వారెవ్వా.. అమేజింగ్.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలిస్తే..
ఆరోగ్యానికి మేలు చేసే సహజ పానీయాల్లో కొబ్బరి నీరు ఒకటి. వేసవిలో దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందిస్తుంది. చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీరు తాగడం మంచిదా అనే సందేహం వ్యక్తం చేస్తుంటారు. నిపుణుల ప్రకారం, సాధారణంగా ఖాళీ కడుపుతో కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఇది సహజమైన హైడ్రేషన్ డ్రింక్‌లా పనిచేస్తుంది. అయితే, రోజంతా మంచినీరు తీసుకోవడం, ఇతర ద్రవ పదార్ధాలు తీసుకోవడం కూడా అవసరం.

ఉదయం లేవగానే చాలా మంది టీ లేదా కాఫీలు తాగడానికి అలవాటు పడిపోయారు. కానీ, ఒకసారి పరగడుపున కొబ్బరి నీళ్లు తాగి చూడండి.. మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీ శరీరమే ఆ తేడా చెబుతుంది. రాత్రంతా నిద్రపోవడంతో శరీరం నీటిని కోల్పోతుంది. ఉదయం కొబ్బరి నీళ్లు తాగితే శరీరం రీఫ్రెష్ అయిన ఫీలింగ్ కలిగిస్తుంది. శరీరానికి ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. అలసట, బలహీనత తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో ఉండే సహజ ఎలక్ట్రోలైట్స్ శరీరానికి కావాల్సిన ద్రవాలను భర్తీ చేయడంలో సహాయపడతాయి. ఉదయం పరగడుపున తాగితే శరీరం తేలికగా అనిపించి, అలసట తగ్గిన భావన కలుగుతుంది. దీంతో రోజును తాజాగా ప్రారంభించడానికి ఇది హెల్ప్ చేస్తుంది.
ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియకు కూడా మంచిది. ఇది కడుపులోని అసిడిటీని తగ్గించి, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనివల్ల కడుపు చాలా తేలికగా అనిపిస్తుంది. అయితే ఇది అసిడిటీ ఉన్నవారికి మందు మాత్రం కాదు. కొబ్బరి నీళ్లలో క్యాలరీలు చాలా తక్కువ. పరగడుపున ఇది తాగడం వల్ల అనవసరమైన ఆకలి తగ్గుతుంది, దీంతో మీరు బ్రేక్ ఫాస్ట్ తక్కువగా తీసుకుంటారు. పైగా టీ కాఫీలతో పోలిస్తే.. ఇది ఆరోగ్యకరం కూడా. దాంతో బరువు తగ్గించేందుకు కూడా పరోక్షంగా సహాయపడుతుంది. అయితే ఇది బరువు తగ్గించే మేజిక్ డ్రింక్ కాదని గుర్తుంచుకోవాలి.
కొబ్బరి నీటిలో పొటాషియం, మాగ్నీషియం, కాల్షియం, సోడియం వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. పరగడుపునే కాదు కొబ్బరినీరు ఎప్పుడు తాగినా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి చర్మం పొడిబారకుండా, వేసవి తాపానికి గురికాకుండా కాపాడుతుంది. దాంతో చర్మాన్ని కాంతివంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది. శరీరం హైడ్రేట్‌గా ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది కొంతవరకు సహాయపడుతుంది.
అయితే ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ప్రభావం ఉండకపోవచ్చు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు లేదా పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకూడని వారు కొబ్బరి నీరు ఎక్కువగా తాగకూడదు. అలాగే రోజుకు ఒక గ్లాస్ లేదా ఒక కొబ్బరి నీరు సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే, ఖాళీ కడుపుతో కొబ్బరి నీరు తాగడం చాలా సందర్భాల్లో ఆరోగ్యానికి మంచిదే. అయితే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకుని తాగడం ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




