AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వాళ్లను ఏం చేయలేకపోతుందట.. !

కరోనా వైరస్ వయసుతో సంబంధం లేకుండా కాటేస్తోంది. ఈ వైరస్‌ యువతకు ఎక్కువగా సోకుతోంది. అయితే ఈ మహమ్మారిని యువత సమర్థంగా ఎదుర్కొంటోందని ఓ అధ్యయనంలో తేలింది. పాజిటివ్‌ వచ్చినా స్వల్ప కాలంలోనే కోలుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతున్నట్లు వెల్లడైంది.

కరోనా వాళ్లను ఏం చేయలేకపోతుందట.. !
Balaraju Goud
|

Updated on: Jul 30, 2020 | 3:57 AM

Share

కరోనా వైరస్ భారతదేశాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి చాపకింద నీరులా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. కరోనావైరస్ మన దేశంలో నెమ్మదిగానే మొదలై.. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా విస్తరిస్తోంది. అయితే, మొదటి కేసు నమోదైన ఆరు నెలలకు అత్యధిక కేసుల సంఖ్యలో రష్యా, బ్రెజిల్ దాటేసి ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకుంది. ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా ఉన్న భారతదేశం.. గ్లోబల్ హాట్‌స్పాట్ అవుతుందనేది మొదటి నుంచీ వైద్య నిపుణులు హెచ్చరిస్తునే ఉన్నారు.

దేశంలో కేసులకు సంబంధించి అధికారిక సంఖ్య అధికంగానే ఉంది. కానీ తలసరిగా చూస్తే అది చాలా తక్కువగా ఉంది. కేసుల సంఖ్యలో భారతదేశంలో తలసరి సగటు కన్నా ప్రపంచ సగటు మూడు రెట్లు అధికంగా ఉందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దేశంలో కరోనావైరస్ సోకుతున్న వారి కన్నా, చనిపోతున్న వారి కన్నా ఎక్కువ మంది కోలుకుంటున్నట్లు ప్రభుత్వ లెక్కలు సూచిస్తున్నాయి. దేశంలో మరణాల రేటు కన్నా రికవరీ రేటు వేగంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరణాల రేటు రెట్టింపు అవటాన్ని పరిశీలించాలని డాక్టర్ జమీల్ పేర్కొన్నారు. దేశంలో కరోనా మరణాల రేటు రెట్టింపు అవటానికి ప్రస్తుతం 26 రోజులు పడుతోంది. ఒకవేళ ఈ రోజుల సంఖ్య తగ్గితే ఆస్పత్రుల మీద ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల మరణాలు పెరిగే అవకాశమూ ఉంది.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. కరోనావైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న దేశాలతో పోల్చినపుడు భారతదేశంలో.. కోలుకుంటున్న రేటు పెరుగుతోంది. అంటే అమెరికా, బ్రెజిల్ దేశాల్లో రోగుల కన్నా భారతదేశంలో కోవిడ్ రోగులు వేగంగా కోలుకుంటున్నారని అర్థమవుతోంది. అమెరికాలో 27 శాతంగా ఉంటే.. భారతదేశంలో దానికన్నా చాలా అధికంగా 60 శాతంగా ఉంది.

అయితే, కరోనా వైరస్ వయసుతో సంబంధం లేకుండా కాటేస్తోంది. ఈ వైరస్‌ యువతకు ఎక్కువగా సోకుతోంది. అయితే ఈ మహమ్మారిని యువత సమర్థంగా ఎదుర్కొంటోందని ఓ అధ్యయనంలో తేలింది. పాజిటివ్‌ వచ్చినా స్వల్ప కాలంలోనే కోలుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతున్నట్లు వెల్లడైంది. వారిలో వ్యాధి నిరోధక శక్తే వారిని కరోనా నుంచి కాపాడుతోందని వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేసి చివరి నిమిషంలో ఆస్పత్రులకు వస్తే తప్ప మిగతా వాళ్లందరూ 10 రోజుల్లోపే ఆరోగ్యవంతులవుతున్నారని అంటున్నారు.

మరోవైపు, 50 ఏళ్లకు పైన ఉన్నవారికే కోలుకోవడానికి 14 రోజుల సమయం పడుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. మొత్తం పాజిటివ్‌ కేసులను పరిశీలిస్తే.. త్వరగా కోలుకుంటున్నవారు, హోం ఐసొలేషన్‌లో ఉంటున్నవారిలో ఎక్కువ మంది 40 ఏళ్ల లోపువారే ఉన్నట్టు స్పష్టమైంది. దీర్ఘకాలిక జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు కోలుకోవడం కొంత సమయం పడుతోందని నిపుణులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో నమోదైన కేసుల సంఖ్యను చూస్తే యాక్టివ్‌ కేసుల్లో 57.22 శాతం 40 ఏళ్ల లోపు వారివే ఎక్కువ. ఇందులో రికవరీ అయినవారు 60 శాతం మంది యువతే ఉండటం గమనార్హం. నిలకడగా ఆరోగ్యంగా ఉన్నవారిలో 47 శాతం మంది 40 ఏళ్ల లోపు వారే. ఇక, పాజిటివ్‌ కేసుల్లో 4.11 శాతం మంది 10 ఏళ్ల లోపు వాళ్లు ఉన్నట్లు వైద్యులు వివరించారు. పాజిటివ్‌ కేసుల్లో 91 ఏళ్లు దాటినవారు 0.04 శాతం మంది ఉన్నారని వారు తెలిపారు.

కరోనా బాధితుల్లో 50–60 ఏళ్ల మధ్య వయస్కువారు ఎక్కువగా మృతి చెందుతున్నారు. వీరిలో మధుమేహం, హైపర్‌ టెన్షన్‌ బాధితులే ఎక్కువ. ఇలాంటి వారికి వైరస్‌ రాకుండా కాపాడుకోవాలి. వీరిపై కుటుంబ సభ్యులు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు అప్రమత్తంగా ఉంటే యువతను కరోనా ఏమీ చేయలేదని వైద్యులు చెబుతున్నారు.