బీహార్ కా రాజ్ కౌన్ బనేగా..!
బీహార్‌కు యంగ్ డైనమైట్ ముఖ్యమంత్రి కాబోతున్నారా? లేక మిస్టర్‌క్లీన్ తన పట్టు నిలబెట్టుకుంటారా? మరికొద్దిగంటల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి.

బీహార్‌కు యంగ్ డైనమైట్ ముఖ్యమంత్రి కాబోతున్నారా? లేక మిస్టర్‌క్లీన్ తన పట్టు నిలబెట్టుకుంటారా? మరికొద్దిగంటల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఒకవైపు మహాకూటమి అప్పుడే కేబినెట్ కూర్పుమీద లెక్కలు వేస్తుంటే, ఏదో మ్యాజిక్ తమను గెలిపిస్తుందని ఎన్డీయే ఆశపడుతోంది. ఎవరి ఆశలు నెరవేరతాయి? ఎవరి అంచనాలు నిజం అవుతాయి? బీహార్ ప్రజల ఆశీర్వాదం ఎవరికి?
గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయేకు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిష్టాత్మకంగా మారాయి. మోదీ మీద కత్తులు నూరుతున్న విపక్షాలకు బీహార్ విజయం ఛాతీ ఉప్పొంగేలా చేస్తుంది. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీ కోసం మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మంగళవారం.. అంటే 10వ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు కౌంటర్ ప్రారంభం కాబోతోంది. రెండుగంటల్లో బీహార్‌కా బాద్షా ఎవర్నది తేలిపోతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి. బీహార్‌లో 38 జిల్లాలోని 55 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 3558 అభ్యర్థుల భవితవ్యం తేలబోతోంది.
కరోనా ఉన్నప్పటికీ బీహార్‌లో ఓటింగ్ శాతం పెరిగింది. 2015లో బీహార్‌లో 56.66 శాతం పోలిగ్ నమోదైతే, ఈసారి 57.05 శాతం రికార్డయింది. ఈసారి మహాకూటమివైపే మొగ్గు ఉన్నట్లు ఎగ్జిట్‌పోల్స్ చెప్పాయి. ఎన్డీయే తరపున ప్రచారం చేసిన ప్రధాని మోదీ.. లాలూ జమానానాటి అవినీతిని ప్రతిసభలో గుర్తుచేశారు. మహాకూటమి గెలిస్తే జంగిల్ రాజ్ వస్తుందంటూ ప్రచారం చేశారు.
మరోవైపు, బీహార్ వాసులకు తేజస్వి యాదవ్ కొత్త ఆశలు కల్పించారు. భవిష్యత్ కోసం భరోసా మంత్రం జపించారు. అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలపై తొలి సంతకం అంటూ చేసిన ప్రచారం బాణంలా దూసుకుపోయింది. కానీ తాము గెలిస్తే 19 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ హామీ పెద్దగా చర్చకు రాలేదు. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డుల మీద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని ఆర్జేడీ ప్రకటించింది. ముఖ్యంగా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యారు తేజస్వి. అందుకే ఈ యంగ్ చాప్‌ను చూడటానికి జనం పెద్దఎత్తున ఆయన సభలకు వచ్చారు.
ఆర్జేడీ అంటే గుర్తుకువచ్చేది లాలూప్రసాద్ యాదవ్. ఆయన భార్య రబ్రీ దేవి. వారిద్దరి మగపిల్లల్లో ఒకరైన తేజస్వి యాదవ్ పెద్ద పాపులర్ ఫేస్ కాదు. పైగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో ఆర్జేడీకి ఒక్కసీటు రాలేదు. లాలూ కొడుకు నాయకత్వ లక్షణాలపై విమర్శలు వచ్చాయి. బీమార్లోని 40 లోక్‌సభ సీట్లలో ఎన్డీయే 39, కాంగ్రెస్ ఒకటి గెల్చుకున్నాయి. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుపు తమదేనని ఎన్డీయే ధీమాతో ఉంది. కానీ సీన్ మారిపోయింది. చాలావేగంగా మారిపోయి ఆర్జేడీ, కాంగ్రెస్‌కు అనుకూలంగా తయారైంది.
ఈ పరిస్థితుల్లో మోదీ జంగిల్ రాజ్ నినాదం ఎక్కువగా నానలేదనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే బీహార్ అనేది యువరాష్ట్రం. యువత ఎక్కువగా ఉన్న రాష్ట్రం. అవకాశాల కోసం, ఉపాథి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న రాష్ట్రం. బీహార్లో సుమారు 50 శాతం ఓటర్ల వయసు 18 నుంచి 39 మధ్య ఉంది. ఉదాహరణకు 18 నుంచి 19 ఏళ్ల వయసున్నవారు ఏడు లక్షల 140 మంది. వీళ్లందరికి 1990 నుంచి 1997 వరకున్న లాలూ జంగిల్ రాజ్ అంటే ఏంటో తెలియదు. బీహార్ దాణాస్కామ్ గురించి పెద్దగా ఐడియా లేదు. అందుకే మోదీ జంగిల్ రాజ్‌కు పెద్దగా స్పందన లేదని అంటున్నారు.
బీహార్‌లో మహాకూటమికి విజయం తథ్యమని పలు సర్వేలు చెప్పాయి. ఈ పరిస్థితుల్లో మహాకూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రిగా లాలూ కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ ప్రమాణస్వీకారం చేయడం తథ్యం. ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు, అంటే సోమవారం తేజస్వి 31వ పుట్టినరోజు జరుపుకున్నారు. కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా బర్త్‌డే బోయ్ ఎంజాయ్ చేశారు. తేజస్వి అభిమానులు బర్త్‌డే విషెస్ తెలుపుతూ పాట్నా అంతటా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఇక, ఈ పరిస్థితుల్లో బీహార్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. లాలూప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన 30 ఏళ్లకు.. ఆయన కొడుకు 31 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అవుతారని బీహార్ కోడై కూస్తోంది.