Success Story: ఇతనిని చూస్తే అయ్యో అనిపిస్తుంది.. అతను చేస్తున్న పని తెలిస్తే అదుర్స్ అని అభినందించకుండా ఉండలేరు..
కొందరిని చూస్తే అయ్యో అనిపిస్తుంది.. మరికొందరిని చూస్తే అబ్బో అని ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇప్పడు మీకు పరిచయం చేయబోతున్న వ్యక్తిని చూస్తే.. మొదటి ఫీలింగ్ కలుగుతుంది..
Success Story: కొందరిని చూస్తే అయ్యో అనిపిస్తుంది.. మరికొందరిని చూస్తే అబ్బో అని ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇప్పడు మీకు పరిచయం చేయబోతున్న వ్యక్తిని చూస్తే.. మొదటి ఫీలింగ్ కలుగుతుంది.. కానీ, అతని గురించి తెలిస్తే రెండో పదం మన నోటి నుంచి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎందుకో.. ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
మనం గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టిన తరవాత ఏమి చేస్తాం.. కొబ్బరి తినేసి చిప్పను ఎక్కడికో విసిరేస్తాం. కానీ..ఒడిశాకు చెందిన సబ్యసాచి పటేల్ కొబ్బరి చిప్పను చెత్తలో వేయకుండా అవసరమైన అందమైన వస్తువులను తయారు చేయడానికి సిద్ధం అయ్యాడు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అనేది ఎంత నిజమో చెప్పలేము. కానీ, తనకున్న సృజనాత్మకతకు పదును పెడితే విజయం కచ్చితంగా వస్తుంది అనే విషయం సబ్యసాచి విషయంలో రుజువు అయింది. ఇంతకీ సబ్యాసాచి ఏమి చేశాడో తెలుసా? అతని విజయగాథ వెనుక ఎటువంటి కథ ఉందొ తెలుసుకుందాం..
నిలబడటమే కష్టం.. కానీ..
సబ్యసాచి పటేల్ (29) ఒడిశాలోని బలంగీర్ జిల్లా పుయింటలా గ్రామానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి వికలాంగుడు. వెన్నుపాము సమస్య వల్ల ఎక్కువ సేపు నిలబడలేడు, సరిగ్గా నడవలేడు. చిన్నప్పటి నుండి, అతను కళల పట్ల, క్రాఫ్ట్ పట్ల చాలా ఆసక్తిని కలిగి ఉండేవాడు. అయితే, నేర్చుకునే అవకాశం రాలేదు. లాక్డౌన్ అతనికి మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఖాళీగా ఇంటిదగ్గర కూచున్న సమయంలో తనకున్న ఆసక్తిని ఆచరణలోకి తీసుకురావాలని అనుకున్నాడు. ఆ దిశలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. వెస్ట్ అని పక్కన పాదేసే కొబ్బరి చిప్పలతో అందమైన అలంకరణ వస్తువులను చేయడం మొదలు పెట్టాడు. వాటిని ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా అమ్మడం ప్రారంభించాడు. అంతే.. ఇప్పుడు అతనికి దేశవ్యాప్తంగా కొనుగోలు దారులు ఉన్నారు. ఒడిశా మొత్తం అతని వస్తువులంటే మక్కువ చూపిస్తుంది. దేశవ్యాప్తంగా వినియోగదారులు పెరగడంతో ఇప్పుడు సబ్యాసాచి పటేల్ కూచుని పనిచేస్తూ సంపాదిస్తున్నాడు.
