Anti Aging: 46 ఏళ్ల వ్యక్తి వింత కోరిక.. ముసలితనం రాకుండా ఈ యూట్యూబర్ ఏం చేస్తున్నాడో చూడండి
వృద్ధాప్యాన్ని జయించాలనే తపనతో ఒక వ్యక్తి చేస్తున్న వింత ప్రయత్నం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన జీవగడియారాన్ని వెనక్కి తిప్పేయాలని భావిస్తున్న ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఏకంగా తన రక్తాన్నే మార్చుకుంటున్నాడు! తండ్రి, కొడుకు రక్తంతో ఆయన చేస్తున్న ఈ ప్రయోగం ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.. ఈ ప్రయోగం ఏమవుతుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం..

కాలిఫోర్నియాకు చెందిన 47 ఏళ్ల బ్రియన్ జాన్సన్‌కు వృద్ధాప్యం అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలనే కోరికతో ఆయన నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 18 ఏళ్ల వయసులో ఉన్నప్పటి శరీరాన్ని తిరిగి పొందాలనే లక్ష్యంతో ఆయన తన శరీరంపై అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల కోసం ఆయన భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు.
ఆలివర్ జోల్మాన్ అనే డాక్టర్ నేతృత్వంలోని బృందం బ్రియన్ జాన్సన్‌కు వృద్ధాప్య లక్షణాలు రాకుండా, యవ్వనంగా ఉండేలా చికిత్స అందిస్తోంది. గతంలో ఆయన చేసిన ప్రయోగాల వల్ల శరీర బలం, ఊపిరితిత్తుల సామర్థ్యం 18 ఏళ్ల యువకుడిలా మారాయి. గుండె పనితీరు 37 ఏళ్ల వ్యక్తిలా, చర్మం నిగారింపు 28 ఏళ్ల యువకుడిలా ఉందని ఆయన తెలిపారు.
తాజాగా బ్రియన్ జాన్సన్ తన శరీరంలోని రక్తం నుంచి మొత్తం ప్లాస్మాను తొలగించడం సంచలనం కలిగించింది. రక్తంలో దాదాపు 40 నుంచి 55 శాతం వరకు ఉండే ప్లాస్మాను తొలగించడం ప్రమాదకరమైన చర్యే. అయినప్పటికీ, ఆయన ప్లాస్మాను పూర్తిగా తొలగించి, ఆ స్థానంలో ఇతర ద్రవాలను ఎక్కించుకున్నారు.
ప్లాస్మా అంటే ఏమిటి?
ప్లాస్మా అనేది లేత పసుపు రంగులో ఉండే ద్రవం. ఇది రక్తంలో ఒక భాగం. రక్తంలోని కణాలు, ఇతర పదార్థాలను ప్లాస్మా శరీరంలోని వివిధ భాగాలకు సరఫరా చేస్తుంది. ప్లాస్మాలో ఎక్కువ భాగం నీరు, అలాగే యాంటీబాడీలు, ముఖ్యమైన ప్రోటీన్లు, లవణాలు, ఎంజైమ్‌లు ఉంటాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తికి, రక్తం గడ్డకట్టే ప్రక్రియకు ఉపయోగపడుతుంది.
బ్రియన్ జాన్సన్ తన శరీరంలోని ఇంత ముఖ్యమైన ప్లాస్మాను తొలగించి, దాని స్థానంలో ఆల్బుమిన్, ఐవిఐజి ద్రవాలను ఎక్కించుకున్నారు. ఆల్బుమిన్ అనేది సాధారణంగా ప్లాస్మాలో ఉండే ఒక ముఖ్యమైన ప్రొటీన్. ఇది శరీరంలోని వివిధ భాగాలకు హార్మోన్లు, మందులు వంటి వాటిని చేరవేయడానికి, అలాగే కిడ్నీ, లివర్ పనితీరుకు సహాయపడుతుంది. ఐవిఐజి ద్రవం రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలను కలిగి ఉంటుంది.
గతంలో బ్రియన్ జాన్సన్ తన కుమారుడి నుంచి ప్లాస్మాను తీసుకొని తన శరీరంలోకి ఎక్కించుకున్నారు. ఇప్పుడు దాన్ని తొలగించి ఆల్బుమిన్, ఇతర ద్రవాలు ఎక్కించుకున్నారు. ఈ ప్రయోగం తర్వాత తనకు ఎలాంటి సమస్యలు రాలేదని, బాగా నిద్ర పట్టిందని ఆయన పోస్ట్ చేశారు.
ఒకప్పుడు పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీని నడిపిన బ్రియన్ జాన్సన్, దానిని భారీ ధరకు విక్రయించిన తర్వాత తన యవ్వనాన్ని తిరిగి పొందే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఆయన ప్రతి సంవత్సరం తన శరీరంపై చేసే ప్రయోగాల కోసం దాదాపు 17 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు.
