన కన్నుమూశారు. చాప్లిన్ చనిపోయిన రెండు రోజుల తరువాత, లేక్‌ జేనివా కొండల మీద ఖననం చేశారు. కానీ, చాప్లిన్‌ కథ అక్కడితో ముగియలేదు. చార్లీ మరణానంతరం అతనికి సంబంధించిన మరో సంచలనాత్మక సంఘటన చోటు చేసుకుంది. చార్లీ చనిపోయిన కొన్ని నెలల తరువాత 1978 మార్చిలో ఇద్దరు దొంగలు చాప్లిన్ శవపేటికను వెలికితీసి శవాన్ని ఎత్తుకెళ్లారు. చాప్లిన్ శవాన్ని తిరిగి ఇవ్వాలంటే 4 లక్షల పౌండ్లు అంటే ప్రస్తుత విలువ ప్రకారం 23.5 లక్షల డాలర్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చాప్లిన్ మరణానంతరం ఆయన భార్యకు 1.2 కోట్ల పౌండ్లు అంటే ప్రస్తుతం విలువ ప్రకారం 7 కోట్ల డాలర్లు వారసత్వ ఆస్తిగా అందింది. కానీ, దొంగలడిగిన డబ్బు ఇచ్చేందుకు చాప్లిన్ భార్య నిరాకరించారు. డబ్బులివ్వకపోతే, ఆమె పిల్లలకుహానీ చేస్తామని ఆ తరువాత దొంగలు ఫోన్‌ చేసి బెదిరించారు. చాప్లిన్‌ శవపేటిక విషయంలో దొంగల బెదిరింపుల గురించి ఆ కుటుంబం బయటకు చెప్పలేదు. కానీ, శవపేటిక అదృశ్యంపై వదంతులు వ్యాపించాయి. దీంతో స్విస్‌ పోలీసులు రెండు వందల టెలిఫోన్‌ కియోస్కోల మీద నిఘా పెట్టారు. చాప్లిన్‌ టెలిఫోన్‌ కూడా ట్యాప్‌ చేశారు.

ఆ తరువాత ఐదు వారాలకు చాప్లిన్ శవపేటికను దొంగిలించిన దొంగలను గుర్తించి, అరెస్ట్ చేశారు. లేక్‌జేనివాలోని ఒక మొక్కజొన్న చేలో పాతిపెట్టిన చాప్లిన్ శవపేటికను గుర్తించారు పోలీసులు. చాప్లీన్ శవపేటికను దొంగిలించిన ఇద్దరిపై కేసు పెట్టినట్టు జేనివా పోలీసులు చెప్పారు. శవపేటికను దొంగిలించినట్టు చాప్లిన్ మరణించిన ఏడాది తరువాత 1978 డిసెంబర్ 11స్విస్‌ కోర్టులో పోలాండ్‌కు చెందిన శరణార్థి రోమన్ వార్ధాస్‌ ఒప్పుకున్నాడు. ఖననం చేసిన ప్రదేశం నుంచి చార్లిస్‌ శవాన్ని వెలికితీసి అతని కుటుంబం నుంచి డబ్బులు లాగాలని చూసినట్టుగా చెప్పాడు. ఆటో మెకానిక్‌ అయిన రోమన్‌ వార్ధాస్‌ తనకు సరైన ఉపాధి లేకపోవటంతో ఇలాంటి పనిచేయాల్సి వచ్చిందని చెప్పాడు. దీనికోసం అతని స్నేహితుడి సాయం తీసుకున్నట్టు వివరించాడు. ఈ కేసులో వార్ధాస్‌కు నాలుగున్నరేళ్లు జైలు శిక్షపడగా, అతని స్నేహితుడికి 18నెలల జైలు శిక్ష పడింది. ఆ తరువాత చాప్లిన్ శవాన్ని మొదట అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశంలోనే తిరిగి ఖననం చేశారు. ఈ సారి దొంగతనానికి అవకాశం లేకుండా కాంక్రీట్‌తో సమాధి చేశారు.

