ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి అమూల్ కార్యక్రమాలు.. జెండా ఊపి ప్రారంభించనున్న సీఎం జగన్..
పాల సేకరణలో నవ శకానికి నాది పలికింది ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా ఎంతో పేరు గాంచిన అమూల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో..
పాల సేకరణలో నవ శకానికి నాది పలికింది ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా ఎంతో పేరు గాంచిన అమూల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమూల్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. దీనికి ముందు వర్చువల్ ద్వారా అమూల్ స్టాళ్లు, బల్క్ మిల్క్, కూలింగ్ యూనిట్లను ముఖ్యమంత్రి జగన్ పరిశీలించనున్నారు. ఆ తరువాత జెండా ఊపి అమూల్ పాల ట్యాంకర్‌ను ప్రారంభిస్తారు. కాగా, అమూల్ సంస్థ తొలుత ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల నుండి పాలను సేకరించనుంది. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పాల సేకరణను చేపట్టనుంది.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో రూ.6,551 కోట్ల వ్యయంతో 9,899 గ్రామాల్లో ఆటోమేటెడ్ పాలసేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లోని 400 గ్రామాలలో నేడు పాల సేకరణ జరుపుతారు.
ఇదిలాఉండగా, ఇదే రోజు వైఎస్సార్ చేయూత, ఆసరా పథకం కింద రాష్ట్ర మహిళలకు పశువుల యూనిట్లను సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పశువుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఎన్నికల సమయంలో పశుపోషకులకు ఇచ్చిన హామీని అమలు పరచడంలో భాగంగా పాల సేకరణ, మార్కెటింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చున్న విషయం తెలిసిందే. ఈనెల 5వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు లక్ష యూనిట్లు, అలాగే వచ్చే ఏడాది ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరిల మధ్య 3.64 లక్షల పాడి పశువుల యూనిట్లను దశలవారీగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.