Sleep Mystery: డాక్టర్లకే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న తాతయ్య.. ఇంతకీ ఏం చేశాడంటే.?
సాధారణంగా ఒక రోజు నిద్ర లేకపోయినా మనిషి శరీరం మనస్సు బలహీనపడతాయి. అలాంటిది, న్గోక్ అనే ఈ వ్యక్తి చివరిసారిగా నిద్ర పోయింది 1962లో! అంటే, ఆరు దశాబ్దాలకు పైగా ఆయన నిద్రకు దూరంగా ఉన్నారు. 20 సంవత్సరాల వయసులో, వియత్నాం యుద్ధం సమయంలో వచ్చిన తీవ్రమైన జ్వరం నుంచి కోలుకున్న తర్వాతే ఆయనలో ఈ అసాధారణ పరిస్థితి మొదలైందని ఆయన చెబుతున్నారు. జ్వరం తగ్గింది కానీ, ఆయన నిద్ర సామర్థ్యం తిరిగి రాలేదు. నిద్ర కోసం మందులు, ఇంటి చిట్కాలు, చివరికి మద్యం కూడా ప్రయత్నించినప్పటికీ, ఏదీ ఆయనకు పని చేయలేదు. ఆయన కుటుంబ సభ్యులు గ్రామస్థులు కూడా ఇంత కాలంలో న్గోక్ నిద్రపోవడం తాము ఎప్పుడూ చూడలేదని ధృవీకరిస్తున్నారు.

వియత్నాంలోని క్వాంగ్ నామ్ ప్రావిన్స్‌లో నివసించే 81 ఏళ్ల రైతు థాయ్ న్గోక్ కథనం యావత్ ప్రపంచాన్ని, ముఖ్యంగా వైద్య నిపుణులను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 62 ఏళ్లుగా ఈ వృద్ధుడు కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నాడట! నిద్ర అనేది మనుగడకు, మానసిక ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనదని సైన్స్ చెబుతున్నప్పటికీ, న్గోక్ మాత్రం అందరిలాగే చురుకైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన ప్రతిరోజూ తన పొలంలో పనిచేయడం, బరువులు ఎత్తడం, రైస్ వైన్ తయారు చేయడం, పొరుగువారితో ఉల్లాసంగా మాట్లాడటం వంటి సాధారణ పనులన్నీ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.
వైద్య నిపుణులను కలవరపరిచే విషయం ఏమిటంటే, ఆ గ్రామాన్ని సందర్శించిన పలువురు వైద్యులు న్గోక్‌ను అనేకసార్లు పరీక్షించినప్పటికీ, ఆయన రక్తపోటు, గుండె పనితీరు, మెదడు కార్యకలాపాలు అన్నీ సాధారణంగానే ఉన్నాయని కనుగొన్నారు. శరీరానికి విశ్రాంతి అవసరం కాబట్టి, మనిషి నిద్ర లేకుండా కొన్ని రోజుల కంటే ఎక్కువ కాలం జీవించలేడని శాస్త్రీయ పరిశోధనలు చెబుతుంటే, ఆయన కథనం జీవశాస్త్రానికి ఒక పెద్ద సవాలుగా నిలిచింది.
వైన్, సిగరెట్లు: అసాధారణ అలవాట్లు
ఆశ్చర్యకరంగా, న్గోక్ రోజువారీ అలవాట్లు అంత ఆరోగ్యకరమైనవి కావు. ఒక అమెరికన్ ట్రావెల్ యూట్యూబర్ డ్రూ బిన్సీక్ తన వీడియోలో పేర్కొన్నట్లుగా, న్గోక్ దాదాపు రోజుకు అర లీటరు రైస్ వైన్ తీసుకుంటాడు, సుమారు 70 సిగరెట్లు తాగుతాడు. అయినప్పటికీ ఆయన శారీరకంగా చురుకుగా ఉంటూ వ్యవసాయం చేస్తూనే ఉండటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకోకుండా, పనిలో లేదా ఆలోచనల్లో గడుపుతారని స్థానికులు చెబుతున్నారు.
న్గోక్ కథ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వినియోగదారుల నుంచి విస్మయం, ప్రశంస సానుభూతి వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆయన అసాధారణ శక్తిని ప్రశంసిస్తే, మరికొందరు ఆయన పరిస్థితిని వియత్నాం యుద్ధం వల్ల కలిగిన శాశ్వత మానసిక గాయం తాలూకు విషాదకరమైన ప్రభావంగా భావిస్తున్నారు. ఈ నిద్రలేని సంవత్సరాలలో ఆయన అద్భుతమైన పని చేశారని, కష్టపడి తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