ముందే చెప్పినట్టు సబ్యసాచి దివ్యాంగుడైనా..కళలంటే అమితమైన ప్రేమ. చిన్నప్పటి నుంచి కళలంటే చాలా ఆసక్తి. కానీ ఉద్యోగం, చదువుల వల్ల కళకు సమయం కేటాయించే అవకాశం రాలేదు. ఒక వైపు, కరోనా చాలా మందిని ఏడిపించింది. మరోవైపు చాలా మందికి తమను తాము కనుగొనడానికి.. అర్థం చేసుకోవడానికి.. మెరుగుపరచుకోవడానికి ఇది ఒక అవకాశంగా మారింది. కరోనా యుగంలోనే, సబ్యసాచి కొబ్బరి చిప్పలతో సృజనాత్మకంగా ఏదైనా చేయడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అతను విజయం సాధించాడు. అతను కొబ్బరి వ్యర్థాల పెంకుల నుంచి టీ కప్పులు, గాజులు, రథాలు, శివలింగాలు, స్కూటర్లు..ఓడలతో సహా 18-20 రకాల చేతితో తయారు చేసిన ఉత్పత్తులను తయారు చేస్తాడు. ఇందులో ఎలాంటి యంత్రాలు లేదా రసాయనాలు ఉపయోగించరు. సబ్యసాచి వర్క్ స్టార్ట్ చేసి 6నెలలే కావస్తున్నా ఇప్పుడు అతని ఉత్పత్తికి దేశవ్యాప్తంగా చాలా చోట్ల నుంచి డిమాండ్ వస్తోంది. శారీరక అసౌకర్యం, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కళనే తన వృత్తిగా చేసుకున్న సబ్యసాచి తన పనిని కూడా చాలా మంది ఇష్టపడుతున్నారని సంబరపడిపోతున్నాడు.
పిల్లల ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ఆలోచన..
తనకీ ఆలోచన ఎలా వచ్చింది అనే విషయంపై సబ్యసాచి ఏమి చెప్పాడో అతని మాటల్లోనే… ‘‘ఎప్పటి నుంచో కళలంటే మక్కువ ఎక్కువ. అంతకుముందు థర్మాకోల్, పండ్లు, కూరగాయలు చెక్కే పని చేశాను. లాక్‌డౌన్‌లో, నా మేనకోడలుకు సబ్బుపై చెక్కడం ద్వారా ఏదైనా కొత్తది సిద్ధం చేయాల్సిన ప్రాజెక్ట్‌ని ఆమె స్కూలు వారు ఇచ్చారు. తనకు సహాయం చేయడం కోసం ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు, కొబ్బరి చిప్పలపై ఇలా ఎందుకు చెక్కకూడదు అనే ఆలోచన వచ్చింది.”
యూ ట్యూబ్..
ఆలోచన వచ్చిన తరువాత.. సబ్యసాచి ఈ సంవత్సరం లాక్‌డౌన్‌లో యూట్యూబ్ ద్వారా కొబ్బరి వ్యర్థాలతో అలంకరణ వస్తువులను ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు. ఇంతకు ముందు అతను ఈ పనిని ఒక అభిరుచిగా ప్రయత్నించాడు. ఇప్పుడు అతని అభిరుచి అతని వ్యాపారంగా మారింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన సబ్యసాచి..అతని కుటుంబం గ్రామంలో వ్యవసాయం చేస్తారు. పాఠశాల విద్య తరువాత, అతను కోల్‌కతాలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ నుండి ఫుడ్ ప్రొడక్షన్‌లో డిప్లొమా చేసాడు. కోర్సుతో పాటు ఐఆర్‌సీటీసీలో ఉద్యోగం వచ్చేలా హోటల్‌లో ఆరు నెలల శిక్షణ కూడా తీసుకున్నాడు.
మనం అనుకున్నట్లు ప్రతిసారీ జరగదు, సబ్యసాచి విషయంలో కూడా అదే జరిగింది. ఏమి జరిగింది అనేదానిపై సబ్యసాచి వివరిస్తూ, “నేను IRCTC ఫుడ్ క్యాటరింగ్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో రైల్వేలో హోటల్ మేనేజ్‌మెంట్ చదివాను. నాకు క్రాఫ్ట్‌లంటే ఇష్టం, కోర్సులో ఫుడ్ కార్వింగ్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాను. ఇందులో పండ్లు.. కూరగాయలపై అందంగా చెక్కడం నేర్పించారు. నేను కోర్సును బాగా పూర్తి చేసాను. వివిధ రకాల వస్తువులపై అందమైన బొమ్మలు చెక్కడం కూడా నేర్చుకున్నాను. దివ్యాంగుల కోటాలో కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని పూర్తి ఆశతో ఉన్నా కొన్ని కారణాల వల్ల ప్రభుత్వ ఉద్యోగం పొందలేకపోయాను. నాకు ఉద్యోగం అవసరమైనప్పుడు, నేను గంటల తరబడి పనిచేయాల్సిన ప్రైవేట్ హోటల్ పరిశ్రమలో పనిచేయడం ప్రారంభించాను. కొంతకాలం తర్వాత నేను శారీరక అసౌకర్యం కారణంగా ఉద్యోగం వదిలివేయవలసి వచ్చింది.”
