బీర్ బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు.. షాకిచ్చిన కోర్ట్.. ఏకంగా ఎంత జరిమానా విధించారంటే?
Kerala Beer Bottle Case: వ్యాపారులు చిన్న మొత్తమే కదా అని అదనంగా వసూలు చేసే ప్రతి రూపాయి వెనుక సామాన్యుడి శ్రమ దాగి ఉంటుంది. ఈ తీర్పు కేవలం కేరళకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఎంఆర్‌పి (MRP) ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తూ వినియోగదారులను మోసం చేసే ప్రతి వ్యాపారికి ఒక హెచ్చరిక లాంటిది.

Consumer Court Verdict: పెరిగిన ధరల పేరుతోనో, కూలింగ్ ఛార్జీల నెపంతోనో నిర్దేశిత ధర (MRP) కంటే ఎక్కువ వసూలు చేసే వ్యాపారులకు కేరళ వినియోగదారుల కోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఒక బీర్ బాటిల్‌పై కేవలం10 రూపాయలు అదనంగా వసూలు చేసినందుకుగానూ, సదరు ప్రభుత్వ సంస్థకు ఏకంగా రూ.25,000 భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
బాటిల్‌పై రూ.170.. బిల్లులో రూ.180: అసలేం జరిగిందంటే?
కేరళలోని పతనంతిట్ట ప్రాంతానికి చెందిన ఒక వినియోగదారుడు అక్కడ ఉన్న కేరళ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (KSBC) ప్రభుత్వ మద్యం దుకాణంలో 650 మిల్లీలీటర్ల బీర్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. అయితే ఆ బాటిల్‌పై ముద్రించిన గరిష్ట రిటైల్ ధర (MRP) రూ.170 కాగా, దుకాణ సిబ్బంది మాత్రం అతని దగ్గర రూ.180 వసూలు చేశారు.
ఈ అన్యాయాన్ని సదరు కస్టమర్ ప్రశ్నించగా, బిల్లులో ఎంత ఉంటే అంత కట్టాల్సిందేనని సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. “ఏం చేసుకుంటావో చేసుకో.. కావాలంటే కేసు పెట్టుకో” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో అవమానానికి గురైన సదరు వినియోగదారుడు పట్టు వదలకుండా, తన హక్కుల కోసం పతనంతిట్ట జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను (కన్స్యూమర్ కోర్టును) ఆశ్రయించాడు.
ప్రభుత్వ సంస్థ వింత వాదనలు.. కొట్టిపారేసిన కోర్టు..!
ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టుకు కేరళ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (KSBC) పలు వింత కారణాలను సాకుగా చూపింది. కేరళ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘సామాజిక భద్రతా సెస్’ వల్లే మద్యం ధరలు పెరిగాయని, అందుకే రూ.10 ఎక్కువ వసూలు చేశామని సమర్థించుకుంది. గోడౌన్లలో, దుకాణాలలో ఉన్న కోట్లాది బాటిళ్లపై ధరలు మారిన ప్రతిసారీ కొత్త స్టిక్కర్లు వేయడం సాధ్యం కాదని వాదించింది. అంతేకాకుండా, ఆ వినియోగదారుడే తమ సిబ్బందితో గొడవ పడ్డాడని రివర్స్ కేసు పెట్టే ప్రయత్నం చేసింది. అయితే, జార్జ్ బేబీ (ప్రెసిడెంట్), నిషాద్ తంకప్పన్ (సభ్యుడు)లతో కూడిన వినియోగదారుల కమిషన్ బెంచ్ ఈ వాదనలను పూర్తిగా తోసిపుచ్చింది.
“ప్రభుత్వ అంతర్గత ఉత్తర్వులు, జీవోలతో సామాన్య వినియోగదారుడికి సంబంధం లేదు. లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం ప్యాకేజీపై ఉన్న ముద్రిత ధర (MRP) మాత్రమే వినియోగదారుడు చెల్లించాల్సిన చట్టబద్ధమైన గరిష్ట ధర. దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా అది వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం అక్రమ వ్యాపార పద్ధతి, సేవా లోపం కిందకే వస్తుంది” అని కోర్టు స్పష్టం చేసింది.
కోర్టు సంచలన తీర్పు.. భారీ జరిమానా..!
ఇలాంటి అక్రమ వసూళ్ల ధోరణికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో కోర్టు కేరళ ప్రభుత్వ బెవరేజెస్ కార్పొరేషన్‌కు గట్టి షాక్ ఇచ్చింది. బాటిల్‌పై ఉన్న ధరకంటే ఎక్కువ వసూలు చేయడం వల్ల వినియోగదారుడు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడని భావించిన కమిషన్ తీర్పునిచ్చింది. అదేంటో ఓసారి చూద్దాం..
అదనంగా వసూలు చేసిన రూ.10లను 9 శాతం వడ్డీతో కలిపి కస్టమర్‌కు తిరిగి ఇచ్చేయాలి.
వినియోగదారుడికి కలిగించిన మానసిక వేదనకు గానూ రూ.15,000 పరిహారం చెల్లించాలి.
కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.10,000లను సదరు బాధితుడికి అందించాలి.
ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని కోర్టు గడువు విధించింది.
వ్యాపారులు చిన్న మొత్తమే కదా అని అదనంగా వసూలు చేసే ప్రతి రూపాయి వెనుక సామాన్యుడి శ్రమ దాగి ఉంటుంది. ఈ తీర్పు కేవలం కేరళకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఎంఆర్‌పి (MRP) ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తూ వినియోగదారులను మోసం చేసే ప్రతి వ్యాపారికి ఒక హెచ్చరిక లాంటిది. వినియోగదారులు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండి, ప్రశ్నించినప్పుడే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
