Success Story: 16 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకే వితంతువై.. స్వీపర్ నుంచి ఎస్బీఐలో టాప్ పొజీషన్‌కి..ఈమె అందరిలా కాదు
జీవితంలో ఎదురయ్యే కష్టాలు కొందరిని కుంగదీస్తే.. మరికొందరిని మరింత బలంగా మారుస్తాయి. పరిస్థితులు ఎలా ఉన్నా పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపించిన మహిళలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ప్రతీక్ష తొండ్వాల్కర్ ఒకరు. చిన్న వయసులోనే పెళ్లి, ఆ తర్వాత ఊహించని విషాదం.. చేతిలో చిన్న బిడ్డ.. కుటుంబాన్ని పోషించడానికి ఎన్నో కష్టాలు. అయినప్పటికీ ఆమె తన జీవితంపై ఆశలు వదులుకోలేదు.

16 ఏళ్లకే వివాహం.. 20 ఏళ్లకే తీరని విషాదం
1964లో మహారాష్ట్రలోని పూణేలో ఒక నిరుపేద కుటుంబంలో ప్రతీక్ష జన్మించారు. చిన్న వయసులోనే ఆమెకు వివాహం జరిగింది. దీంతో ఏడో తరగతి తర్వాత చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. పెళ్లి అనంతరం భర్త సదాశివ్ కడుతో కలిసి ముంబైకి వెళ్లి స్థిరపడ్డారు. ఆయన అక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో బుక్‌బైండర్‌గా పనిచేసేవారు.
వీరికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే కుటుంబంతో కలిసి సొంతూరికి వెళ్లిన సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వారి జీవితాలను తలకిందులు చేసింది. ఈ ప్రమాదంలో భర్త సదాశివ్ ప్రాణాలు కోల్పోయారు. అప్పటికి ప్రతీక్ష వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. చేతిలో చిన్న బిడ్డ.. మరోవైపు కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత. అయినప్పటికీ ఆమె ధైర్యం కోల్పోకుండా జీవనపోరాటం ప్రారంభించారు.
నెలకు రూ.60 జీతంతో స్వీపర్‌గా ఉద్యోగం
భర్త మరణించిన తర్వాత మొదట టైలరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. అనంతరం కుమారుడితో కలిసి ముంబైకి వెళ్లారు. తన భర్తకు రావాల్సిన బకాయిల కోసం ఎస్‌బీఐ శాఖకు వెళ్లిన ప్రతీక్ష.. అక్కడి మేనేజర్‌ను తనకు ఏదైనా ఉద్యోగం కల్పించాలని కోరారు.
ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న బ్యాంకు అధికారులు 1985లో పార్ట్‌టైమ్ క్లీనర్‌గా ఉద్యోగం ఇచ్చారు. అప్పట్లో ఆమెకు నెలకు రూ.60 నుంచి రూ.65 వరకు జీతం వచ్చేది. ప్రతిరోజూ ఉదయం రెండు గంటల పాటు బ్యాంకును శుభ్రం చేయడం, కార్యాలయాన్ని ఊడ్చడం, టాయిలెట్లు, ఫర్నిచర్‌ను శుభ్రపరచడం ఆమె విధులు. మిగిలిన సమయంలో ఇతర పనులు చేసుకుంటూ కుమారుడిని పెంచేవారు.
కిరోసిన్ దీపం వెలుగులో చదువులు
ఉద్యోగం చేస్తూనే చదువుకోవాలనే కోరికను ప్రతీక్ష వదులుకోలేదు. చిన్నప్పుడు మధ్యలో ఆగిపోయిన చదువును తిరిగి కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పాత పుస్తకాల దుకాణంలో 8, 9, 10వ తరగతులకు సంబంధించిన పాత పుస్తకాలను కొనుగోలు చేశారు.
పగలంతా పనులు చేసుకుంటూ రాత్రిపూట కిరోసిన్ దీపం వెలుగులో చదువుకునేవారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పట్టుదలగా చదివి పదో తరగతి పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత ముంబైలోని విక్రోలిలో నైట్ కాలేజీలో చేరారు. అక్కడ పీయూసీ పూర్తి చేసి, సైకాలజీలో డిగ్రీ కూడా సాధించారు.
స్వీపర్ నుంచి క్లర్క్.. ఆ తర్వాత క్యాషియర్‌గా ప్రమోషన్
ప్రతీక్ష కష్టానికి తగిన ఫలితం దక్కడం మొదలైంది. 1990లో ఆమె క్లీనర్ ఉద్యోగం నుంచి మెసెంజర్‌గా పదోన్నతి పొందారు. 1993లో ప్రమోద్ తొండ్వాల్కర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో మరిన్ని పరీక్షలు రాసి ఉద్యోగంలో ఎదగడానికి ప్రయత్నించారు.
ఆమెకు కుటుంబం నుంచి లభించిన సహకారం కూడా ఎంతో ఉపయోగపడింది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తూ ఒక్కో మెట్టు ఎక్కారు. 1995లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత డిపార్ట్‌మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణులై క్లర్క్-కమ్-క్యాషియర్‌గా పదోన్నతి పొందారు.
2022లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా ఎదుగుదల
ప్రతీక్ష ప్రయాణం అక్కడితో ఆగలేదు. నిరంతర కృషి, చదువు, ఉద్యోగ పరీక్షల్లో ప్రతిభతో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. 2004లో శిక్షణాధికారిగా పదోన్నతి పొందారు. ఒకప్పుడు తాను ఊడ్చి శుభ్రం చేసిన అదే బ్యాంకులో అంచెలంచెలుగా ఎదుగుతూ 2022లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) స్థాయికి చేరుకున్నారు.
నెలకు రూ.60 నుంచి రూ.65 జీతంతో ప్రారంభమైన ఆమె ప్రయాణం.. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఎస్‌బీఐలో ఉన్నత అధికారిణిగా ఎదిగే స్థాయికి చేరింది. ఈ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.
55 ఏళ్ల వయసులోనూ చదువుపై ఆసక్తి
ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పటికీ ప్రతీక్షలో నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గలేదు. 55 ఏళ్ల వయసులో ప్రకృతి వైద్యంలో రెండేళ్ల కోర్సును పూర్తి చేశారు. తన జీవితకాల కోరికల్లో ఒకటైన ఈ విద్యను కూడా విజయవంతంగా పూర్తిచేశారు.
ప్రస్తుతం ఆమె పేద, ఆర్థికంగా వెనుకబడిన పిల్లల చదువుకు సహాయం చేస్తూ సామాజిక సేవలో పాల్గొంటున్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసం, పట్టుదల, విద్యపై ఆసక్తి ఉంటే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని ప్రతీక్ష తొండ్వాల్కర్ నిరూపించారు.
