కరోనా మందు రెమ్‌డెసివర్ కావాలా..? నమోదు చేసుకోండిలా..
కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి రెమ్‌డెసివర్ మందు వాడమని డాక్టర్లు ప్రిస్క్రిప్షన్‌లో రాస్తున్నారు. ఈ మందును హెటిరో అనే ఫార్మా కంపెనీ తయారు చేసింది.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో పలు ఫార్మా కంపెనీలు కరోనా చికిత్సకై మందులు తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి రెమ్‌డెసివర్ మందు వాడమని డాక్టర్లు ప్రిస్క్రిప్షన్‌లో రాస్తున్నారు.
ఈ మందును హెటిరో అనే ఫార్మా కంపెనీ తయారు చేసింది. ప్రస్తుతం ఈ వైరల్ డ్రగ్‌ను హైరిస్క్ ఉన్నపేషంట్లకు చికిత్స చేయడంలో ఉపయోగిస్తున్నారు. దీనితో ఈ మందు బయట మార్కెట్‌లో తక్కువగా దొరుకుతోంది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆ ఇంజెక్షన్ మందు కోసం భారీ స్థాయిలో బ్లాక్ మార్కెట్ జరుగుతున్నది. రూ. 5 వేలకు దొరికే బాటిల్‌ను ఏకంగా రూ. 30 వేలకు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో దీని తయారీ సంస్థ హెటిరో కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.
రెమ్‌డెసివర్ మందు కావాల్సిన వారు డైరెక్ట్‌గా హెటిరో అఫీషియల్ సైట్‌లోని ప్రోడక్ట్ ఎంక్వైరీ పేజీలో తమ పేరు, ఈ-మెయిల్, లొకేషన్, కాంటాక్ట్ వివరాలను నమోదు చేయాలని తెలిపింది. అంతేకాకుండా ఫోన్ నెంబర్, ఎన్ని బాటిల్స్ కావాలన్న వివరాలను కూడా అందించాలంది. దీని ద్వారా రెమ్‌డెసివర్ కావాల్సిన వారికి తామే నేరుగా ఆ మందును అందజేస్తామని హెటిరో సంస్థ ప్రకటించింది. కాగా, ఈ రెమ్‌డెసివర్ ఏయే ఆసుపత్రులలో లభిస్తుందో అన్న వివరాలను సైతం హెటిరో కంపెనీ తన వెబ్‌సైట్‌లో పొండుపరించింది.