హాయిగా ఉంటుందని స్నానం చేసి పడుకుంటున్నారా..? ఇలా చేస్తే ఎంత డేంజరో తెలుసా..?
స్నానం చేసిన తర్వాత శరీరానికి ఒక తేలికైన భావన వస్తుంది. ఈ పరిస్థితిలో చాలా మందికి నిద్ర పట్టేస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం లేదా రాత్రివేళ స్నానం చేసే అలవాటు ఉన్నవారు.. స్నానం చేసిన వెంటనే మంచంలోకి వెళ్తారు. అయితే ఇది ఆరోగ్యపరంగా మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల శరీరానికి కొన్ని రకాల నష్టాలు కలగవచ్చు.

తల తడిగా ఉండగా నిద్రపోవడం వల్ల తలనొప్పి వస్తుంది.. తల తడిగా ఉన్నప్పుడు నిద్రపోతే శరీర ఉష్ణోగ్రత సమతుల్యం తప్పుతుంది. శరీరంలోని రక్త ప్రసరణలో అడ్డంకం ఏర్పడి మెదడుపై ఒత్తిడి పడుతుంది. దీని వల్ల తీవ్రమైన తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
తల తడి సరిగా ఆరకుండా నిద్రపోతే శరీరం చల్లబడిపోయి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దానితో పాటు గాలి లేదా చలిలో పడుకున్నప్పుడు శరీరం సులభంగా వైరస్ లకు గురవుతుంది. దీని వల్ల దగ్గు, జలుబు, జ్వరం లాంటి జబ్బులు రావచ్చు.
తడిగా ఉన్న తలతో నిద్రపోతే తలపై బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. ఇది జుట్టు వేర్లను బలహీనపరచి జుట్టు ఊడిపోవడానికి దారితీయవచ్చు. జుట్టు మెరుపు తగ్గిపోతుంది. కొంతమందికి తలపై దురద, దద్దుర్లు కూడా రావచ్చు.
స్నానం తర్వాత నిద్రపోవడం శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. దీని వల్ల కండరాల లవణ సమతుల్యత దెబ్బతిని నొప్పులు కలగవచ్చు. ఎక్కువ కాలం ఇలా చేస్తే ఇది త్వరగా కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులకు కారణం కావచ్చు.
తల తడి లేదా శరీరం పూర్తిగా ఆరకుండానే పడుకోవడం వల్ల రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపి అజీర్ణం, గ్యాస్, కడుపులో మంట లాంటి సమస్యలకు దారితీయవచ్చు.
తడిగా ఉన్న తలతో పడుకుంటే దిండు లేదా మంచంపై తేమ చేరుకుంటుంది. ఇది ఫంగస్, బ్యాక్టీరియా పెరగడానికి దారితీయవచ్చు. దీని వల్ల ముఖం మీద మొటిమలు, చర్మం మీద దద్దుర్లు లేదా అలర్జీ లాంటి సమస్యలు రావచ్చు.
స్నానం తర్వాత తల బాగా ఆరిపోయేలా చూసుకోవాలి. తల ఆరిన తర్వాతే పడుకోవడం మంచిది. కనీసం ఒక గంట గ్యాప్ ఇవ్వడం ద్వారా శరీర ఉష్ణోగ్రత సరిగా ఉంటుంది. అలాగే శరీరాన్ని హైడ్రేట్ చేసి మంచి ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ అలవాట్లతో ఆరోగ్యంగా ఉండటమే కాదు.. అనవసర సమస్యల నుంచి బయటపడవచ్చు. రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు కూడా చాలా మార్పులు తీసుకురాగలవని గుర్తుంచుకోండి.