GST Council: వ్యాపారులకు డబుల్ గుడ్‌న్యూస్.. జీఎస్టీలో కొత్త సంస్కరణలు.. ఎప్పటి నుంచంటే?
చిన్న తరహా వ్యాపారులు, పన్ను చెల్లింపు దారులకు ఇదో భారీ ఊరట కల్పించే వార్తనే చెప్పాలి.. అవును అక్టోబర్ 7వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే 57వ జీఎస్టీ (GST) కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలపై కేంద్ర కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అక్టోబర్ 7వ తేదీన 57వ జీఎస్టీ (GST) కౌన్సిల్ కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరటనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. పన్ను వ్యవస్థను మరింత సరళతరం చేయడంతో పాటు వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.
జీఎస్టీ ఉల్లంఘనలపై విధించే అరెస్టు నిబంధనలను పూర్తిగా రద్దు చేయాలన్న యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. వ్యాపారులపై అరెస్టు చర్యలను తొలగించి, ఇకపై కేవలం పన్ను వసూలు, జరిమానాలు మాత్రమే విధించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. అలాగే కేసుల నమోదు పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.1 కోటి నుంచి ఏకంగా రూ.5 కోట్లకు పెంచే అంశాన్ని కూడా జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తోన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, రూ.10,000 కంటే తక్కువ పన్ను వివాదాలపై ఇచ్చిన నోటీసులను రద్దు చేసి, దాదాపు 11.3 లక్షల కేసులను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
10 రోజుల్లోనే రీఫండ్
సప్లైయర్ తప్పు చేసినప్పటికీ, పన్ను చెల్లించిన కొనుగోలుదారుల ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌ను రద్దు చేయబోమని ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్, వాహనాల సర్వీసింగ్, టెలికామ్ టవర్లకు కూడా ఇకపై ఐటీసీ వర్తింపజేయనున్నారు. అలాగే రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేస్తూ, దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే రీఫండ్ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వనున్నారు. రిస్క్ అసెస్మెంట్ ద్వారా 90 శాతం క్లెయిమ్స్‌ను ఆటోమేటిక్‌గా విడుదల చేసే వెసులుబాటును తీసుకురానున్నారు.
చిన్న వ్యాపారులకు ఊరట
రూ.5 కోట్ల లోపు వార్షిక టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులకు త్రైమాసిక పన్ను చెల్లింపులతో పాటు ఐచ్ఛికంగా వార్షిక రిటర్న్ దాఖలు చేసే సౌలభ్యం కల్పించనున్నారు. అంతేకాకుండా లేట్ ఫీజ్ నుంచి కూడా మినహాయింపు ఇవ్వనున్నారు. చిన్న వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లోని వేర్‌హౌస్‌లను బిజినెస్ అడ్రస్‌గా వాడుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇకపై రోడ్లపై రవాణా వాహనాల తనిఖీలను ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేకండా.. పక్కా ఆధారాలు ఉండి, సీనియర్ అధికారుల అనుమతి ఉంటేనే తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. విదేశీ బ్రాంచ్‌ల ద్వారా జరిగే సర్వీసులు, ఎస్ఈజెడ్ (SEZ) సరఫరాలను ఇకపై ఎగుమతులుగానే పరిగణించే అవకాశం ఉంది.
ఆరోగ్య రంగానికి పన్ను మినహాయింపులు
ఆరోగ్య రంగానికి జీఎస్టీలో మరింత వెసులుబాటు కల్పించేందుకు కౌన్సిల్ నిర్ణయించింది. ఇందులో భాగంగా అరుదైన వ్యాధుల చికిత్స కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మరో 7 రకాల ఔషధాలపై పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ కీలక సంస్కరణలన్నింటికీ అక్టోబర్ 7న జరిగే భేటీలో అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
