‘ మాస్టర్ షెఫ్ ‘ రియాల్టీ షో లోనూ విన్ అవుతాడా ఈ నోబెల్ గ్రహీత ?
ఆర్ధిక శాస్త్రంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన భారత ఆర్ధిక దిగ్గజం అభిజిత్ వినాయక్ బెనర్జీ.. ఇండియా వంటి వర్ధమాన దేశాలను పీడిస్తున్న పేదరికంపై పోరుకు ఒక విధంగా పోరాటానికే నాంది పలికారు. అభిజిత్, ఆయన భార్యఎస్తేర్ డుఫ్లోతో బాటు మరో ఎకనమిస్ట్ మైఖేల్ క్రెమర్ నూ 2019 సంవత్సరానికి నోబెల్ అవార్డుకు సంయుక్తంగా ఎంపిక చేసినట్టు స్వీడిష్ రాయల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కసారి అభిజిత్ గతంలోకి తొంగి చూస్తే.. ముంబైలో […]
ఆర్ధిక శాస్త్రంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన భారత ఆర్ధిక దిగ్గజం అభిజిత్ వినాయక్ బెనర్జీ.. ఇండియా వంటి వర్ధమాన దేశాలను పీడిస్తున్న పేదరికంపై పోరుకు ఒక విధంగా పోరాటానికే నాంది పలికారు. అభిజిత్, ఆయన భార్యఎస్తేర్ డుఫ్లోతో బాటు మరో ఎకనమిస్ట్ మైఖేల్ క్రెమర్ నూ 2019 సంవత్సరానికి నోబెల్ అవార్డుకు సంయుక్తంగా ఎంపిక చేసినట్టు స్వీడిష్ రాయల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కసారి అభిజిత్ గతంలోకి తొంగి చూస్తే.. ముంబైలో 1961 ఫిబ్రవరి 21 న పుట్టిన ఈయన లైఫ్ కెరీర్ అంతా పూర్తిగా ఎడ్యుకేషన్ కే అంకితమైంది. మహారాష్ట్రకు చెందిన నిర్మల, బెంగాలీ అయిన దీపక్ బెనర్జీ దంపతులకు ఆయన జన్మించారు. ఈయన కుటుంబం ఆ తరువాత కోల్ కతాకు షిఫ్ట్ అయింది. ఆ నగరంలోని సౌత్ పాయింట్ స్కూల్, ప్రెసిడెన్సీ కాలేజీలో చదివిన అభిజిత్ జేఎన్ యు లో మాస్టర్స్, హార్వర్డ్ లో పీ హెచ్ డీ సాధించారు. ప్రిన్స్ టన్ లో నాలుగేళ్లు, హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక ఏడాది ప్రొఫెసర్ గా ఉన్నారు. 1993 నుంచి ఎం ఐ టీ లో అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఇదే సంస్థలో ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా అభిజిత్ వ్యవహరిస్తున్నారు.
ఒక్కసారి ఆయన వ్యక్తిగత జీవితం కూడా చూద్దాం.. అభిజిత్ మంచి కుక్ అట కూడా.. (ఈ విషయం ఎవరికీ తెలియకున్నా ఆయన సోదరుడు తొందరపడి చెప్పేశారు). ‘ మాస్టర్ షెఫ్ ‘ అనే రియాల్టీ షో లో తన సోదరుడు పాల్గొనాలని, అందులోనూ విన్నర్ కావడం ఖాయమని అభిజిత్ బ్రదర్ అనిరుద్ తెలిపారు. తన సోదరుడు ఎన్నో రకాల డిష్ లు తయారు చేయడంలో సిధ్ధహస్తుడని ఆయన చెప్పారు. ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ తరువాత ఈ శాస్త్రంలో ఎంతో పాపులర్ అయిన అభిజిత్ బెనర్జీ .. తనకు నోబెల్ బహుమతి వచ్చిందని తెలియగానే సోమవారం తెల్లవారు జామునే నిద్రకు ఉపక్రమించారట. ‘ నేనేమీ పొద్దున్నే లేచే వ్యక్తిని కానని, నా నిద్ర కంటిన్యూ చేయకపోతే అసలీ నిద్రా వ్యవస్థ పైనే దాడి చేసినట్టేనని ‘ ఆయన సరదాగా వ్యాఖ్యానించాడట. (అంటే తనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించినట్టు తెలిసినా ఆయన ఈ వార్తను ఎంత లైట్ గా తీసుకున్నారో అర్థమవుతోంది).
పేదరిక నిర్మూలనకు అభిజిత్ దంపతులు ఏకంగా ఓ ల్యాబ్ నే ఏర్పాటు చేయడం విశేషం. ప్రపంచంలో పేదరిక నిర్మూలనకు వీరు చూపిన క్షేత్ర స్థాయి ప్రయోగాల విధానాలు ఎకనామిక్ రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. భారత ఆర్ధిక వ్యవస్థ క్షీణిస్తోందని, ప్రస్తుత గణాంకాలను పరిశీలించిన అనంతరం సమీప భవిష్యత్తులో కోలుకుంటుందన్న నమ్మకం తనకు కలగడం లేదని అభిజిత్ కూడా ఈ దేశ ఎకానమీపై ‘ బాంబు ‘ పేల్చారు. గత ఐదేళ్లలో కొంతలో కొంత మేర ప్రగతిని చూసినా ఇప్పుడు ఆ విశ్వాసం పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పథకమైన ‘ న్యాయ్ ‘ కి అభిజిత్ సలహాదారుగా ఉన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ అధికారంలోకి వఛ్చిన పక్షంలో ఈ పథకం కింద వేసే కొత్త పన్నులతో నిధులు వచ్ఛేవని, దాంతో ఆర్ధిక లోటు తీరేదని ఆయన అభిప్రాయపడుతున్నారు.
ఆర్ధిక వృధ్ది రేటు ఆందోళనకరంగా ఉందని, తాము ఊహించిన విధానాలే పని చేస్తాయనే రీతిలో ప్రభుత్వం పాలసీలను రూపొందించరాదని అయన సూచిస్తున్నారు. జీఎస్టీ అమలులో లోపాలు ఉన్నాయని సాక్షాత్తూ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించిన నేపథ్యంలో అభిజిత్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. లోగడ మోదీ ప్రభుత్వం తెచ్చినడీమానిటైజేషన్ విధానాన్ని కూడా అభిజిత్ విమర్శించారు. దీని వెనుక లాజిక్ లేదని పేర్కొన్నారు. కాగా-ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ప్రముఖ పొలిటికల్ ఎకనామిస్ట్ కూడా అయిన పరకాల ప్రభాకర్ కూడా దేశ ఆర్ధిక మాంద్యాన్ని తన ఆర్టికల్ లో ప్రస్తావించిన నేపథ్యంలో..నోబెల్ బహుమతి గ్రహీత అయిన అభిజిత్ బెనర్జీ ‘ గళం ‘ కూడా ఆయనతో ఏకీభవించడం కొసమెరుపు.