ఉద్యోగం మానేశాడు కానీ చెక్కే పని కొనసాగించాడు..
సబ్యసాచి ఉద్యోగం మానేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ ప్రారంభించాడు. దీంతోపాటు గ్రామంలోనే కిరాణా దుకాణం కూడా నిర్వహించడం ప్రారంభించాడు. చేతిపనుల పట్ల అతనికి ఉన్న ఆసక్తి కారణంగా, సబ్యసాచి తన అభిరుచితో ఎల్లప్పుడూ అనుబంధం కలిగి ఉండేవాడు. గ్రామంలో జరిగే వివాహాలు.. ఇతర కార్యక్రమాలలో, థర్మాకోల్, ఐస్.. పండ్లు-కూరగాయలు పని చేస్తూనే ఉన్నాయి. అతని ఈ నైపుణ్యానికి గ్రామస్తుల నుంచి చాలా మద్దతు లభిస్తోంది. ఈ పనికి అవార్డులు కూడా అందుకున్నాడు. కరోనా కాలంలో లాక్‌డౌన్ కారణంగా, అతని దుకాణం.. చెక్కడం పనీ రెండూ ఆగిపోయాయి.
కరోనా ఎఫెక్ట్..
ఈ పరిస్థితిపై సబ్యసాచి మాట్లాడుతూ, “కరోనా కాలంలో చాలా మంది వ్యక్తుల మాదిరిగానే, నా పని కూడా చాలా ప్రభావితమైంది. ఇంట్లో ఉండడం ద్వారా ఖాళీగా గడపడానికి చాలా సమయం దొరికేది. అదే సమయంలో, నేను నా కుటుంబానికి చెందిన ఒక ఆడపిల్ల విద్యా సంబంధిత ప్రాజెక్ట్ కోసం సహాయం చేస్తున్నాను. అక్కడి నుంచి వేస్ట్ కోకోనట్ షెల్ నుంచి ఏదైనా తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. నేను కూడా కొబ్బరి చిప్పను చెత్త కుండీలోకి వెళ్లకుండా మంచి పనికి ఉపయోగించాలని అనుకున్నాను. నేను మొదట కొబ్బరి చిప్ప నుంచి కప్పును తయారు చేసాను. తరువాత యూట్యూబ్ సహాయంతో నేను చాలా డిజైన్లను నేర్చుకున్నాను. ఈ రోజు దాదాపు 18 నుండి 20 ఉత్పత్తులను తయారు చేస్తున్నాను.” అంటూ వివరించాడు.
సోషల్ మీడియాలో ప్రశంసలు..
సబ్యసాచి తన గ్రామ సమీపంలోని గుడి నుండి కొబ్బరి చిప్పలను తీసుకుంటాడు. ముందుగా కొబ్బరి చిప్పతో టీ కప్పులు, గ్లాసులు తయారు చేసి, ఆ తర్వాత వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి, క్రమంగా అనేక అలంకరణ వస్తువులను తయారు చేయడం ప్రారంభించాడు. సబ్యసాచి ఇలా అంటాడు, “లాక్‌డౌన్ సమయంలో చాలా దేవాలయాలు మూసివేయబడినప్పటికీ, ప్రజలు సావన్ మాసంలో ఆలయం వెలుపల కొబ్బరికాయలు ఉంచేవారు. బలంగీర్ లోక్‌నాథ్ ఆలయ పూజారిని సంప్రదించి అక్కడి నుంచి కొబ్బరి చిప్పలు తీసుకురావడం మొదలుపెట్టి, మెల్లగా దానితో అలంకరణ వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టాను.”
సబ్యసాచి ఉత్పత్తులు ఒడిశా అంతటా చాలా ప్రత్యేకమైనవి, అతని ఉత్పత్తుల అందాన్ని చూసిన తర్వాత, ప్రజలు వాటిని కొనుగోలు చేయాలని సంప్రదించేవారు. ఈ ఏడాది ఆగస్టులో స్నేహితుల కోరిక మేరకు తన ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. ‘వేస్ట్ టు బెస్ట్’ తరహాలో తయారు చేయబడిన అతని ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో ప్రశంసలు పొందడం ప్రారంభించాయి. సబ్యసాచి ప్రకారం, ఫోటోను అప్‌లోడ్ చేసిన కొద్ది రోజుల్లోనే కటక్ నుండి వైన్ గ్లాసులు.. కప్పుల తయారీకి ఆర్డర్ వచ్చింది. అతను ఇప్పుడు తన ఉత్పత్తిని ‘సబ్యసాచి క్రాఫ్ట్’ పేరుతో నమోదు చేసుకున్నాడు.
అమెజాన్ ద్వారా..
సబ్యసాచి వృత్తి ఓ కళగా మొదలైంది. ప్రజలు అతని పనిని ఇష్టపడిన తర్వాత, అతను క్రమంగా చాలా ఆర్డర్‌లను పొందడం ప్రారంభమైంది. ఈ విధంగా అతను ఈ నైపుణ్యాన్ని సంపాదించడానికి సాధనంగా చేసుకున్నాడు. కొద్ది నెలల్లోనే ఫేస్‌బుక్ సహాయంతో అతనికి 10 ఆర్డర్లు వచ్చాయి. కొన్ని ఆర్డర్‌లు స్థానికంగా ఉండగా కొన్ని ఇతర నగరాలకు కొరియర్ ద్వారా పంపించాడు. సబ్యసాచి ఇలా వివరించాడు, “నా జిల్లాలో లేదా ఒరిస్సాలో మరెవరూ అలాంటి ఉత్పత్తులను తయారు చేయలేదు. కాబట్టి ప్రజలు నా పనిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నా పనిని తెలుసుకున్న తర్వాత, అమెజాన్ నన్ను సంప్రదించింది. ఇప్పుడు నా ఉత్పత్తులు సబ్యసాచి క్రాఫ్ట్ పేరుతో అమ్ముడవుతున్నాయి. పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమైనా పెద్దగా లాభం లేకపోయినా జనం డిమాండ్ వస్తున్న తీరు చూస్తుంటే పనులు బాగానే సాగుతున్నట్లు తెలుస్తోంది.
సబ్యసాచి ప్రస్తుతం కప్పులు, గ్లాసులు, వైన్ గ్లాసులు, లాంతర్లు, ఎద్దుల బండ్లు, శివలింగ్, ఓడలు వంటి అనేక అందమైన వస్తువులను తయారు చేస్తున్నారు. కేవలం 6 నెలల్లో, అతను తన ఉత్పత్తి ద్వారా ప్రతి నెలా సుమారు 20 వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. అతను త్వరలో పూర్తి చేయనున్న వేలాది ఆర్డర్‌లను కూడా పొందాడు. సబ్యసాచి ప్రకారం వారి ఉత్పత్తులన్నీ చేతితో తయారు చేసినవి. పర్యావరణ అనుకూలమైనవి. కటింగ్, గ్రీజు, షేపింగ్ ద్వారా ఒక్కో వస్తువును తానే సిద్ధం చేసుకుంటాడు.
ఇదీ సబ్యసాచి కథ. దారులు మూసుకుపోయినా కొత్త దారి వెతుక్కోవడం.. అశక్తులం అని భావించకుండా సృజనాత్మకతకు పదును పెట్టడం.. ఆలోచనలతో ఆగిపోకుండా ఆచరణలోకి అడుగువేయడం ఇవే ఇతని సక్సెస్ వెనుక ఉన్న ఫార్ములాలు. ఇవి అందరికీ విజయానికి ఉపయోగపడే మెట్లు!
ఇవి కూడా చదవండి: Paytm Shares: పేటీఎం షేర్ల ధరలలో పతనం..పదివేల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు.. ఎందుకిలా?
SBI Interest Rate: వినియోగదార్లకు ఎస్బీఐ షాక్.. వడ్డీ రేటును పెంచిన బ్యాంక్.. ఎంత పెరిగిందంటే..