AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gwada Negative: ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్..! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?

తాజాగా శాస్త్రవేత్తలు ఒక అరుదైన బ్లడ్ గ్రూప్‌ ను గుర్తించారు. ఫ్రాన్స్‌ కు చెందిన ఓ మహిళలో కనిపించిన ఈ రక్త గుణానికి గ్వాడా నెగటివ్ అని పేరు పెట్టారు. ఇది ప్రపంచంలో 48వ బ్లడ్ గ్రూప్‌ వ్యవస్థ గా గుర్తించబడింది.

Gwada Negative: ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్..! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?
Rare Blood Group
Prashanthi V
|

Updated on: Jun 26, 2025 | 8:05 PM

Share

రక్తం మన శరీరంలో ప్రాణం లాంటిది. ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా బ్లడ్ గ్రూప్ లను శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇప్పుడు తాజాగా ఫ్రాన్స్‌ కు చెందిన ఒక మహిళలో మరో చాలా అరుదైన బ్లడ్ గ్రూప్ బయటపడింది. ఈ బ్లడ్ గ్రూప్ కు శాస్త్రవేత్తలు గ్వాడా నెగటివ్ అని పేరు పెట్టారు. ఇది ఇప్పుడు ప్రపంచంలో 48వ బ్లడ్ గ్రూప్ సిస్టమ్‌ గా గుర్తింపు పొందింది.

ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ ను గ్వాడెలూప్ దీవిలో పుట్టిన ఒక ఫ్రెంచ్ మహిళలో కనుగొన్నారు. ఆమె శరీరంలో ఉన్న ఈ ప్రత్యేకత వల్ల ఆమెకు.. ఆమె రక్తాన్నే ఆమెకు ఎక్కించగలిగే స్థితి వచ్చింది. అంటే ఆమె రక్తం ఏ ఇతర వ్యక్తికి సరిపోదు. వేరే వాళ్ళ రక్తం ఆమెకు ఉపయోగపడదు.

ఈ ఆవిష్కరణకు 2011లో పునాది పడింది. అప్పట్లో ఆ మహిళకు ఒక మామూలు ఆపరేషన్ ముందు రక్త పరీక్షలు చేశారు. ఆ సమయంలో శాస్త్రవేత్తలు ఒక వింత యాంటీబాడీని గుర్తించారు. కానీ అప్పుడు సరిపడా సౌకర్యాలు లేకపోవడంతో దీనిపై లోతుగా విశ్లేషించలేకపోయారు.

అయితే 2019లో ఫ్రాన్స్‌ లో ఫ్రెంచ్ బ్లడ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (EFS) సంస్థ ఆధునిక DNA సీక్వెన్సింగ్ పద్ధతులను వాడి.. ఈ బ్లడ్ గ్రూప్ వెనుక ఉన్న జన్యు మార్పును కనుగొనగలిగింది. గ్వాడా నెగటివ్ అనే పేరును ఆమె స్వస్థలం గ్వాడెలూప్‌ కు గుర్తుగా పెట్టారు. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం.. ఈ జీన్లలో మార్పు ఆమె తల్లిదండ్రులిద్దరిలో ఒకేలాంటి మార్పు ఉండటం వల్ల వంశపారంపర్యంగా వచ్చింది.

ఈ పరిశోధనలో పాల్గొన్న వైద్య జీవ శాస్త్రవేత్త థియెరీ పెరార్డ్ ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఆమెకు రక్తం అవసరమైనప్పుడు.. పూర్తిగా ఆమెకే సరిపోయే రక్తం ఆమెదే కావడం ఒక పెద్ద సవాల్. ఇది వైద్యరంగంలో ఒక అరుదైన ఉదాహరణగా నిలిచిపోతుంది.

ఈ బ్లడ్ గ్రూప్ ఆవిష్కరణ, అరుదైన రక్త గుణాలున్న రోగులకు మంచి చికిత్స అందించడానికి చాలా ముఖ్యంగా మారనుంది. DNA ఆధారిత పరీక్షల వల్ల ఇలాంటి ప్రత్యేక బ్లడ్ గ్రూప్ లను త్వరగా గుర్తించవచ్చు. దీని ద్వారా మరిన్ని గ్వాడా నెగటివ్ రక్త గుణాలున్న వ్యక్తులను గుర్తించాలన్నదే శాస్త్రవేత్తల లక్ష్యం.

ఈ రకమైన పరిశోధనలు భవిష్యత్తులో ప్రత్యేక అవసరాలున్న రోగులకు మెరుగైన వైద్య సహాయం ఇవ్వడానికి దారి చూపుతాయి. ఇది రక్త మార్పిడి రంగంలో మరో ముఖ్యమైన ఘట్టంగా చెప్పవచ్చు.