తరచూ నిద్ర నుంచి లేస్తున్నారా..? అయితే లేట్ చేయకండి.. మీ ఆరోగ్యానికి ముప్పు..!
రాత్రి నిద్రలో మెలకువ రావడం ఒక్కసారిగా జరిగితే సాధారణమే. కానీ ఇది తరచూ జరుగుతూ ఉంటే ఆరోగ్య సమస్యలకు సంకేతంగా మారవచ్చు. శరీరం ఇస్తున్న హెచ్చరికలను పట్టించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈ సమస్యలకి కారణాలేంటో తెలుసుకొని పరిష్కార మార్గాలను పాటించాలి.

రాత్రి నిద్రలో కొన్నిసార్లు మేల్కొని మళ్లీ పడుకోవడం సాధారణమే. కానీ ఇది తరచూ జరిగితే మాత్రం మన శరీరం ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటోందని అర్థం చేసుకోవాలి. నిద్రలో ఎక్కువసార్లు మేల్కోవడం ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తరచుగా నిద్రలో ఎందుకు మేల్కుంటామో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- మానసిక ఒత్తిడి, ఆందోళన.. రోజువారీ జీవితంలో ఉండే ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు నిద్రను ప్రభావితం చేస్తాయి.
- కెఫిన్ లేదా ఇతర ఎనర్జీ డ్రింక్ లు.. నిద్రపోయే ముందు కాఫీ, టీ, లేదా ఇతర కెఫిన్ డ్రింక్ లు తాగడం వల్ల నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది.
- కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్.. కొన్ని రకాల మందులు నిద్రకు భంగం కలిగించవచ్చు.
- హార్మోన్ల మార్పులు.. ముఖ్యంగా మహిళల్లో నెలసరి సమయంలో, మెనోపాజ్ దశలో హార్మోన్ల మార్పులు నిద్రపై ప్రభావం చూపుతాయి.
- శారీరక సమస్యలు.. యాసిడ్ రిఫ్లక్స్, ఆస్తమా, తరచుగా మూత్ర విసర్జన వంటి ఆరోగ్య సమస్యలు రాత్రి నిద్రకు అడ్డుపడతాయి.
నిద్రకు సరైన సమయాన్ని పాటించకపోవడం, పడుకునే ముందు మొబైల్, టీవీ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా వాడటం కూడా నిద్రను దెబ్బతీస్తాయి. ఈ అలవాట్లు శరీరానికి అవసరమైన విశ్రాంతి దక్కకుండా చేస్తాయి. దీని వల్ల ఉదయం అలసట, నీరసం, శక్తిహీనతతో పాటు కోపం, నిరుత్సాహం లాంటివి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే ఇది మీ శరీరంలో ఏదో సమస్య ఉందని సూచించడమే. దీన్ని చిన్న సమస్యగా తీసుకోకూడదని.. దీర్ఘకాలంలో ఇది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర సమస్యలను పరిష్కరించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- నిద్ర సమస్యలు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. మీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సరైన చికిత్స చేయించుకోవాలి.
- ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కోవడం అలవాటు చేసుకోవాలి.
- సాయంత్రం, రాత్రి వేళల్లో కెఫిన్ ఉన్న డ్రింక్ లను తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి.
- యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు వంటి పద్ధతులతో ఒత్తిడిని తగ్గించుకోవాలి.
- మంచి, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అంది నిద్ర మెరుగుపడుతుంది.
ఈ చర్యలు తీసుకుంటే మీ నిద్ర సమస్యలు తగ్గి ఆరోగ్యం మెరుగవుతుంది. అందుకే రాత్రి నిద్రలో తరచుగా మేల్కొనిపోతే దాన్ని చిన్నదిగా తీసుకోకండి. మీ శరీరం ఇస్తున్న సంకేతాలను అర్థం చేసుకుని సరైన మార్గదర్శకంతో ఆరోగ్యకరమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి.