200 ఏళ్ల జీవితం సాధ్యమా?.. తిమింగలంలో దాగి ఉన్న రహస్యం
200 ఏళ్ల వరకు జీవించే బౌహెడ్ తిమింగలం రహస్యం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. దీర్ఘాయుష్షుకు కారణమవుతుందనుకున్న ప్రత్యేక ప్రోటీన్‌పై తాజా పరిశోధనలు కొత్త దారులు చూపుతున్నాయి. ఈ ప్రోటీన్ జన్యు నష్టాన్ని సరిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించడంతో, మనిషి ఆయుష్షు పెంపుపై కొత్త ఆశలు వెలుగుచూస్తున్నాయి.

మనిషి ఆయుష్షును పెంచడం శాస్త్రవేత్తల ముందున్న పెద్ద సవాల్. 100 సంవత్సరాలు దాటితే గొప్పగా భావించే పరిస్థితిలో.. 200 ఏళ్ల వరకు జీవించే జీవి ఉంటే? ఆ జీవి రహస్యాన్ని తెలుసుకుంటే మనిషి జీవితకాలం పెరగొచ్చా? అనే ఆసక్తికర ప్రశ్నలకు ఇప్పుడు కొత్త సూచనలు లభిస్తున్నాయి.
అందుకు కారణం ఆర్కిటిక్ సముద్రాల్లో జీవించే భారీ బౌహెడ్ తిమింగలం. ఇది సాధారణంగా 200 సంవత్సరాల వరకు జీవించగలదు. అంతేకాదు, వ్యాధులకు కూడా ఇది అసాధారణంగా ప్రతిఘటన చూపుతుంది. అందుకే దీని శరీర నిర్మాణం, జీవక్రియలపై శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఇటీవల అమెరికాలోని రోచెస్టర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధనలో ఒక కీలక అంశం బయటపడింది. ‘నేచర్’ అనే శాస్త్రీయ పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, ఈ తిమింగలంలో ‘సీఐఆర్‌బీపీ’ అనే ప్రోటీన్ అధికంగా ఉండటం దీర్ఘాయుష్షుకు కారణమవుతుందన్న సంకేతాలు లభించాయి.
ఈ సీఐఆర్‌బీపీ ప్రోటీన్ ముఖ్యంగా జన్యు నిర్మాణంలో వచ్చే ప్రమాదకరమైన చీలికలను సరిచేసే పనిలో కీలక పాత్ర పోషిస్తుంది. అంటే, మన శరీరంలో వృద్ధాప్యం, వ్యాధులకు దారితీసే జన్యు నష్టాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రోటీన్ బౌహెడ్ తిమింగలంలో ఇతర పాలిచ్చే జీవులతో పోలిస్తే దాదాపు 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇదే దీని దీర్ఘాయుష్షుకు ప్రధాన కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ప్రయోగశాలలో చేసిన పరిశోధనలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఈ తిమింగలం సీఐఆర్‌బీపీ ప్రోటీన్‌ను మానవ కణాల్లో, అలాగే చిన్న ఈగ కణాల్లో ఉపయోగించినప్పుడు జన్యు మరమ్మత్తు ప్రక్రియ మెరుగుపడింది. చిన్న ఈగల్లో అయితే ఆయుష్షు కూడా పెరిగినట్టు గమనించారు.
ఇక మరో కీలక అంశం చలికాల వాతావరణం. ఈ తిమింగలం మంచు నీళ్లలో జీవించడం వల్ల, తక్కువ ఉష్ణోగ్రతలు ఈ ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతాయని గుర్తించారు. అందుకే కొందరు శాస్త్రవేత్తలు చల్లని నీటితో స్నానం వంటి అలవాట్లు ఈ ప్రోటీన్‌పై ప్రభావం చూపుతాయేమో అనే దిశగా కూడా పరిశోధనలు చేస్తున్నారు.
అయితే, ఈ ఫలితాలను నేరుగా మనుషులపై అమలు చేయడానికి ఇంకా సమయం పడుతుంది. బ్రిటన్‌లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఒకే ప్రోటీన్ ద్వారా ఆయుష్షు పెరగడం సాధ్యమనే సూచనలు లభించినా.. పూర్తి స్థాయి నిర్ధారణకు మరిన్ని పరిశోధనలు అవసరం.
