Fact Check: పండుగ తర్వాత భారీ విద్యుత్ కోతలంటూ ఏపీలో ప్రచారం.. ఇందన శాఖ క్లారిటీ
సోషల్ మీడియాలో జరుగుతోన్న దుష్ప్రచారం ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. పదే, పదే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సోషల్ మీడియాలో జరుగుతోన్న దుష్ప్రచారం ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. పదే, పదే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్నామధ్య దుర్గ గుడికి వైసీపీ పార్టీ జెండా రంగులతో లైటింగ్ పెట్టారంటూ విసృతంగా ప్రచారం చేశారు. దీంతో ప్రభుత్వం అధికారికంగా అవి రూమర్స్ అంటూ ఆధారాలతో సహా ప్రకటన చేసింది. తాజాగా దసరా తర్వాత రాష్ట్రంలో భారీగా కరెంట్ కోతలు ఉంటాయని దుష్ప్రచారం జరుగుతూ ఉండటంతో ఇంధనశాఖ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. లోడ్ రిలీఫ్ పేరుతో గంటలకొద్దీ కోతలనేవి రూమర్స్ మాత్రమే అని స్పష్టం చేసింది.
బొగ్గు నిల్వ, సరఫరా అంశాలు… విద్యుదుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఇంధనశాఖ తెలిపింది. ఇంతటి సంక్షోభ సమయంలోనూ.. వినియోగదారులకు నాణ్యమైన సరఫరా, కరెంటు ఇచ్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయని వెల్లడించింది. రాష్ట్రంలోని డిస్కమ్‌లు ఎలాంటి సమస్యలు లేకుండా విద్యుత్‌ను అందిస్తున్నాయని ప్రకటించింది. సంక్షోభాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా సీఎం ఆదేశాల మేరకు అత్యవసర ప్రణాళికల అమలును ప్రారంభించినట్లు ప్రకటించింది. బొగ్గు కొనుగోలు నిమిత్తం.. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీజెన్కోకు అత్యవసరంగా సర్కార్ రూ.250 కోట్లు నిధులు కేటాయించినట్టు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లను కేటాయించారని తెలిపింది. దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడవున్నా కొనుగోలు చేయాలని ఏపీ జెన్‌కోను ఆదేశించినట్లు ప్రకటనలో వెల్లడించింది. ఎక్చేంజ్ మార్కెట్ నుంచి రాష్ట్ర అవసరాల నిమిత్తం ఎంత ధర ఉన్నప్పటికీ కొనుగోలు చేయాల్సిందిగా విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించామని ఇంధన శాఖ వివరించింది.
కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి ఎవరికి కేటాయించని విద్యుత్ వాటాను ఆంధ్రాకు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాసినట్టు ఇంధనశాఖ వెల్లడించింది. వచ్చే సంవత్సరం జూన్ వరకు ఏపీ కోసం దాదాపు 400 మెగావాట్లను చౌక ధరకే కేటాయించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖను కోరినట్లు తెలిపింది. బకాయిలతో సంబంధం లేకుండా కొరతతో వున్న విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చెయ్యాలన్న కేంద్ర మార్గ దర్శకాలకు అనుగుణంగా రాష్ట్రానికి సరఫరా చేసే అన్ని బొగ్గు ఉత్పత్తి సంస్థలతో సంప్రదించామని వెల్లడించింది. పొరుగు రాష్ట్రంలో ఉన్న సింగరేణి సంస్థతోను బొగ్గు సరఫరా కోసం నిరంతర సంప్రదింపులు జరుగుతున్నట్టు ప్రకటనలో పేర్కొంది.
కోల్ సమస్య వలనే విద్యుత్ సమస్య ఏర్పడిందని.. అన్ని రాష్ట్రల్లో ఇదే సమస్య ఉందని మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఎంత ఖర్చు చేసైనా విద్యుత్ కొనుగోలు చేసి ..ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తామన్నారు. విద్యుత్ సమస్య విషయంలో ప్రభుత్వ పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన.. రాబోయే 3 రోజులు ఇలా