అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు పవర్‌ఫుల్ వ్యక్తుల గురించి తెలుసా..?
భారతదేశంలో చట్టం ముందు అందరూ సమానులే.. సామాన్యుడి నుంచి ప్రధాని వరకు ఎవరైనా తప్పు చేస్తే అరెస్ట్ కావాల్సిందే. కానీ, మన రాజ్యాంగంలో ఒక వింతైన నిబంధన ఉంది. దేశంలోని ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయలేరు, కనీసం ఏ కోర్టు కూడా వారిపై విచారణ జరపలేదు. అసలు చట్టానికి కూడా లొంగని ఆ ఇద్దరు పవర్‌ఫుల్ వ్యక్తులు ఎవరు? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. చట్టం ముందు ఎవరూ అతీతులు కారు.. భారత ప్రజాస్వామ్యంలో మనం తరచుగా వినే మాట ఇది. కానీ మన రాజ్యాంగమే ఇద్దరు వ్యక్తులకు అత్యున్నత రక్షణ కల్పించింది. వారు పదవిలో ఉన్నంత కాలం పోలీసులు వారిని తాకలేరు, ఏ కోర్టు వారెంట్ జారీ చేయలేదు. ఇంతకీ ఆ ఇద్దరు ప్రభావవంతమైన వ్యక్తులు ఎవరు? వారికి మాత్రమే ఈ ప్రత్యేక వెసులుబాటు ఎందుకు? అసలు రాజ్యాంగం ఏం చెబుతోంది?
ఆ ఇద్దరు ఎవరు..?
భారత రాజ్యాంగం ప్రకారం దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి, రాష్ట్రాలకు రాజ్యాంగ అధిపతులుగా వ్యవహరించే గవర్నర్లు ఈ ప్రత్యేక రక్షణను పొందుతారు. వీరు పదవిలో ఉన్నంత కాలం ఎలాంటి క్రిమినల్ కేసులలోనూ అరెస్ట్ కావడం జరగదు.
రక్షణ కవచంలా ఆర్టికల్ 361
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 వీరికి ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. దీని ప్రకారం ఉన్న ప్రధాన మినహాయింపులు ఇవే..
కోర్టులకు జవాబుదారీ కాదు: రాష్ట్రపతి లేదా గవర్నర్ తమ అధికారిక విధుల్లో భాగంగా తీసుకున్న ఏ నిర్ణయానికైనా ఏ న్యాయస్థానానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు.
క్రిమినల్ కేసుల నుంచి విముక్తి: వారు పదవిలో ఉండగా ఏ కోర్టులోనూ వారిపై క్రిమినల్ విచారణ ప్రారంభించకూడదు. ఒకవేళ పదవిలోకి రాకముందు ఏదైనా కేసు ఉన్నా, పదవిలో ఉన్నంత కాలం దాన్ని కొనసాగించడానికి వీల్లేదు.
నో అరెస్ట్ వారెంట్: ఆర్టికల్ 361(3) ప్రకారం ఏ కోర్టు కూడా రాష్ట్రపతి లేదా గవర్నర్‌కు వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ లేదా జైలు శిక్ష ఉత్తర్వులను జారీ చేయలేవు.
ఈ ప్రత్యేక రక్షణ ఎందుకు..?
దేశానికి, రాష్ట్రానికి అత్యున్నత రాజ్యాంగ అధిపతులుగా వారు నిర్వహించే బాధ్యతలు అత్యంత కీలకమైనవి. రాజకీయ కక్షల వల్ల లేదా ఇతర కారణాల వల్ల వారిపై కేసులు పెట్టి, వారిని అరెస్ట్ చేస్తే.. ఆ పదవికి ఉండే గౌరవం మసకబారుతుంది. అంతేకాకుండా రాజ్యాంగ యంత్రాంగం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆ పదవుల హుందాతనాన్ని కాపాడటం కోసమే ఈ వెసులుబాటు కల్పించడం జరిగింది.
సివిల్ కేసుల పరిస్థితి ఏంటి..?
క్రిమినల్ కేసుల నుంచి పూర్తి రక్షణ ఉన్నప్పటికీ.. సివిల్ కేసుల విషయంలో మాత్రం నిబంధనలు కొంచెం భిన్నంగా ఉంటాయి. రాష్ట్రపతి లేదా గవర్నర్ వారి వ్యక్తిగత చర్యలకు సంబంధించి సివిల్ కేసులు దాఖలు చేయవచ్చు. కానీ కేసు వేయడానికి కనీసం రెండు నెలల ముందు వారికి లిఖితపూర్వక నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
జీవితాంతం ఈ రక్షణ ఉంటుందా..?
లేదు. ఈ ప్రత్యేక హక్కులు వారు పదవిలో ఉన్నంత కాలం మాత్రమే వర్తిస్తాయి. వారు పదవి నుంచి తప్పుకున్నాక లేదా పదవీకాలం ముగిశాక, వారు సాధారణ పౌరులుగానే పరిగణించడం జరుగుతుంది. ఆ తర్వాత వారిపై సాధారణ చట్టాల ప్రకారం విచారణ జరపవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేయవచ్చు.
ఇతర పదవుల పరిస్థితి ఏంటి..?
ప్రధాని, ముఖ్యమంత్రులు, ఎంపీలు లేదా ఎమ్మెల్యేలకు ఇటువంటి విస్తృతమైన రక్షణ ఉండదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు సివిల్ కేసుల్లో అరెస్ట్ కాకుండా ఎంపీలకు కొంత మినహాయింపు ఉన్నప్పటికీ, క్రిమినల్ కేసుల్లో ఏ ప్రజాప్రతినిధినైనా అరెస్ట్ చేసే అధికారం చట్టానికి ఉంటుంది.
