Diabetic Retinopathy: షుగర్ వ్యాధిగ్రస్తులకు కంటి సమస్యలు ఎందుకు వస్తాయో? తెలిస్తే షాకవుతారు
సమస్యను వైద్య పరిభాషలో డయాబెటిస్ రెటినోపతి అంటారు. ఇది కంటి పనితీరును ప్రభావితం చేసే డయాబెటిక్ పర్యవసానంగా డాక్టర్లు చెబుతూ ఉంటారు. రక్తంలో అధిక చక్కెర స్థాయి ఉంటే సున్నితమైన కణజాలం కారణంగా రెటీనాలోని రక్త నాళాలు దెబ్బతినే అవకాశం ఉంది.
మారుతున్న ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా వివిధ వ్యాధులు వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధి అందరికీ వస్తుంది. అయితే చాలా మంది షుగర్ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి వైద్య సాయం తీసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి శరీరంలోని షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటివి జరిగినప్పుడు కంటి చూపుపోతూ ఉంటుంది. ఇటీవల బలగం సినిమా సింగర్ అయిన కొమురయ్యకు కూడా ఇలా షుగర్ పెరగడం వల్ల కంటి చూపు పోయిందని అతని భార్య పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. అసలు షుగర్ పెరిగితే కంటి చూపు ఎందుకు పోతుందో? ఓ సారి తెలుసుకుందాం. ఈ సమస్యను వైద్య పరిభాషలో డయాబెటిస్ రెటినోపతి అంటారు. ఇది కంటి పనితీరును ప్రభావితం చేసే డయాబెటిక్ పర్యవసానంగా డాక్టర్లు చెబుతూ ఉంటారు. రక్తంలో అధిక చక్కెర స్థాయి ఉంటే సున్నితమైన కణజాలం కారణంగా రెటీనాలోని రక్త నాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాలక్రమేణా దెబ్బతిన్న రక్త నాళాలు ద్రవం లేదా రక్తాన్ని లీక్ చేస్తాయి. ఇది కంటి రెటీనాలో వాపునకు గురి చేస్తుంది. మరికొన్ని సందర్భాల్లో అసాధారణ రక్త నాళాలు రెటీనా ఉపరితలంపై కూడా పెరుగుతాయి. ఇది రెటీనాను మరింత దెబ్బతీస్తుంది. అలాగే దృష్టిని కూడా కోల్పోయేలా చేస్తుంది. అయితే కంటి చూపు మెరుగుపర్చుకోవడం వైద్యులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.
డయాబెటిస్ రెటినోపతిని నివారించండిలా
అదుపులో చక్కెర
మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా డయాబెటిక్ రెటినోపతిని నివారించవచ్చు. రక్తంలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటే రెటీనాలోని రక్త నాళాలను దెబ్బతింటాయి. కాబట్టి మీ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించి అదుపులో ఉంచుకోవడం ఉత్తమం.
జీవనశైలిలో మార్పులు
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలాగే సమర్థవంతమైన బరువును నిర్వహించడం కూడా డయాబెటిక్ రెటినోపతిని నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ జీవనశైలి మార్పులు మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, మధుమేహంతో పాటు ఇతర సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో మీకు సహాయపడతాయి.
రెగ్యులర్ కంటి చెకప్‌లు
డయాబెటిక్ రెటినోపతిని అదుపులో ఉంచుకోవాలంటే రెగ్యులర్‌గా కంటి పరీక్షలు చేయించుకోవడం చాలా ఉత్తమం. మీ కంటి వైద్యుడు మీ రెటీనాకు నష్టం కలిగించే సంకేతాలను తనిఖీ చేసి అవసరమైతే చికిత్సను కూడా అందిస్తారు. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు కనీసం సంవత్సరానికి ఒకసారైనా సమగ్ర కంటి పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ధూమపానానికి దూరం
ధూమపానం మీ డయాబెటిక్ రెటినోపతితో పాటు మధుమేహం ద్వారా వచ్చే ఇతర సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ధూమపానానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
వైద్య ప్రణాళికను పాటించడం
మీరు డయాబెటిక్ రెటినోపతితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తిస్తే మీ రెటీనాకు మరింత నష్టం జరగకుండా నిరోధించడానికి లేజర్ థెరపీ లేదా ఇంజెక్షన్ల వంటి చికిత్సలను వైద్యులు సిఫారసు చేస్తారు. కాబట్టి మీ వైద్యుని చికిత్స ప్రణాళికను కరెక్ట్‌గా అనుసరించాలి.