AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాలే టార్గెట్‌గా నకిలీ నోట్ల దందా.. బెంగళూరులో బయటపడ్డ భారీ ముఠా గుట్టు!

బెంగుళూరులో తెలుగు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్న భారీ నకిలీ నోట్ల దందాను చామరాజ్‌పేట పోలీసులు భగ్నం చేశారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్టు చేసి రూ.21.68 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లు, 17 ప్రింటింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని కృష్ణగిరిలో ప్రింటింగ్ కేంద్రాన్ని గుర్తించారు. ఈ ముఠా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకూ విస్తరించినట్లు దర్యాప్తులో తేలింది.

తెలుగు రాష్ట్రాలే టార్గెట్‌గా నకిలీ నోట్ల దందా..  బెంగళూరులో బయటపడ్డ భారీ ముఠా గుట్టు!
Inter State Fake Currency Racket
Balaraju Goud
|

Updated on: Oct 02, 2026 | 1:50 PM

Share

బెంగళూరు నగరంలో నకిలీ కరెన్సీని ముద్రించి చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును చామరాజ్‌పేట పోలీసులు బయటపెట్టారు. మైసూరు రోడ్డు ఫ్లైఓవర్‌ సమీపంలో చేపట్టిన తనిఖీలతో మొదలైన దర్యాప్తు తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతం వరకు సాగింది. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. నకిలీ నోట్లు, ప్రింటింగ్‌ యంత్రాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మైసూరు రోడ్డు ఫ్లైఓవర్‌ సమీపంలోని ఓ పెట్రోల్‌ పంపు వద్ద అనుమానాస్పదంగా ఉన్న కారును పోలీసులు తనిఖీ చేశారు. అందులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని సోదాలు నిర్వహించగా.. రూ.500 నోట్ల విలువ కలిగిన 4,337 నకిలీ కరెన్సీ నోట్లు లభించాయి. వీటి విలువ సుమారు రూ.21.68 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

నిందితులను విచారించిన అనంతరం నకిలీ నోట్ల తయారీకి సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. అందిన సమాచారంతో తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతంలో అనుమానిత ప్రింటింగ్‌ కేంద్రంపై దాడులు నిర్వహించారు. అక్కడ 17 ప్రింటింగ్‌ యంత్రాలు, కరెన్సీ ముద్రణకు ఉపయోగించినట్లు భావిస్తున్న కాగితాలు, నోట్‌ స్ట్రిప్‌లతో పాటు సుమారు రూ.6 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ నెట్‌వర్క్‌ తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలకు కూడా విస్తరించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. కేసులో సత్యం, మురుగేశ్‌, గోవిందన్‌, బర్కత్‌, శరవణన్‌, లక్ష్మణ్‌, కృష్ణ అనే ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి ఒక కారు, 8 మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో ఇంకా నలుగురు అనుమానితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది. నకిలీ కరెన్సీ తయారీ, సరఫరా వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌, ఇతర ప్రాంతాల్లో వారి కార్యకలాపాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెస్ట్రన్‌ డివిజన్‌ డీసీపీ యతీష్‌ ఎన్‌. వెల్లడించారు. చామరాజ్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us