Cockroach: బాబోయ్.. బతికున్న బొద్దింకతో మాత్రమే కాదు, చచ్చిన బొద్దింక కూడా పెను ప్రమాదం
బొద్దింక - చూడటానికి చిన్నగా ఉన్నా చెట్టంత మనిషిని కూడా అది వణికిస్తుంది. చాలా మందికి దాన్ని చూస్తే ఒకలాంటి వికారం, కొంత మందైనా దాన్ని చూసి భయపడుతుంటారు. కాని ఇప్పుడు బొద్దింక కనిపిస్తే చాలా అందరూ భయపడే రోజు వచ్చేసింది. దానిపై నిర్వహించిన పరిశోధనలో నివ్వెరపరిచే విషయాలు వెలుగుచూశాయి.

ఏనుగు చచ్చినా, బతికినా దాని విలువ తగ్గదంటారు. ఇప్పుడు ఈ సూత్రం బొద్దింకకు కూడా అన్వయించుకోవచ్చు. బతికున్న బొద్దింక ఎంత ప్రమాదకరమో, చచ్చిన బొద్దింక అంత కంటే ఎక్కువ ప్రమాదకరమని నిపుణులు తేల్చిచెప్తున్నారు. ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకున్నా సరే వీటి పీడ మాత్రం విరగడం కాదని చాలా మంది అంటుంటారు. కిచెన్‌లోనూ, ఆహార పదార్ధాలపైన, చెత్త బుట్టల్లో, బాత్‌రూమ్‌లో ఇందుగలవు, అందులేవని చెప్పేందుకు వీల్లేకుండా బొద్దింకలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి.
అనేక రోగాలకు కారకాలుగా బొద్దింకలను చెప్పుకోవచ్చు. అలర్జీలు, ఆస్తమా, జ్వరాలు, విరేచనాలతో పాటు ప్రమాదకరమైన, కలరా, టైఫాయిడ్ వ్యాధికి కారణం బొద్దింకలే. సాధారణంగా ఇవి కనిపించగానే చాలా మంది వాటిని కొట్టి చంపేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. కాని వాటిని చంపిన తర్వాత కూడా ముప్పు అలాగే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అసలు ప్రమాదం అక్కడే మొదలవుతుంది. అది మనల్ని ఆస్పత్రి పాలుచేసేంత వరకు తీసుకెళ్తుంది. అవును, బొద్దింక చనిపోయిన తర్వాత కూడా దానిలో ఉండే ప్రమాదకరమైన సాల్మోనెల్లా పేరాటైఫీ-బి బ్యాక్టీరియా 10 రోజులు పాటు సజీవంగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. బతికున్న బొద్దింకలో ఆ బ్యాక్టీరియా వారం పాటు సజీవంగా ఉంటుందని నిర్థారించారు. బొద్దింకలు, అందులో ఉండే బ్యాక్టీరియాపై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఉన్న ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లోతైన పరిశోధన నిర్వహించింది.
టైఫాయిడ్, పేరా టైఫాయిడ్ రోగ లక్షణాల్లో పెద్దగా తేడా ఉండదు. కాని, టైఫాయిడ్ చాలా ప్రమాదకారి. పేదవారి రోగం అనే పేరు కూడా దీనికి ఉంది. పరిశుభ్రత లోపించడం, తాగడానికి మంచి నీటి కొరత కారణంగా ఈ వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. ప్రవంచవ్యాప్తంగా టైఫాయిడ్, పేరా టైఫాయిడ్ రోగాల బారినపడి మరణించే వారిలో సగం మంది భారతీయులంటే ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ మరణాలు కూడా గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో ఎక్కువ. టైఫాయిడ్, పేరా టైఫాయిడ్ వంటివి బొద్దింకల ద్వారా వ్యాపించే వ్యాధులు. ఢిల్లీ, కోల్‌కతా, వెల్లూరు వంటి నగరాల్లో ఈ వ్యాధి చాలా ఎక్కువ కనిపిస్తుంది. అక్కడ ప్రతీ వంద మందిలో కనీసం ఇద్దరు ఆ వ్యాధుల బారిన పడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు బొద్దింకలు సృష్టిస్తున్న విలయాన్ని. అంతే కాదు వీటి ద్వారా జ్వరాలు కూడా తీవ్రంగా ప్రబలుతూ ఉంటాయి. భారతదేశంలో జ్వరం బారిన పడే ప్రతీ 10 మంది రోగుల్లో ఒక రోగి కచ్చితంగా బొద్దింకల్లో ఉండే బ్యాక్టీరియా బారిన పడేవారు ఉంటారు. ఈ బ్యాక్టీరియా బారిన పడిన వారిలో ప్రతీ 1000 మంది రోగుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారని పరిశోధనల్లో తేలింది.
బొద్దింకలు ఇంట్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరు కాళ్లు, రెండు రెక్కలతో కూడిన బొద్దింకులు ఒక ఇంచ్ కంటే కూడా పొడవుంటాయి. అవి అతి చల్లని వాతావరణం, అతి వేడి వాతావరణాన్ని కూడా తట్టుకొని బతకగలవు. వీటిని తల తొలగించినా కూడా వారం పాటు బతకగల మొండి జీవులు ఇవి. వీటిని నీళ్లలో ముంచినా 40 నిమిషాల పాటు ఊపిరి బిగబట్టి జీవించగలవు. ఇవి వేగంగా పరిగెత్తగల జీవులు కూడా గంటకు మూడు మైళ్లు పరిగెత్తగలవు. అప్పుడే పుట్టిన బొద్దింక కూడా పెద్ద బొద్దింకతో సమానంగా పరిగెత్తగలదు. వాతావరణ పరిస్థితులను బట్టి ఇవి ఒక సంవత్సరం వరకు జీవించగలవు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
