
సంధ్యా సమయంలో చెట్లపై చేతులు వేయకూడదని తరచూ మన పెద్దలు చెబుతూనే ఉంటారు. ఎందుకంటే.. సాయంత్రం వేళ పూలు, ఆకులు విశ్రాంతి తీసుకునే సమయం. కాబట్టి వాటిని కోయడం పాపమని హిందూ ధర్మం చెబుతోంది. సాయంత్రం పక్షులు, కీటకాలు గూళ్ళకి చేరుకుంటాయి. ఈ సమయంలో పూలు, ఆకులు కోయడం వల్ల చెట్లు కదిలి అవి కంగారు పడతాయి. వాటిని ఇబ్బంది పెట్టడం సరికాదు. మత విశ్వాసాల ప్రకారం సాయంత్రం వేళ దేవతలు చెట్లు, మొక్కలపై ఉంటారు. కాబట్టి వాటిని కోయడం అశుభమని పండితులు చెబుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత పూలు, ఆకులు కోస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్ముతారు. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయట.
హిందూ మతంలో ఉదయం దేవుడికి పూజ చేస్తారు. ఆ సమయంలో పూలు, పత్రి కోయడం శుభప్రదం. సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకపోవడానికి మరో కారణం ఏంటంటే, పూలు ఉదయం పూస్తాయి. రాత్రికి వాడిపోవటం ప్రారంభిస్తాయి. ఈ కారణంగా, వాటి సువాసన, అందం రెండూ రాత్రికి ముగుస్తాయి. దేవతలకు సువాసన, అందం లేని పూలను సమర్పించడం పూజా ఫలాలను ఇవ్వదని చెబుతారు.. కాబట్టి, రాత్రిపూట పూలు కోయటం సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు.. సాయంత్రం తర్వాత మొక్కలు కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయి. అది ఆరోగ్యానికి హానికరం. అందుకే వాటి దగ్గరకు వెళ్లకూడదని చెబుతారు. కాబట్టి రాత్రి పూట చెట్ల నుంచి పూలు, పండ్లు కోయకూడదు. అంతేకాదు..రాత్రిపూట చెట్ల దగ్గర పడుకోవద్దని కూడా చెబుతారు.. అలా చేస్తే మీకు నిద్రలో ఉండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..