AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గొంతులో చేప ముల్లు ఇరుక్కుంటే ఏమి చేయాలి? నిపుణులు చెప్పే చిట్కాలు

గొంతులో చేప ముల్లు గుచ్చుకుంటే స్వయంగా తొలగించే ప్రయత్నం చేయకూడదు. అది మరింత లోపలికి వెళ్లి రక్తనాళాలకు ప్రమాదం కలిగించవచ్చు. వెంటనే ఐస్‌ను చీకుతూ, వీలైనంత త్వరగా ఈఎన్‌టీ వైద్యుడిని సంప్రదించాలి. అన్నం మింగడం వంటి ఇంటి చిట్కాలు ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి.

గొంతులో చేప ముల్లు ఇరుక్కుంటే ఏమి చేయాలి? నిపుణులు చెప్పే చిట్కాలు
Fishbone Stuck Throat
Ram Naramaneni
|

Updated on: Apr 30, 2026 | 5:12 PM

Share

చేపలు పౌష్టికాహారంలో ముఖ్యమైన భాగం. చేప కూర, ఫ్రై, బిర్యానీ వంటివి ఎంతో మంది ఇష్టంగా తింటారు. అయితే కొన్నిసార్లు చేప తింటున్నప్పుడు ముల్లు గొంతులో ఇరుక్కోవడం జరుగుతుంది. ఇది గుచ్చుకున్నట్లుగా నొప్పి, దగ్గు, మింగడంలో ఇబ్బంది వంటి అసౌకర్యాలను కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? తెలుసుకోవడం చాలా ముఖ్యం.

గొంతులో ముల్లు ఇరుక్కుంటే చాలామంది వెంటనే వేలితో గీకడం లేదా ఏదైనా వస్తువుతో తీసేయడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేస్తే ముల్లు మరింత లోపలికి వెళ్లి గొంతులోని సున్నితమైన కణజాలానికి గాయాలు కలిగించే అవకాశం ఉంది. అన్నం, బ్రెడ్, అరటిపండు నమలకుండా మింగడం.. బలవంతంగా నీళ్లు గుటకలు వేయడం, వీపుపై బలంగా కొట్టడం, పొట్టపై ఒత్తిడి చేయడం వంటి సొంత ప్రయత్నాలు చెయ్యకండి. ఇవి ముల్లు బయటకు రావడానికి సహాయం చేయవు, పైగా లోపలికి నెట్టే ప్రమాదం ఉంటుంది.

ఒకవేళ చేప మల్లు గొంతులో ఇరుక్కుపోతే.. గాబరా పడకుండా శాంతంగా ఉండండి. స్వల్పంగా దగ్గే ప్రయత్నం చేయండి. నీళ్లు నెమ్మదిగా తాగండి. అద్దంలో చూసుకున్నప్పుడు ముళ్లు గొంతులో కనిపిస్తే మాత్రమే జాగ్రత్తగా పరిశీలించండి. ఐస్‌ను నెమ్మదిగా చీకడం వల్ల నొప్పి, వాపు కొంతవరకు తగ్గవచ్చు. కానీ ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. సమస్యకు పూర్తి పరిష్కారం కాదు.

మింగలేకపోవడం, తీవ్ర నొప్పి, రక్తస్రావం, ముల్లు ఉన్న ఫీలింగ్ కొనసాగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ENT నిపుణుడిని సంప్రదించాలి. నిపుణులు ప్రత్యేక పరికరాలతో సురక్షితంగా ముల్లును తొలగిస్తారు. చేప తినేటప్పుడు తొందరపడకండి, చిన్న ముక్కలుగా తీసుకుని తినండి, పిల్లలకు ఇస్తే ముందే ముల్లు తీసేయండి. మంచి లైటింగ్‌లో తినడం అలవాటు చేసుకోండి

చాలామంది అనుకునేలా “అన్నం మింగితే ముల్లు కిందికి వెళ్తుంది” అనే నమ్మకానికి వైద్యపరమైన ఆధారాలు లేవు. పైగా, ఇది సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేయొచ్చు. గొంతులో చేప ముల్లు ఇరుక్కోవడం సాధారణమే అయినా, దాన్ని తేలికగా తీసుకోవడం మాత్రం ప్రమాదకరం. స్వయంగా ప్రయత్నాలు చేయకుండా, అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించడం సురక్షిత మార్గం. సరైన జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి సమస్యలను సులభంగా నివారించవచ్చు.

Follow Us