గ్రహశకలానికి చార్లీ చాప్లిన్‌ పేరు..

ఉక్రెయిన్‌కు చెందిన ఖగోళ పరిశోధకురాలు ఒకరు తాను కనుగొన్న గ్రహశకలానికి చాప్లిన్ 3623 అని పేరు పెట్టారు. అలాగే, చాప్లిన్ హాలీవుడ్‌ను వీడిన తరువాత స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో నివసించారు. అక్కడ ఆయన జ్ఞాపకార్థం ఒక మ్యూజియం కూడా ఉంది. ఇక చాప్లిన్‌కు ఇష్టమైన ప్రదేశాల్లో స్కాట్లాండ్‌లోని నేర్న్ ఒకటి. ప్రతి సంవత్సరం చార్లీ ఇక్కడకు వెళ్లేవారు. తనకు ఇక్కడ లభించే ప్రశాంతత వెలకట్టలేనిది అని చాప్లిన్ తన సన్నిహితులతో చెప్పేవారు. అయితే, దీని వెనుక అసలు విషయం ఏంటంటే.. నేర్న్‌ ప్రజలకు చాప్లిన్ ఎవరో పెద్దగా తెలియదు. కాబట్టే.. ఇక్కడ అభిమానుల తాకిడి ఉండేది కాదు. అదే ఆయనకు బాగా సంతోషాన్నిచ్చిన అంశం అంటారు.

మరిన్ని ప్రీమియం వార్తల కోసం

ఓరి నీ యేశాలు.. గుడికి వచ్చి ఇదేం పని...
ఓరి నీ యేశాలు.. గుడికి వచ్చి ఇదేం పని...
బదిలీపై వెళ్తున్న సార్‌ను పట్టుకుని గుక్కెట్టి ఏడ్చిన స్టూడెంట్స్
బదిలీపై వెళ్తున్న సార్‌ను పట్టుకుని గుక్కెట్టి ఏడ్చిన స్టూడెంట్స్
పోలీసులను చూస్తే అతను సైకో అయిపోతాడు....
పోలీసులను చూస్తే అతను సైకో అయిపోతాడు....
యాదాద్రి జిల్లాలో వింత ఘటన.! మహిళకు తోకతో పుట్టిన శిశువు..
యాదాద్రి జిల్లాలో వింత ఘటన.! మహిళకు తోకతో పుట్టిన శిశువు..
దుష్ప్రచారం తట్టుకోలేక జంట ఆత్మహత్య! కానీ అనుకోని స్థితిలో..
దుష్ప్రచారం తట్టుకోలేక జంట ఆత్మహత్య! కానీ అనుకోని స్థితిలో..
మానవాళిని భయపెడుతోన్న మరో వైరస్. ఈలక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్
మానవాళిని భయపెడుతోన్న మరో వైరస్. ఈలక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్
సముద్రఖనితో వేణు స్వామి ప్రత్యేక పూజలు.. నైవేద్యంగా మటన్ కర్రీ.!
సముద్రఖనితో వేణు స్వామి ప్రత్యేక పూజలు.. నైవేద్యంగా మటన్ కర్రీ.!
రొమాంటిక్ సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు.! కానీ మాకు బోరింగ్‌..
రొమాంటిక్ సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు.! కానీ మాకు బోరింగ్‌..
బిగ్ బాస్ సీజన్ 8 డేట్ ఫిక్స్.! కంటెస్టెంట్స్ లిస్ట్ అదిరింది.
బిగ్ బాస్ సీజన్ 8 డేట్ ఫిక్స్.! కంటెస్టెంట్స్ లిస్ట్ అదిరింది.
ఐశ్వర్యకు అభిషేక్ ఇన్‌ డైరెక్టర్ మెసేజ్‌.? విడాకులు అంత ఈజీనా.?
ఐశ్వర్యకు అభిషేక్ ఇన్‌ డైరెక్టర్ మెసేజ్‌.? విడాకులు అంత ఈజీనా.?