AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Gardening: వర్షాకాలంలో కిచెన్ గార్డెన్ కోసం ఈ మొక్కలు బెస్ట్ ఆప్షన్..!

వర్షాకాలం ప్రారంభం కిచెన్ గార్డెన్ ప్రేమికులకు అద్భుత సమయం. తేమతో కూడిన వాతావరణం కొన్ని మొక్కల పెరుగుదలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. చిన్న బాల్కనీ అయినా.. కిటికీ దగ్గర అయినా ఈ కాలంలో కొన్ని మొక్కలను సులభంగా పెంచి పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు.

Monsoon Gardening: వర్షాకాలంలో కిచెన్ గార్డెన్ కోసం ఈ మొక్కలు బెస్ట్ ఆప్షన్..!
Monsoon Gardening
Prashanthi V
|

Updated on: Jul 31, 2025 | 10:01 PM

Share

వర్షాకాలం మొదలయ్యే సమయం ఇంట్లో కిచెన్ గార్డెన్ కోసం మొక్కలు నాటడానికి చాలా మంచిది. మీరు పెరడు, బాల్కనీ, లేదా కిటికీల దగ్గర కూడా ఈ మొక్కలను సులభంగా పెంచుకోవచ్చు. ఈ కాలంలో వాతావరణం వల్ల కొన్ని చిన్న సమస్యలు వచ్చినా.. పచ్చదనం, చల్లదనం, వర్షం అందాన్ని ఆస్వాదించవచ్చు. కొన్ని రకాల మొక్కలు తేమను, కొన్ని చల్లదనాన్ని ఇష్టపడతాయి. అలాంటి మొక్కలన్నింటినీ మీ ఇంటి కిచెన్ గార్డెన్‌లో పెంచవచ్చు.

కొత్తిమీర

కొత్తిమీరను విత్తనాలతో సులభంగా పెంచవచ్చు. ఇది తేమను బాగా ఇష్టపడుతుంది. అందు వల్ల వర్షాకాలంలో ఇది వేగంగా పెరుగుతుంది. ఇసుక కలిసిన మట్టిలో నీరు నిలవకుండా ఉండే నేలలో నాటడం మంచిది. చిన్న కుండీలో కూడా ఇది సులభంగా పెరుగుతుంది.

పుదీనా

పుదీనా మొక్కకు కూడా తడి వాతావరణం చాలా ఇష్టం. దీన్ని మీరు చిన్న కుండీలో కానీ లేదా నేరుగా మట్టి నేలలో కానీ నాటవచ్చు. పుదీనా ఎదుగుదలకు కొద్దిగా నీడ ఉండే చోటు బాగా సరిపోతుంది. కాబట్టి దీన్ని నేరుగా ఎండ తగలకుండా నాటితే మంచిది.

అల్లం

అల్లం లాంటి రైజోమ్ మొక్కలు వర్షాకాలంలో బాగా పెరుగుతాయి. దీన్ని పెంచడానికి పెద్ద కుండీలు అవసరం. అయితే ఇది త్వరగా పెరగదు.. కొంత సమయం పడుతుంది. అలాగే పసుపు మొక్కనూ ఈ కాలంలో పెంచవచ్చు.

కరివేపాకు

కరివేపాకు మొక్క ఎండను ఇష్టపడుతుంది. అయినా తడి వాతావరణంలో కూడా బాగా ఎదుగుతుంది. దీని వేర్లు మట్టిలో బాగా పెరగడానికి పెద్ద కుండీలు వాడడం మంచిది. రోజూ కొంత వెలుతురు దీనికి అవసరం.

తులసి

తులసి ఔషధ గుణాలు ఉన్న పవిత్రమైన మొక్క. దీనికి ఎక్కువ వెలుతురు అవసరం లేదు. కానీ ఎక్కువ తేమ ఉండే నేలలో నాటకుండా ఉండాలి. తక్కువ వెలుతురు ఉండే ఇంటి లోపల ఈ మొక్కను నాటడం మంచిది.

ఒరేగానో

ఇటాలియన్ వంటకాల్లో ఎక్కువగా వాడే ఒరేగానోను ఇంట్లోనే సులభంగా పెంచవచ్చు. దీన్ని మంచి వెలుతురు ఉండే గదిలో పెంచితే వేగంగా పెరుగుతుంది. చిన్న కుండీలో కూడా ఇది సులభంగా పెరుగుతుంది.

వర్షాకాలం మన ఇంటిని పచ్చదనంతో నింపే అద్భుతమైన సమయం. మీరు చిన్న గదిలో అయినా, బాల్కనీలో అయినా ఈ ఆరు మొక్కలను పెంచడం ద్వారా అందాన్ని మాత్రమే కాదు.. ఆరోగ్య లాభాలను కూడా పొందవచ్చు.