బెంగాల్ లో దిగజారిన శాంతి భద్రతలు, కేంద్ర దళాలను రప్పించండి. ఈసీకి బీజేపీ అభ్యర్థన

పశ్చిమ బెంగాల్ లో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని బీజేపీ ఆరోపించింది. వచ్ఛే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సాద్యమైనంత త్వరగా కేంద్ర భద్రతా దళాలను రాష్ట్రంలో నియమించాలని కోరుతూ..

బెంగాల్ లో దిగజారిన శాంతి భద్రతలు, కేంద్ర దళాలను రప్పించండి. ఈసీకి బీజేపీ అభ్యర్థన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 15, 2020 | 3:47 PM

పశ్చిమ బెంగాల్ లో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని బీజేపీ ఆరోపించింది. వచ్ఛే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సాద్యమైనంత త్వరగా కేంద్ర భద్రతా దళాలను రాష్ట్రంలో నియమించాలని కోరుతూ ఈసీకి ఈ పార్టీ నేతలు లేఖ రాశారు. జమ్మూ కాశ్మీర్ లో కన్నా బెంగాల్ లో పరిస్థితి చాలావరకు క్షీణించిందని, వెంటనే ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) ని అమలు చేసేలా చూడాలని బీజేపీ ఎమ్మెల్యే సవ్యసాచి దత్తా కోరారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం లోని 15 వ సెక్షన్ కింద దీన్ని విధించాలన్నారు. రాష్ట్ర పోలీసుల మద్దతుతో పాలక తృణమూల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునే ప్రమాదం ఎంతయినా ఉందని, అందువల్ల సాధ్యమైనంత త్వరగా కేంద్ర దళాలను రప్పించాలని ఆయనతో బాటు ఇతర బీజేపీ నేతలు కూడా అభ్యర్థించారు.

బెంగాల్ లో ఇటీవల పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై టీఎంసీ మద్దతుదారులని భావిస్తున్నవారు.. రాళ్లు, రాడ్లతో పెద్ద ఎత్తున దాడికి దిగారు. ఆ ఘటనలో ఆయన కారు అద్దాలు పూర్తిగా పగిలిపోగా, బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్గీయ, మరో నేత గాయపడ్డారు. ఈ ఘటనను పార్టీ తీవ్రంగా పరిగణించింది. పైగా రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయని కూడా ఈ పార్టీ ఆరోపించింది. రాష్ట్రంలో భద్రతా లోపాలపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ బెంగాల్ చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి కేంద్రం సమన్లు జారీ చేసింది. కాగా- డిప్యూటీ ఎలెక్షన్ కమిషనర్ సుదీప్ జైన్ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం అధికారులు త్వరలో ఈ రాష్ట్రాన్ని విజిట్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ‘ టీఎంసీ ఫెయిల్ కార్డ్’ అన్న పేరిట బీజేపీ…. ఈ పదేళ్లలో సీఎం  మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఓ విస్తృత పత్రాన్ని విడుదల చేసింది.

అయితే ఇంత జరుగుతున్నా దీదీ మాత్రం ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకంగా కొట్టి పారేస్తున్నారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమలో తాము పోట్లాడుకుంటూ ఆ నెపాన్ని తమ పార్టీపై రుద్దుతున్నారని ఆమె ఎదురుదాడికి దిగుతున్నారు. నడ్డా కాన్వాయ్ పై జరిగిన దాడిని ఆమె తేలికగా కొట్టి పారేసిన సంగతి తెలిసిందే. దానిని ఆమె   నౌటంకీగా అభివర్ణించారు.