బస్సు హైజాక్.. బందీలుగా ఉన్న 20 మంది ప్రయాణికులు..!
ఉక్రెయిన్‌లో ఓ దుండగుడు ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును హైజాక్ చేశాడు. ఉక్రెయిన్‌లోని వాయివ్య పట్టణంలోని లట్స్క్ నగరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బస్సులో దుండుగుడు 20 మందిని బందీలుగా..

ఉక్రెయిన్‌లో ఓ దుండగుడు ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును హైజాక్ చేశాడు. ఉక్రెయిన్‌లోని వాయివ్య పట్టణంలోని లట్స్క్ నగరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బస్సులో దుండుగుడు 20 మందిని బందీలుగా చేసుకున్నాడు. ఆ తర్వాత బస్సును ఓ థియేటర్ సమీపంలో పార్క్ చేయించాడని స్థానిక పోలీసులు తెలిపారు. అందులో ఉన్న వారందరినీ ప్రస్తుతం బందీలుగా ఉంచుకున్నాడన్నారు. హైజాక్‌కు పాల్పడిన దుండగుడి వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్ధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, హైజాక్ అయిన బస్సును ఇప్పటికే గుర్తించారు పోలీసులు. దుండగుడి చెరనుంచి.. బందీలుగా ఉన్న ప్రయాణికులను రక్షించేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపడుతున్నారు. బస్సును పార్కింగ్ చేసిన స్థలం సమీప ప్రాంతాల్లో ఉన్న వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఇదిలావుంటే దుండుగుడితో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నారు. అతడి డిమాండ్లు ఏమిటో స్పష్టంగా తెలియడం లేదని.. వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడన్న సంగతి తెలిసిందని.. అది కూడా దుండుగుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడన్నారు. సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు పెట్టడంతో.. చర్చలు ముందుకు సాగడం లేదని.. అయితే ఫోన్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యవస్థపై అసంతృప్తి అంటున్నాడు కానీ.. ఏ వ్యవస్థ అన్నది మాత్రం స్ప్టష్టంగా చెప్పడం లేదని పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు స్పెషల్ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు.