AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూజ కోసం వెళ్తే ప్రాణాలు తీసిన గంగమ్మ.. ఒకరిని కాపాడబోయి.. ఐదుగురూ జలసమాధి!

బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో బుధవారం (జూన్ 24) అత్యంత ఘోర ప్రమాదం సంభవించింది. వసుదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యాంపూర్ గంగా ఘాట్‌లో స్నానానికి వెళ్లిన ఐదుగురు బాలికలు అకస్మాత్తుగా నదిలోని లోతైన నీటిలోకి జారిపోయి మునిగిపోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఉండటం ఈ విషాదాన్ని మరింత తీవ్రం చేసింది. ఈ ఊహించని ఘటనతో ఘాట్ వద్ద ఒక్కసారిగా గందరగోళం, ఆర్తనాదాలు చెలరేగగా, శ్యాంపూర్ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

పూజ కోసం వెళ్తే ప్రాణాలు తీసిన గంగమ్మ.. ఒకరిని కాపాడబోయి.. ఐదుగురూ జలసమాధి!
Shyampur Ghat Tragedy
Balaraju Goud
|

Updated on: Jun 24, 2026 | 3:23 PM

Share

బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో బుధవారం (జూన్ 24) అత్యంత ఘోర ప్రమాదం సంభవించింది. వసుదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యాంపూర్ గంగా ఘాట్‌లో స్నానానికి వెళ్లిన ఐదుగురు బాలికలు అకస్మాత్తుగా నదిలోని లోతైన నీటిలోకి జారిపోయి మునిగిపోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఉండటం ఈ విషాదాన్ని మరింత తీవ్రం చేసింది. ఈ ఊహించని ఘటనతో ఘాట్ వద్ద ఒక్కసారిగా గందరగోళం, ఆర్తనాదాలు చెలరేగగా, శ్యాంపూర్ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

స్థానిక సమాచారం ప్రకారం, శ్యాంపూర్ గ్రామానికి చెందిన క్రాంతి పాశ్వాన్ ఇంట్లో ఒక పవిత్రమైన పూజ కార్యక్రమం జరుగుతోంది. పూజ నిమిత్తం ఉదయాన్నే పవిత్ర గంగానదిలో స్నానం ఆచరించేందుకు క్రాంతి పాశ్వాన్ నలుగురు కుమార్తెలు సంగీత కుమారి (18), బినీతా కుమారి (16), సంధ్యా కుమారి (14), సోనమ్ కుమారి (12) బయలుదేరారు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన చమక్ లాల్ పాశ్వాన్ కుమార్తె హీనా కుమారి (19) కూడా కలిసి శ్యాంపూర్ ఘాట్‌కు వెళ్ళారు. అందరూ ఎంతో ఉల్లాసంగా నదిలోకి దిగారు. కానీ అదే వారి చివరి ప్రయాణం అవుతుందని ఎవరూ ఊహించలేదు.

అమ్మాయిలందరూ గంగా నదిలో స్నానం చేస్తుండగా, వారిలో ఒకరు అకస్మాత్తుగా నది అడుగున ఉన్న లోతైన గుంత, సుడిగుండం వైపు జారిపోయింది. ఆమె నీటిలో మునిగిపోతూ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడటం చూసి, మిగిలిన నలుగురు అమ్మాయిలు ఆమెను రక్షించేందుకు ఒకరినొకరు పట్టుకుంటూ ముందుకు పరుగెత్తారు. అయితే, ఆ సమయంలో గంగానదిలో ప్రవాహం చాలా బలంగా ఉంది.

బలమైన నీటి ఉధృతికి వారు తట్టుకోలేకపోయారు. ఒక్కొక్కరిగా ఆ ఐదుగురు అమ్మాయిలు ఆ లోతైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ సంఘటన ఎంత అకస్మాత్తుగా జరిగిందంటే, ఘాట్ వద్ద ఉన్న ఇతర జనం తేరుకుని వారిని రక్షించే అవకాశం కూడా లభించలేదు. కొందరు స్థానికులు వెంటనే నదిలోకి దూకి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, నది లోతు, వేగం కారణంగా వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే ఆ ఐదుగురు బాలికలు అందరి కళ్ల ముందే నీటిలో మునిగి అదృశ్యమయ్యారు.

ఈ ఘోర ప్రమాద వార్త తెలియగానే వారి కుటుంబాలు కుప్పకూలిపోయాయి. క్రాంతి పాశ్వాన్ దంపతులు ఒకేసారి తమ నలుగురు కుమార్తెలను కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వారి ఇల్లాలు, బంధువుల రోదనలు స్థానికులను కన్నీటిపర్యంతం చేస్తున్నాయి. మృతుల సోదరుడు సాగర్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, “ఇంట్లో పూజ ఉండటంతో అక్కాచెల్లెళ్లు నదికి వెళ్లారు. ఒకరు మునిగిపోతుంటే కాపాడబోయి మిగతావాళ్లు కూడా లోపలికి వెళ్లిపోయారు. ఎవరో ఒకరు వారిని కాపాడకపోతారా అని ఆశపడ్డాం, కానీ అంతా శూన్యమైంది” అంటూ కన్నీరుమున్నీరయ్యాడు.

ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించింది. జిల్లా మేజిస్ట్రేట్ తక్షణ ఆదేశాల మేరకు ఎన్‌డిఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డిఆర్‌ఎఫ్ (SDRF) ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లతో పాటు స్థానిక గజ ఈతగాళ్లను ఘటనా స్థలానికి రప్పించారు. గల్లంతైన ఐదుగురు బాలికల ఆచూకీ కోసం నదిలో భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ప్రస్తుతం నదిలో నీటిమట్టం ఎక్కువగా ఉండటం, ప్రవాహం వేగంగా సాగుతుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు ఆడపిల్లలు ఇలా జలసమాధి కావడం యావత్ ముంగేర్ జిల్లాను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us