ఒక్క సర్పంచ్ పదవి కోసం ఇన్ని కోట్లా? గ్రామాభివృద్ధికి భారీ ఆఫర్లు ప్రకటిస్తున్న ఆశావాహులు..!
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం.. అన్నట్లు పోలింగ్ మొదలవ్వక ముందే పోటీ పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే సర్పంచ్ పదవులకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. గ్రామానికి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే కోట్లు విలువ చేసే ఆస్తులు, భూములు ఇస్తామంటూ కొందరు ముందుకొస్తున్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంక పంచాయతీలో సర్పంచ్ పదవికి భారీ ఆఫర్ ప్రకటించారు దొమ్మేటి రమేష్ అనే వ్యక్తి. గ్రామ సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా కేటాయిస్తే గ్రామాభివృద్ధి కోసం కోటి 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తానని వెల్లడించారు. దశాబ్దాలుగా గ్రామాన్ని వేధిస్తున్న డంపింగ్ యార్డు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
మరోవైపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సర్పంచ్ పదవి కోసం వినూత్న ప్రయోగానికి తెరతీశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మాదరాజుగూడూరు పంచాయతీలో సర్పంచ్ పదవికి పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. వారి మధ్య విభేదాలు, కక్షలకు తావులేకుండా లక్కీ డిప్ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఆశావహుల పేర్లను లక్కీ డిప్‌లో వేసి అదృష్టం ఆధారంగా ఒకరిని ఎంపిక చేసే విధానం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇక పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలో మరో ఆసక్తికర ప్రకటన వెలువడింది. తన భార్య కొప్పర్తి రామలక్ష్మిని గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రెండు ఎకరాల భూమిని గ్రామానికి దానం చేస్తానని ప్రకటించారు గ్రామస్తుడు కొప్పర్తి శ్రీరామచంద్రమూర్తి. సుమారు కోటి రూపాయల విలువైన ఈ భూమిని గ్రామంలో మంచినీటి చెరువు నిర్మాణం కోసం కేటాయిస్తానని వెల్లడించారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే తన లక్ష్యమని తెలిపారు.
మొత్తానికి గ్రామాభివృద్ధి హామీలు, భారీ ఆఫర్లు, లక్కీ డిప్ నిర్ణయాలతో ఈసారి సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..