AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మసకగా కనిపించే కళ్లు కూడా చురకత్తిలా మారుతాయ్.. దీని సీక్రెట్ తెలిస్తే అస్సలు వదలరు..

ఆకు కూరల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అలాంటి పచ్చని ఆకు కూరల్లో పొన్నగంటి ఆకు కూర ఒకటి.. దీనిలో ఎన్నో పోషకాలు.. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.. పొన్నగంటి ఆకుతో తయారుచేసే పచ్చడి రుచికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా కంటిచూపును మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. ఈ పచ్చడిని అన్నంతో పాటు టిఫిన్లలోకి కూడా తీసుకోవచ్చు.

మసకగా కనిపించే కళ్లు కూడా చురకత్తిలా మారుతాయ్.. దీని సీక్రెట్ తెలిస్తే అస్సలు వదలరు..
Traditional Ponnaganti Kura Pachadi
Shaik Madar Saheb
|

Updated on: Oct 05, 2026 | 1:21 PM

Share

పచ్చని ఆకు కూరల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అలాంటి మంచి పోషకాలున్న ఆకు కూరల్లో పొన్నగంటి ఆకుకూర ఒకటి.. పొన్నగంటి కూరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా.. విటమిన్ ఎ, సి, బి6, ఫోలేట్, రైబోఫ్లెవిన్ లాంటి వాటితోపాటు.. ఖనిజాలు ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, బీటా కెరోటిన్, డైటరీ ఫైబర్ లాంటివి పుష్కలంగా ఉంటాయి.. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో.. అలాగే.. రక్తహీనత నివారణలో సహాయపడతాయి.. అంతేకాకుండా.. జీర్ణ శక్తిని మెరుగుపర్చి.. మలబద్ధకాన్ని నివారిస్తుంది.. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్..

అయితే.. పొన్నగంటి ఆకుతో తయారుచేసే పచ్చడి అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాకుండా, కంటిచూపు మెరుగుదలకు సహాయపడుతుంది. ఈ సంప్రదాయ పచ్చడిని అన్నం, టిఫిన్లలోకి ఆస్వాదించవచ్చు. చాలా సులభంగా తయారుచేసుకోగలిగే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు: ఒక కట్ట పొన్నగంటి ఆకు, పావు స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ధనియాలు, పది ఎండుమిరపకాయలు, ఒకటిన్నర స్పూన్ నువ్వులు, అర స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, చింతపండు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఉల్లిపాయ, సరిపడా నూనె. పోపు కోసం పావు స్పూన్ చొప్పున శెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిరపకాయలు, కరివేపాకు, సరిపడా నూనె అవసరం.

ముందుగా పొన్నగంటి ఆకును కాడల నుండి వేరుచేసి శుభ్రంగా కడగాలి. ఈ కాడలను కుండీలో నాటితే మొక్క త్వరగా పెరుగుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పావు స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ధనియాలు, పది ఎండుమిరపకాయలు, ఒకటిన్నర స్పూన్ నువ్వులు వేసి మీడియం మంటపై దోరగా వేయించాలి. నువ్వులు వేయడం వల్ల పచ్చడికి ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి.

అదే పాన్‌లో మరోసారి నూనె వేసి శుభ్రం చేసిన పొన్నగంటి ఆకును వేసి వేయించాలి. ఆకుకూర త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ సమయం పట్టదు. పచ్చి వాసన పోయి, ఆకు మెత్తబడే వరకు వేయించి, స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.

మిక్సీ జార్‌లోని వేయించిన మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, నువ్వులతో పాటు అర స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, చింతపండు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేయాలి. చింతపండు కొద్దిగా ఎక్కువ వేస్తే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇప్పుడు చల్లారిన పొన్నగంటి ఆకును కూడా మిక్సీ జార్‌లోకి వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. ఈ పచ్చడిని రోట్లో రుబ్బితే మరింత రుచిగా ఉంటుంది. కొద్దిగా నీటిని చేర్చి, మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను వేసి ఇంకొకసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేస్తే పచ్చడికి మంచి రుచి వస్తుంది. ఉల్లిపాయ ఇష్టం లేనివారు దీనిని మినహాయించవచ్చు.

ఇప్పుడు పచ్చడికి పోపు సిద్ధం చేసుకోవాలి. ఒక చిన్న పాన్‌లో నూనె వేడి చేసి, నాలుగు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, పావు స్పూన్ శెనగపప్పు, పావు స్పూన్ మినపప్పు, పావు స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, రెండు ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. పప్పులు ఇష్టం లేకపోతే మినహాయించవచ్చు. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, సిద్ధం చేసుకున్న పచ్చడిలో కలిపితే రుచికరమైన పొన్నగంటి ఆకు పచ్చడి సిద్ధం.

ఈ పచ్చడి బయట రెండు రోజుల వరకు, ఫ్రిజ్‌లో పది రోజుల వరకు తాజాగా నిల్వ ఉంటుంది. అన్నంతో పాటు ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లలోకి కూడా ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ సులభమైన, ఆరోగ్యకరమైన పచ్చడిని వారంలో రెండుసార్లు తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అయితే.. ఏమైనా సమస్యలుంటే.. ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us