అయోధ్యలో శ్రీరామచంద్రుడి ఆలయ నిర్మాణం షురూ
విశ్వవ్యాప్తంగా హిందువులు వేచి చూస్తున్న తరుణం.. రానే వచ్చింది.. శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలో బృహత్తర రామాలయానికి భూమిపూజ క్రతువు మొదలైంది. వేద పఠనం, మంత్రోచ్చారణల నడుమ ప్రధాని మోదీ స్వయంగా.. గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించి.. ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నారు. భూమిపూజకు ముందస్తుగా సోమవారం నుంచే పూజాదికాలు మొదలయ్యాయి.
విశ్వవ్యాప్తంగా హిందువులు వేచి చూస్తున్న తరుణం.. రానే వచ్చింది.. శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలో బృహత్తర రామాలయానికి భూమిపూజ క్రతువు మొదలైంది. వేద పఠనం, మంత్రోచ్చారణల నడుమ ప్రధాని మోదీ స్వయంగా.. గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించి.. ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్నారు. భూమిపూజకు ముందస్తుగా సోమవారం నుంచే పూజాదికాలు మొదలయ్యాయి. మూడ్రోజులపాటు సాగే ఈ మహోత్సవం బుధవారం నాడు భూమిపూజతో పరిసమాప్తం కానుంది. అనంతరం రూ.300 కోట్లతో తలపెట్టిన ఆలయ నిర్మాణ మహాయజ్ఞం మొదలుకానుంది.
సరయూ నది ఒడ్డున కోసల రాజ్య రాజధాని అయోధ్య నగరం వెలిసింది. త్రేతాయుగం నుంచి ఇది శ్రీరామచంద్రుడి జన్మస్థానంగా హిందువుల ప్రగాఢ విశ్వాసం. అయితే, మొగల్ చక్రవర్తి బాబర్ హయాంలో అతడి సేనాపతి మీర్ బాకీ 1528లో ఇక్కడి ఆలయాన్ని ద్వంసం చేసి.. బాబ్రీ మసీదు నిర్మించాడని కొందరు చరిత్రకారులు చెబుతారు. అనాటి నుంచే అక్కడ రామాలయ పునర్నిర్మాణానికి డిమాండ్ మొదలైంది. 1855లో ఆలయ నిర్మాణం కోసం ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. నాటి నుంచి క్రమక్రమంగా హిందువుల గళం పెరుగుతూ వచ్చింది. దాదాపుగా 70 ఏళ్లు కోర్టుల్లో నలిగిన ఈ కేసుకు గతేడాది తెరపడింది. వివాదాస్పద స్థలం హిందువులకే కట్టబెడుతూ 2019, నవంబరు 9వ తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. తదనుగుణంగా ఆలయ నిర్మాణం పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మొత్తం 67 ఎకరాలను ఆలయ ట్రస్ట్ కు అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా 10 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం జరుగుతుంది. మిగిలిన 57 ఎకరాల్లో ఆలయ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. రామ మందిర నిర్మాణ ప్లాన్‌కు ఇప్పటికే శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ట్రస్టు సభ్యులు ప్రస్తుతం రామ మందిర నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 3 అంతస్థుల్లో నిర్మించనున్నారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండో అంతస్థులు ఉంటాయి. ఇక ఆలయ కాంప్లెక్స్‌లో ఓ నక్షత్ర వాటికను కూడా నిర్మించనున్నారు. ఇందులో మొత్తం 27 నక్షత్ర వృక్షాలను నాటుతారు. ఇక వాల్మీకి రామాయణంలో తెలిపిన అనేక వృక్షాలను ఆలయ కాంప్లెక్స్‌లో నాటుతారు. ఆ చెట్లు ఉండే ప్రాంతానికి వాల్మీకి రామాయణ అని పేరు పెట్టనున్నారు. దీని వల్ల భక్తులు తమ జన్మదినాల్లో వృక్షాల కింద కూర్చుని ధ్యానం, పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. రామ మందిరానికి 15 అడుగుల లోతున పునాదులు తీయనున్నారు. మొత్తం 8 పొరల్లో పునాదులు ఉండనున్నాయి. ఒక్కో పొర వెడల్పు సుమారుగా 2 అడుగులు ఉంటుంది. పూర్తిగా కాంక్రీట్‌ను ఉపయోగించి పునాదులు నిర్మించనున్నారు. ఆలయ నిర్మాణంలో ఇనుమును వాడడం లేదు.
భూమి పూజ అనంతరం ఆలయ స్థలంలో శేషావతార ఆలయాన్ని తాత్కాలికంగా నిర్మిస్తారు. రామ మందిరం పూర్తిగా నిర్మాణం కాగానే శేషావతార ఆలయాన్ని కూడా శాశ్వతంగా నిర్మిస్తారు. ఆలయ ప్రాంగణంలో రామకథ కుంజ్ పార్క్‌ను నిర్మించనున్నారు. శ్రీరాముడి జీవితంలోని పలు ముఖ్యమైన ఘట్టాల థీమ్‌తో ఆ పార్కును నిర్మిస్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలో మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఆలయ స్థలం తవ్వకాల్లో బయటపడిన పలు వస్తువులను ఆ మ్యూజియంలో పొందుపర్చనున్నారు. భవిష్యత్ తరాలకు రాముడి విశిష్టతను తెలియపరిచేలా రూపుదిద్దనున్నారు. అలాగే గోశాల, ధర్మశాల, ఇతర చిన్న చిన్న ఆలయాలను కూడా ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్నారు.
అయోధ్య రామ మందిరం ఎత్తు 161 అడుగులు, పొడవు 300 అడుగులు, వెడల్పు 268-280 అడుగులకు ఉండనుంది. మొత్తం ఆలయంలో 360 స్తంభాలు అమర్చాలని నిర్ణయించారు. ఆగస్టు 5వ తేదీన ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన రోజున దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు సాయంత్రం తమ వాకిళ్ల ఎదుట దీపాలను వెలిగించాలని ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చింది. కాగా భూమి పూజకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. మరో 250 మంది ముఖ్యమైన నేతలు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిసింది. అమెరికా, కెనడా, కరేబియన్ దీవులు సహా పలు విదేశాల్లోని భారతీయులు వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని తిలకించనున్నారు. అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలను శంకుస్థాపనకు ఆహ్వానించారు. రామజన్మభూమి ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లిన బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొననున్నారు.