Health Tips: కాటన్ బడ్స్‌తో చెవి క్లీన్ చేసుకుంటున్నారా?.. వారికి ఇది నిప్పుతో చెలగాటమే..
స్నానం చేసిన వెంటనే కొందరికి చెవులు మూసుకుపోయినట్టుగా.. చెవిలో ఏవో ద్రవాలు నిండినట్టుగా అనిపిస్తారు. ఇది చిన్న సమస్యగానే అనిపించినా ఓ పట్టాన వదిలిపెట్టదు. దీని కారణంగా కలిగే అసౌకర్యం అనుభవించేవారికే తెలుస్తుంది. అందుకోసం మీరు చేసే చిన్న పొరపాట్లు పెద్ద సమస్యనే తెస్తాయట..

చెవిలో ఏదో ఉన్న ఫీలింగ్ వదిలించుకోవడానికి ముందుగా చేసే పని ఇయర్ బడ్స్ తో వాటిని క్లీన్ చేసుకోవడం. కాసేపు వాటిని చెవిలో పెట్టి తిప్పితే గానీ చెవులు శుభ్రంగా ఉన్న భావన కలగదు. ఈ అలవాటు చాలా మందిలో ఉంటుంది. మార్కెట్లో దొరికే ఈ కాటన్ బడ్స్ ను కొని తెచ్చుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటారు. కానీ, వీటి కారణంగా మీ చెవులకు జరుగుతున్న డ్యామేజ్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా..
చెవులు క్లీన్ చేయాలా..?
చెవులను రెండ్రోజులకోసారో.. వారానికోసారో క్లీన్ చేయకుండా ఉండలేరు కొందరు. నిజానికి ఇలా చెవులను బయటి నుంచి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఎంత? పలువురు ఈ ఎన్ టీ నిపుణులు చెప్తున్నదాని ప్రకారం చెవులకు వాటంతట అవే శుభ్రం చేసుకునే లక్షణం ఉంది. చెవిలో పోగయ్యే వ్యాక్స్ లాంటి పదార్థం దానికదే బయటకు వెళ్లిపోతుంది. అంతకుముందే మీరు చెవిలో వస్తువులను పెట్టుకోవడం వల్ల ఆ వ్యాక్స్ ను మరింత లోపలకు నెట్టినట్టు అవుతుంది. ఇలా చెవిలోపల పేరుకుపోయిన వ్యాక్స్ గడ్డకట్టుకుపోతుంది. కొన్నిసార్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. దీనిని తొలగించడానికి వైద్యులు రోగికి అనస్తీషియా ఇవ్వాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది.
సొంత చికిత్స వద్దు..
చెవిలో వ్యర్థాలు పేరుకుపోయి గడ్డకట్టినట్టుగా అనిపిస్తుంటే దానిని తొలగించడానికి వేరే మార్గాలున్నాయి. ఇందుకోసం ఈఎన్‌టీ నిపుణుల దగ్గర ప్రత్యేక పరికరాలుంటాయి. గోరు వెచ్చని నీటిని వేసి సిరంజితో క్లీన్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఇది పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే జరగాల్సిన ప్రక్రియ.
చెవిలో నూనె వేస్తున్నారా?
చెవుల్లో నూనె వేయడం చేస్తే అందులో ఉన్న మైనం పొడిబారకుండా మరింత పేరుకుపోతుంది. దీంతో చెవిలోపల వాపు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. చెవి లోపల నీరు చేరితే ఇక ఆ బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. అందుకే ఇలాంటి సొంత చికిత్సలు చేయడం మానాలని వైద్యులు సూచిస్తున్నారు.
మధుమేహం ఉన్నవారికి రిస్క్..
మధుమేహం ఉన్నవారిలో సాధారణంగానే మాలిగ్నెంట్ ఓటిటిస్ ఎక్స్ టర్నా అనే సమస్య తలెత్తుతుంది. ఇది చెవి వెనకభాగంలో ఉండే దారుల్లో ఏర్పడుతుంది. దీని కారణంగా లోపలి చెవి, దవడ, ముఖం కండరాలను ప్రభావితం చేస్తుంది. షుగర్ ఉన్నవారు ఇయర్ బడ్స్ వాడటం, చెవిలో ఇతర ద్రవాలను వేసుకోవడం చేయకూడదు. లేదంటే వీరికి యాంటీబయోటిక్స్ తో చికిత్స చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో సర్జరీ కూడా అవసరం కావచ్చు.